న్యూఢిల్లీ, జనవరి 10, (way2newstv.com)
నిన్న మొన్నటి వరకు ఆయన దూకుడు ప్రదర్శించారు. తాను స్పందిస్తే కేంద్రం స్పందించినట్టే నని వ్యాఖ్యలు సైతం చేశారు. కానీ, ఇంతలోనే సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు కనీసం ఆయన ఎక్కడ ఉన్నారో కూడా తెలియని పరిస్థితి వచ్చేసింది. ఆయనే బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి. టీడీపీ నుంచి బీజేపీలోకి జంప్ చేసిన కేంద్ర మాజీ మంత్రి రాష్ట్ర రాజకీయాలపై తరచుగా స్పందిస్తున్నారు. ముఖ్యంగా జగన్‌ను దోషిగా నిలబెట్టే గ్రూప్‌లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల రాజధాని విషయంపై ఆయన భారీ స్థాయి డైలాగులతో స్పందించారు.కేంద్రం రాజధాని తరలింపును చూస్తూ ఊరుకోదని మొదట్లో వ్యాఖ్యలు చేసింది కూడా సుజనా చౌదరే. ఆయన తర్వాతే కన్నా వంటి నాయకులు స్పందించారు.
సుజనా సైలెంట్ అయ్యారే...
అంతేకాదు, రాజధానిలో ఆందోళనలు చేస్తున్న వారికి సుజనా సంఘీబావం కూడా ప్రకటించారు. వారి మధ్యకు వెళ్లి కూర్చున్నారు. వారిలో భరోసా నింపారు. మీరు మరింత ఆందోళన చేయండి కేంద్రం పట్టించుకోవడం ఖాయం, జగన్ కు బుద్ధి చెప్పడం ఖాయం అంటూ వ్యాఖ్యలు సంధించారు.దీంతో రాజధాని ప్రజలు మరింతగా రెచ్చిపోయారు. ఏకంగా రాష్ట్రపతికి కేంద్రానికి కూడా లేఖలు రాయడం ప్రారంభించారు. అయితే, అనూహ్యంగా ఆరోజు తర్వాత సుజనా చౌదరి మళ్లీ ఎక్కడా కనిపించలేదు. కనీసం రాజధానిపై ఎలాంటి ప్రకటనలూ చేయడం లేదు. కేంద్రం చూస్తూ ఊరుకోదని చెప్పిన నాయకుడు ఎక్కడ ఉన్నాడో కూడా తెలియడం లేదు. దీంతో ఆయనకు కేంద్రంలోని పెద్దలు గట్టిగానే షాక్ ఇచ్చారని ప్రచారం జరుగుతోంది.ఇప్పటికే రాష్ట్రాల విషయంలో కేంద్రం జోక్యం చేసుకుంటోందనే అపవాదు ఉందని , ఇప్పుడు ఏపీ రాజధాని విషయంలో జోక్యం చేసుకుంటే ఇది మరింత చెడ్డ పేరు తెస్తుందని, అందుకే కేంద్రం సైలెంట్‌గా ఉందని కాబట్టి ఎవరూ ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని కేంద్రం నుంచి సుజనా చౌదరికి గట్టిగానే వార్నింగ్ వచ్చిందనే ప్రచారం జరుగుతోంది. దీంతో ఆయన పూర్తిగా సైలెంట్ అయ్యారని అంటున్నారు. మరి సుజనా ఎప్పుడు బయటకు వస్తారో ఏం మాట్లాడాతారో ? చూడాలి.