పుర ఎన్నికల ఏర్పాట్లపై సమీక్ష - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

పుర ఎన్నికల ఏర్పాట్లపై సమీక్ష

హైదరాబాద్ జనవరి 08, (way2newstv.com):
రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూలుకనుగుణంగా మున్సిపల్ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో, ఎటువంటి ఇబ్బందులు ఏర్పడకుండా నిర్వహించడానికి తగు ఏర్పాట్లు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి   సోమేశ్ కుమార్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.బుధవారం బి.ఆర్.కె.ఆర్ భవన్ నుండి జిల్లా కలెక్టర్లతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సి.యస్ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్లు ఎన్నికల ప్రక్రియ పై పూర్తి స్ధాయి దృష్టి సారించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో మొదటిసారిగా పెద్ద ఎత్తున మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పోరేషన్లకు ఎన్నికలు నిర్వహిస్తున్నందున ఎన్నికల సిబ్భంది నియామకం, బ్యాలెట్ పేపర్ల ముద్రణ, బ్యాలెట్ బాక్స్ లు, పేపర్ల సేకరణ లాంటి  అంశాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అన్నారు.
పుర ఎన్నికల ఏర్పాట్లపై సమీక్ష

రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి, మంచిర్యాల, సంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో ఎక్కువ మున్సిపాలిటీలు ఉన్నందున ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ప్రతి మున్సిపాలిటీపై అవగాహన కలిగి ఉండాలన్నారు. కొత్త మున్సిపాలిటీల పై మరింత శ్రద్ధ వహించాలన్నారు.ఎన్నికల నిర్వహణకు సంబంధించి ప్రతిరోజు నిర్వహించవలసిన పనులపై ప్రత్యేక క్యాలెండర్ రూపొందించుకోవాలని, తిరస్కరించిన నామినేషన్లపై తగు జాగ్రత్త వహించాలన్నారు. ఎన్నికల నిర్వహణలో కలెక్టర్ల పాత్ర ముఖ్యమని, మొత్తం ఎన్నికల ప్రక్రియలో పూర్తిస్ధాయిలో పాల్గొనాలని అన్నారు. జిల్లాల వారిగా ఎన్నికల సన్నద్ధతపై కలెక్టర్లతో మాట్లాడారు.పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్ కుమార్ మాట్లాడుతూ కలెక్టర్లు మున్సిపల్ కమీషనర్లతో ఎన్నికల ప్రక్రియపై ప్రతి స్టేజిలోను క్లోజ్ లైజన్ కలిగి ఉండాలన్నారు. ఎన్నికలకు సంబంధించిన నివేదికలను క్రమం తప్పకుండా పంపాలని, వాటిని రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపవలసి ఉంటుందని తెలిపారు.  ఇందుకోసం  జిల్లాలో ప్రత్యేక మానిటరింగ్ సిస్టం ను ఏర్పాటు చేయాలన్నారు. ఎన్నికల ప్రక్రియకు సంబంధం ఉన్నఏ అధికారికి సెలవులు మంజూరు చేయరాదని, అనుమతి లేకుండా గైర్హాజరు అయినవారిపై తగు చర్యలు తీసుకోవాలని ఆయన కలెక్టర్లను ఆదేశించారు.  నామినేషన్లు, పోలింగ్, కౌంటింగ్ లాంటి ప్రతి ప్రక్రియకు సంబంధించి నిర్ధిష్ట సమయం ప్రకారం పూర్తి చేయటానికి ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు. జిల్లా స్ధాయిలో సమీక్షించాలన్నారు.   ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పురపాలక శాఖ  కమీషనర్  అండ్ డైరెక్టర్ టి.కె.శ్రీదేవి  పాల్గొన్నారు.