మూడు రాజధానులు...లోకల్ బాడీ ఎలక్షన్స్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

మూడు రాజధానులు...లోకల్ బాడీ ఎలక్షన్స్

విజయవాడ, జనవరి 2, (way2newstv.com)
మూడు రాజధానుల చుట్టూ ఇపుడు ఏపీ రాజకీయం తిరుగుతోంది. దీని మీద నిర్ణయాన్ని ఏపీ క్యాబినెట్ ఇప్పటికైతే వాయిదా వేసింది కానీ పూర్తిగా ఇష్యూ ని క్లోజ్ చేయలేదు. దాంతో కొత్త ఏడాది కూడా ఇదే రాజకీయం రంజుగా సాగనుంది. అయితే మంత్రి వర్గ సమావేశంలో కొందరు మంత్రులు స్థానిక సంస్థల ఎన్నికల తరువాత రాజధాని అంశంపైన నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని ముఖ్యమంత్రికి సూచించినట్లుగా ప్రచారం సాగుతోంది. ఎందుకంటే ఈ ఎన్నికలు వైసీపీకి చాలా ముఖ్యం. బంపర్ మెజారిటీతో సార్వత్రిక ఎన్నిక‌ల్లో గెలిచిన వైసీపీ ఆ ఊపు నిలబెట్టుకోకుంటే ఇబ్బందులు రాజకీయంగా తప్పవ‌న్నది వైసీపీ నేతల్లో భయంగా ఉంది.ఏపీలో ఇపుడు హాట్ టాపిక్ ఇదే కావడంతో స్థానిక ఎన్నికల్లో అజెండా అవుతుందా అన్న ఆలోచన కూడా ఉంది. 
మూడు రాజధానులు...లోకల్ బాడీ ఎలక్షన్స్

వైసీపీలో మాత్రం దీని మీదనే చర్చ సాగుతోంది. ఇది ప్రతికూల అంశం అవుతుందని కోస్తాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు భయపడుతూంటే, ఇదే అంశం వైసీపీకి జనంలో పాజిటివ్ గా ఉంటుందని సీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన నేతలు, మంత్రులు అభిప్రాయపడుతున్నారు. అధికార వికేంద్రీకరణ అన్నది సాహసోపేతమైన నిర్ణయం అని కూడా ఉత్తరాంధ్ర నేతలు అంటూంటే, ఇది కొంతకాలం వాయిదా వేస్తే ఎన్నికల గండం గట్టెక్కుతామని కోస్తా మంత్రులు భావిస్తున్నారుట.దీని మీద హాట్ కామెంట్స్ చేస్తూ వస్తున్న స్పీకర్ తమ్మినేని సీతారాం మూడు రాజధానుల ప్రతిపాదన చాల గొప్ప నిర్ణయం అంటున్నారు. జగన్ ని తుగ్లక్ తో పోలుస్తున్న ప్రతిపక్షాలు ప్రజల తీర్పు కోరితే ఎవరు తుగ్లక్ అన్నది తెలుస్తుందని అంటున్నారు. మూడు రాజధానుల అంశమే స్థానిక ఎన్నికల్లో రిఫరెండం అవుతుందని కూడా తమ్మినేని వాదిస్తున్నారు. జనం కూడా సానుకూలంగా స్పందిస్తారని, వైసీపీకి మంచి మెజారిటీ ఇస్తారని కూడా స్పీకర్ విశ్వాసంతో ఉన్నారు. ఇక్కడే కాదు, 2024 ఎన్నికల్లో కూడా ఇదే అంశంపైన జనం తీర్పు చెప్పి విపక్షాలకు గుణపాఠం చెబుతారని తమ్మినేని ధీమాగా అంటున్నారు. శ్రీకాకుళానికి చెందిన స్పీకర్ కి విశాఖ రాజధాని కావడం మంచిగా ఉంది. ఆయన అందువల్ల రెఫరెండం అంటున్నారు. కానీ కోస్తా వారి బాధ వేరేగా ఉందని వైసీపీలో మరో చర్చ సాగుతోంది.ఈ విషయంలో జగన్ సైతం కొంత డైలామాలో ఉన్నట్లుగా తెలుస్తోంది. తనకు అన్ని ప్రాంతాలు కావాలని జగన్ మంత్రివర్గ భేటీలో అన్నట్లుగా ప్రచారం జరిగింది. తొందర ఏమీ లేదు, అందరినీ కలుపుకుని పోయి సామరస్యంగా నిర్ణయం తీసుకుందామని జగన్ భావిస్తున్నారుట. అమరావతి రైతుల ఆందోళన వెనక టీడీపీ ఉందని జగన్ తో సహా వైసీపీ పెద్దలు అంచనా వేస్తున్నారు. అయితే వైసీపీ నేతలు, కార్యకర్తలు కూడా చాలా చోట్ల కనిపించడమే కాదు, జగన్ కి వ్యతిరేకంగా కూడా వారు మాట్లాడిన సంగతిని పార్టీ పెద్దలు గమనించాలని సొంత పార్టీలోనే మరో చర్చ ఉంది. ఏది ఏమైనా కొత్త ఏడాదిలో జరగబోయే స్థానిక ఎన్నికల్లో మూడు రాజధానుల ముచ్చటపై జనం తీర్పు ఏంటన్నది తేలిపోతుందని అంటున్నారు. బహుశా దాన్ని చూశాకే వైసీపీ సర్కార్ ఏ విధంగా ముందుకు వెళ్ళాలో ఆలోచన చేస్తుందని కూడా అంటున్నారు.