గుంటూరు, జనవరి 22, (way2newstv.com)
ఏపీ టీడీపీ అధినేత, మాజీ సీఎం, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుకు వరస షాక్ లు తగులుతున్నాయి. ఆయనకు అధికారం పోవడం పెద్ద మైనస్ అని భావించి ఆవేదన చెందుతుంటే ఎన్నికల్లో ఓటమికన్నా కూడా తన పార్టీలో తాను నమ్మిన కీలక తమ్ముళ్లే టైం చూసుకుని దెబ్బేస్తుండడంతో చంద్రబాబు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఒక వైపు అధికారం కోల్పోయిన బాధ.. మరోపక్క, కలల రాజధాని అమరావతిని నామమాత్రం చేస్తున్నారనే ఆవేదన.. ఇంకోపక్క అధికార పార్టీ దూకుడు ముందు తాను తేలిపోతు న్నాననే ఆందోళన.. వీటిలోనే ఉక్కిరి బిక్కిరి అవుతున్న చంద్రబాబుకు ఇంకోపక్క సమయం చూసుకుని చావు దెబ్బతీస్తున్న తమ్ముళ్లు మరింత ఇబ్బందికరంగా పరిణమించారనేది వాస్తవం.
టీడీపీకి వరుస షాక్ లు
రాజకీయాల్లో నాయకుల పార్టీ మార్పు, గోడ దూకుడు, జంపింగులు మామూలే. దీనిని ఎవరూ తప్పు పట్టే పరిస్తితి లేదు. ఘనంగా చేసుకున్న ప్రజా ప్రాతినిథ్య చట్టాన్ని ఎవరు అధికారంలో ఉంటే వారు వారికి అ నుకూలంగా మార్చుకుంటున్న పరిస్థితుల నేపథ్యంలో నాయకులు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. ఈ పరిస్థితి గడిచిన ఐదేళ్లలో ఏపీలో అధికారంలో ఉన్న చంద్రబాబు చేసిన ఆకర్ష్‌తో మరింత పేట్రేగింది. వైసీపీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలను చంద్రబాబు తన పార్టీలోకి చేర్చుకుని, మంత్రులను సైతం చేశారు. సో.. సమయం చూసుకుని ఆయన ఎలా వైసీపీని దెబ్బకొట్టారో ఇప్పుడుఅదే ఫలితం ఆయన కూడా అనుభవిస్తున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయిఇసుక కుంభకోణానికి సంబందించి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేసిన చంద్రబాబు జగన్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే విజయవాడలో ఇసుక దీక్షను చేపట్టారు. దీనికి భారీ ఎత్తున ప్రచారం కూడా కల్పించారు. అయితే, అదే రోజు టీడీపీకి కీలక నాయకుడు, చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టీడీపీకి దూరమయ్యారు. అధికార పార్టీకి మద్దతిస్తున్నట్టు ప్రకటించారు. ఈ పరిణామం టీడీపీలో కలకలం రేపింది.అదేవిధంగా రాజధాని అమరావతిపై ఉద్యమం పేరుతో తీవ్రస్థాయిలో ఆందోళన చేస్తున్న సమయంలోనూ ఇదే తరహా దెబ్బపడింది. గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మద్దాలి గిరి టీడీపీకి బై చెప్పారు. అంతేకాదు, రాజధాని వికేంద్రీకరణను ప్రజా ప్రయోజనం ఆశించేవారు ఎవరైనా స్వాగతిస్తారని అన్నారు. ఇక, చంద్రబాబు ఐదేళ్లు రాజధాని కోసం ఏం చేశారని ప్రశ్నించారు. దీంతో అప్పటి వరకు చంద్రబాబు సంపాయించుకున్న క్రెడిట్ పోయింది. ఇక, ఇప్పుడు అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానులను ప్రతిపాదిస్తూ ప్రభుత్వం తీసుకువచ్చిన బిల్లులపై శాసన మండలిలో చర్చించి తిరస్కరించాలని టీడీపీ భావించింది.ఇంత కీలక సమయంలో మళ్లీ చంద్రబాబుకు గట్టి షాక్ తగిలింది. పార్టీకి చెందిన నేత, ఎమ్మెల్సీ, గుంటూరు జిల్లాకే చెందిన ఎస్సీ నేత డొక్కా మాణిక్యవరప్రసాద్ పార్టీ నుంచి జంప్ చేసేశారు. మండలికి హాజరు కాకుండా పరోక్షంగా అధికారపార్టీకి మేలు చేశారు. అలాగే మహిళా ఎమ్మెల్సీలు శమంతకమణి, రత్నాబాయ్ సైతం మండలి సమావేశాలకు డుమ్మా కొట్టేయడంతో పార్టీలో మరింత కలకలం రేగింది. మొత్తంగా చూస్తే.. చంద్రబాబుకు మంచి సమయంలో తమ్ముళ్లు వేటేస్తున్నారనే అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది.