కాకినాడ, జనవరి 9, (way2newstv.com)
సంక్రాంతి పండుగ వచ్చిందంటే ఉభయ గోదావరి జిల్లాల్లో ఉండే సందడే వేరు. వీటిలో ముఖ్యమైనవి కోడిపందేలు. పందెం రాయుళ్లు ఆరు నెలల ముందు నుంచే పుంజులను సిద్ధం చేసేస్తారు. కొందరికైతే ఇది ఉపాధిలా మారిపోయింది. కోడిపుంజులను పెంచి భారీ ధరలకు విక్రయిస్తున్నారు. ఇలా విక్రయానికి సిద్దంగా ఉన్న 45 పందెం పుంజులను తూర్పుగోదావరి జిల్లా మలికిపురం పోలీసులు పట్టుకున్నారు.నెల్లూరు జిల్లా నాయుడుపాలెం పట్టణానికి చెందిన దేవరకొండ సుబ్బారాయుడు, దేవరకొండ మధు, పాలకిర్తి నానయ్య, నాగయ్య, సీనయ్య, దాసరి రామస్వామిలతో కూడిన బృందం సుమారు 50 పందెం కోళ్లను లారీలో తీసుకొచ్చి మలికిపురంలోని పద్మ థియేటర్ సమీపంలో మంగళవారం ఆమ్మకానికి పెట్టారు.
పందెం కోళ్లు
దీనిపై సమాచారం అందుకున్న మలికిపురం ఎస్ఐ కె.వి.రామారావు సిబ్బందితో దాడి చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అప్పటికే ఐదు పుంజులను అమ్మేయడంతో మిగిలిన 45 కోళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.నిందితులపై జంతు హింస చట్టం కింద కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. రాజోలు సర్కిల్ పరిధిలో పందెం కోళ్లను అమ్మినా, పందేలు నిర్వహించినా కఠినచర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న 45 పందెం కోళ్లు మలికిపురం పీఎస్‌లో ఉన్నాయి