రెండేళ్ల నుంచి ఒడిశా మండలి పెండింగే... - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

రెండేళ్ల నుంచి ఒడిశా మండలి పెండింగే...

భువనేశ్వర్, జనవరి 25 (way2newstv.com)
శాసనమండలిని రద్దు చేస్తారన్న ఊహాగానాలు ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో విన్పించాయి. ప్రభుత్వం ప్రవేశపెట్టే బిల్లులను శానసమండలిలో బలంగా ఉన్న విపక్షం పదే పదే అడ్డుకుంటుండటంతో మండలిని రద్దు చేస్తారన్న ప్రచారం జరిగింది. అయితే ఒడిశాలో మాత్రం శాసనమండలి కావాలంటున్నారు. ఈ మేరకు శాసనసభలో తీర్మానం చేసిిన ఒడిశా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి పంపింది. పార్లమెంటు ఒడిశా శాసనమండలి ప్రతిపాదనను ఆమోదించాల్సి ఉంటుంది.ఎక్కడైనా ఒక్కటే సమస్య. పదవులు. ఇటీవల కాలంలో ఎన్నికల సమయంలోనే రాజకీయ నేతలు పార్టీ అధినేతలకు ఫిట్టింగ్ లు పెడుతున్నారు. తమకు టిక్కెట్ రాకుంటే ఏదైనా పదవి ఇవ్వాలని ముందుగానే ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. 
రెండేళ్ల నుంచి ఒడిశా మండలి పెండింగే...

దీనికి ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కూడా అతీతులు కారు. ఆయన గత ఏడాది జరిగిన ఎన్నికలలో ఎంతో మంది ఆశావహులకు హామీ ఇచ్చారు. ఎమ్మెల్సీ పదవి ఇస్తామని నమ్మబలికారు.నిజానికి ఒడిశా అసెంబ్లీ 2018లోనే ఇక్కడ శాసనమండలిని ఏర్పాటు చేయాలని తీర్మానం చేసి పంపింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రలలో శాసనమండలి వ్యవస్థ ఉంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, నాగాలాండ్ రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కూడా శాసనమండలి డిమాండ్ కొంతకాలంగా ఉంది. ఈ ప్రతిపాదనలన్నీ పెండింగ్ లో ఉన్నాయి. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ శాసనమండలిని ఏర్పాటు చేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.ఒడిశాకు ఈ వ్యవస్థను ఇస్తే మిగిలిన మధ్యప్రదేశ్, రాజస్థాన్ లకు కూడా కేంద్రం ఓకే చెప్పాల్సి ఉంటుంది. ఇప్పటికే ఆ రాష్ట్రాల్లో పదవుల కోసం అధికార కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తులు తలెత్తాయి. శాసనమండలి వ్యవస్థను ఇవ్వడం ద్వారా అక్కడ అధికార కాంగ్రెస్ కొంత అసంతృప్తులకు చెక్ పెట్టే అవకాశముంది. అందుకే ఈ పార్లమెంటు సమావేశాల్లోనూ ఒడిశా శాసనమండలి ప్రతిపాదనకు మోక్షం లభించదంటున్నారు. మొత్తం మీద నవీన్ పట్నాయక్ కు బీజేపీ ఇద్దామని ఉన్నా మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల విషయంలో కమలనాధులు వెనకడుగు వేస్తున్నారంటున్నారు.