ఏలూరు, జనవరి 28, (way2newstv.com)
పశ్చిమ గోదావరి జిల్లాలోని బలమైన క్షత్రియ సామాజికవర్గంలో ఆధిపత్య రాజకీయాలు రంజుగా సాగుతున్నాయి. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో పశ్చిమలో వైసీపీ భారీ విజయం సాధించింది. ఈ క్రమంలోనే క్షత్రియ వర్గం వైసీపీకి సాయం చేసింది. కీలకమైన ముదునూరి ప్రసాదరాజు, శ్రీరంగనాథరాజు, కనుమూరి రఘురామ కృష్ణంరాజు వర్గాలు సంయుక్తంగా ఉండి పార్టీ కోసం కృషి చేశారు. గతంలో ఎప్పుడూ లేనట్టుగా జగన్ ఈ ఒక్క జిల్లాలోనే ఈ వర్గానికి ఏకంగా మూడు అసెంబ్లీ, ఓ ఎంపీ సీటు కేటాయించారు. వీరిలో ఉండి సీటు మినహా ఆచంట, నరసాపురం అసెంబ్లీ సీట్లతో పాటు నరసాపురం ఎంపీ సీటు నుంచి వైసీపీ విజయం సాధించింది.ఎన్నికల్లో గెలవడం వరకు బాగానే ఉన్నా.. తర్వాత మాత్రం ఈ నాయకుల మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గుమనే పరిస్థితి తలెత్తింది.
పశ్చిమ వైసీపీలో ఆధిపత్య రాజకీయాలు
ప్రస్తుతం ఎవరి ప్రయోజనాలు వారివే అనేలా నాయకులు వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా మంత్రి వర్గంలో చోటు దక్కించుకున్న రంగనాథరాజు, కేబినెట్ సీటును కోల్పోయిన ప్రసాదరాజు.. రెండు వర్గాలుగా విడిపోయారు. అదే సమయంలో ఎంపీ కనుమూరి స్వయం కృతం కారణంగా పార్టీ అధినేత జగనే ఆయనను పట్టించుకోవద్దని ఆదేశాలు జారీ చేయడంతో ఆయనను ఎవరూ పట్టించుకోవడం లేదు. ఏదైనా కార్యక్రమానికి ప్రొటోకాల్ మేరకు పిలిచినా ఆయనను అంత వరకే పరిమితం చేస్తున్నారు.దీంతో ప్రతి కార్యక్రమానికీ మంత్రి రంగనాథ రాజు హాజరవుతున్నారు. అయితే, తనకు రావాల్సిన మంత్రి పీఠాన్ని లాబీయింగ్ ద్వారా దక్కించుకున్నారని రంగనాథరాజుపై ప్రసాదరాజు గుస్సాగా ఉన్నారన్నది వైసీపీ వర్గాల నుంచే వినిపిస్తోన్న మాట. ఇక, తన మంత్రి పీఠాన్ని మరో రెండేళ్త తర్వాత కూడా కొనసాగించుకునేందుకు ఇప్పటి నుంచే మంత్రి రంగనాథరాజు ఆధిపత్య రాజకీయాలకు తెరదీశారు. దీంతో ప్రసాదరాజుకు, మంత్రికి ఏమాత్రం పడడం లేదు. ఈ ప్రభావం డెల్టాలోని కోడి పందేలపై కూడా పడింది. కోడి పందేలు నిర్వహించకుండా పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారు.వాస్తవంగా జగన్ ఈ సారి కోడిపందాలపై ఉక్కుపాదం మోపారు. భోగి పండగ మధ్యాహ్నం వరకు అనుమతులు రాలేదు. చివర్లో ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లతో పందాలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ప్రభుత్వ ఆదేశాలు స్ట్రిక్ట్‌గా పాటించేలా మంత్రి రంగనాథరాజు పోలీసులపై ఒత్తిళ్లు తేవడంతో డెల్టాలో పందేలు నిర్వహించిన వైసీపీ సానుభూతిపరులు గట్టిగా నష్టపోయినట్టు చర్చలు నడుస్తున్నాయి. ఇలా పోలీసుల దూకుడు వెనుక మంత్రి హస్తం ఉందని స్థానికులు అంటున్నారు. మంత్రి ఇలా చేయడం వెనక తన మాట వినని సొంత పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లను టార్గెట్ చేయడమే అంటున్నారు. దీంతో రంగనాథరాజుకు ఇప్పుడు యాంటీ వాయిస్ పెరుగుతోంది. మరోపక్క, ఇంచార్జ్‌లను కూడా డమ్మీ చేసేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు.ఇటీవల ఉండి, పాలకొల్లులో మీటింగ్ పెట్టాలని ఇంచార్జ్‌లకు తెలియకుండా ప్రయత్నించారు. దీంతో ఇది అసహనానికి దారితీసింది. మంత్రి పెత్తనంపై స్థానిక నాయకులు రగిలిపోతున్నారు. రంగ నాథరాజుని టార్గెట్ చేస్తున్నారు. తనకు వ్యతిరేకంగా ఉన్న ఎమ్మెల్యేలు.. నాయకులను దెబ్బతీస్తున్న మంత్రిపై సీఎంకు ఫిర్యాదు..చేయాలని నిర్ణయానికి వచ్చారు. వాస్తవానికి ఇప్పటికే జగన్ పలు విషయాల్లో దూకుడు తగ్గించుకోవాలని మంత్రి రంగనాథ రాజుకు సూచించారు. అయినా కూడా ఆయన తన ధోరణిని ఏమాత్రమూ మార్చుకోక పోవడం గమనార్హం. మంత్రికి అటు నరసాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజుతోనే కాకుండా ఇటు ఎంపీ రఘురామకృష్ణంరాజుతో కూడా పొసగడం లేదంటున్నారు. మంత్రి రంగనాథ రాజు డెల్టాలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లోనూ వేలు పెట్టడంతో పాటు తన కోటరీ ఏర్పాటు చేసుకోవాలని చేస్తోన్న ప్రయత్నాలు సొంత పార్టీ నేతలకే నచ్చడం లేదు. జగన్ ఆయన్ను వారించినా ఆయన మాత్రం వినడం లేదంటున్నారు. మొత్తంగా చూస్తే.. పశ్చిమలో క్షత్రియ ఆధిపత్య రాజకీయాలు సంక్రాంతి పుంజులై కొట్లాడుకుంటున్నాయని అంటున్నారు రాజకీయ పరిశీలకులు.