అమరావతి జనవరి 4, (way2newstv.com)
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో విద్యార్ధి, యువజన సంఘాల జెఏసి ప్రతినిధులు శనివారం భేటీ అయ్యారు. వారితో చంద్రబాబు మాట్లాడుతూ అమరావతిని కాపాడుకోవడం చారిత్రక అవసరం..మీ రాజధాని ఏదని అడిగితే ఎవరైనా ఒకేపేరు చెబుతారు, మీరు మాత్రం 3పేర్లు చెప్పే పరిస్థితి తెచ్చారు. రాజధానిని మారుస్తామన్న ముఖ్యమంత్రిని స్వతంత్ర భారత చరిత్రలో చూడలేదు. అప్పుడెప్పుడో తుగ్లక్ ఒక్కడే చేశాడు..ఈ సిఎం వితండవాదం రాష్ట్రానికి శాపంగా మారింది. అమరావతి నిర్మాణానికి రూ.లక్ష కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు అవుతుందని సూటిగా ప్రశ్నిస్తున్నానని అన్నారు. హైకోర్టు, అసెంబ్లీ, సెక్రటేరియట్ అనేక శాఖల భవనాలు ఇక్కడే ఉన్నాయి.
చిరునామా కోసం యువత అలోచించాలి
పైసా ఖర్చులేకుండా వాటినే ఉపయోగించండి. ఇప్పటికే ఇక్కడ రూ.10వేల కోట్ల ఖర్చు చేశాం. మరో రూ3వేల కోట్లు ఖర్చు చేస్తే మిగిలినవీ పూర్తవుతాయి. ప్లాట్లు రైతులకు ఇవ్వగా 10వేల ఎకరాల భూమి ఉంటుంది. దానిని అమ్మగా వచ్చిన డబ్బుతో అభివృద్ధి పనులు పూర్తి చేయవచ్చు. అమరావతిని ప్రారంభించాను కాబట్టి నాకు పేరు రావాలని కాదు. హైదరాబాద్ లో చేసిన అభివృద్ది పేరుకోసం కాదు. మనం చేసిన అభివృద్ది చూస్తే మనకెంతో సంతృప్తి కలగాలి. నేను తిందామని పండ్ల చెట్టు నాటలేదు. భావితరాలు తింటారని నాటిన పండ్ల చెట్టును పీకేసేవాళ్లను ఏమనాలని ప్రశ్నించారు. 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఇలాంటి ముఖ్యమంత్రిని చూడలేదు. పెట్టుబడులు పెట్టడానికి రాష్ట్రానికి వస్తే ఎక్కడికి రావాలి. 3 రాజధానుల చుట్టూ పారిశ్రామిక వేత్తలు తిరగాలా.. 3 చోట్లా తిరిగి పరిశ్రమలకు అనుమతులు పొందాలా..? విమానాలు కూడా లేకుండా చేశారు వాళ్లు తిరగడానికి.. వచ్చిన విమానాలను కూడా లేకుండా పుణ్యం కట్టుకున్నారు..కర్నూలులో విమానాలను రాకుండా చేశారు. విశాఖ, గన్నవరంలో విమానాలను రద్దు చేయించారు. శివ నాడార్ ను కారులో ఎయిర్ పోర్ట్ దాకా సాగనంపింది నా కోసమా..? సౌత్ కొరియా వెళ్లి కియాను తెచ్చింది నా కుటుంబం కోసమా..? అదానిని ఒప్పించి విశాఖకు డేటా సెంటర్ తెచ్చింది నా కోసమా..? ముఖేష్ అంబానిని బతిమాలి రిలయన్స్ తిరుపతిలో తెచ్చింది నా వాళ్ల కోసమా..? నాకు ఉద్యోగం కోసం వీళ్లందరి చుట్టూ తిరగలేదు. భావి తరాల భవిష్యత్ కోసం దేశాలన్ని తిరిగి కంపెనీలను తెచ్చాను. వాటన్నింటినీ పోగొడితే ఎంత బాధగా ఉంటుంది. సచివులు ఉండేది సచివాలయం. సచివులు ఒకచోట, సచివాలయం మరోచోట..ముఖ్యమంత్రి ఒకచోట, మంత్రులు ఇంకోచోట.. గవర్నర్ ఒకచోట, ముఖ్యమంత్రి ఇంకోచోట.. సెక్రటేరియట్ ఒకచోట, హెచ్ వోడిలు మరోచోట..ఈ చర్యలను ఏమనాలని అయన అడిగారు. రాజధాని అంశం ఒక వ్యక్తి సమస్య కాదు..5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల సమస్య..ఇది ఒక ప్రాంత సమస్య కాదు, యావత్ రాష్ట్రంలో 13జిల్లాల సమస్య. మనకు చిరునామా ఉండాలని యువతరం ఆలోచించుకోవాలి. ఇది నా రాజధాని అని గర్వంగా చెప్పుకోవాలి. దాని కోసమే ఇన్నాళ్లూ తపన పడ్డాను, దేశవిదేశాలు తిరిగి పెట్టుబడులు రాబట్టాను. అన్ని జిల్లాలలో ఉపాధి అవకాశాలను విస్తృతం చేశాను.మైక్రోసాఫ్ట్ తో హైదరాబాద్ ఎంత అభివృద్ది చెందిందో డేటా సెంటర్ తో విశాఖ పట్నాన్ని అంతగా అభివృద్ది అయ్యేది. హైటెక్స్ కన్నా మిన్నగా విశాఖలో లులూ కన్వెన్షన్ సెంటర్ వస్తే, పర్యాటకంగా అభివృద్ది చెందేది. వాటన్నింటిని పోగొట్టి విశాఖపై కపట ప్రేమ నటిస్తున్నారు. తిరుపతిని హార్డ్ వేర్ హబ్ గా చేసేందుకు రిలయన్స్ కంపెనీ తెస్తే దానిని పోగొట్టారు. ప్రకాశం యువత ఉపాధి కోసం రూ.25వేల కోట్ల పేపర్ అండ్ పల్ప్ ఇండస్ట్రీ తెస్తే దానిని పోగొట్టారు. ఓర్వకల్లులో విమానాశ్రయం తెస్తే, విమానాలు రాకుండా చేశారు. కేంద్రం ఇచ్చిన 12 అత్యున్నత సంస్థలను ఒకేచోట అమరావతిలో నెలకొల్పలేదు. ఒక్కోజిల్లాలో ఒక్కో విద్యాసంస్థను నెలకొల్పాం. గిరిజన విశ్వవిద్యాలయం విజయనగరంలో, ట్రిపుల్ ఐటి కర్నూలులో, ఎన్ ఐటి పశ్చిమ గోదావరిలో, ఐజర్ తిరుపతిలో, అలా అన్నిచోట్ల ఏర్పాటు చేశాం. టిడిపి 5ఏళ్ల పాలనలో ఎప్పుడైనా ఫీజుల కోసం విద్యార్ధులు రోడ్డెక్కారా..? ప్రతి ఏడాది సక్రమంగా ఫీజులు, స్కాలర్ షిప్ లు చెల్లించాం తీవ్ర ఆర్ధిక లోటులో కూడా..అలాంటిది ఇప్పుడు 7నెలలుగా విద్యార్ధులకు ఫీజుల చెల్లింపు లేదు. ఆవేదనతో రోడ్డెక్కిన విద్యార్దులను లాఠీలతో కొడతారా..? పోలీస్ స్టేషన్లలో అక్రమంగా నిర్బంధిస్తారా..? ఎందుకని విద్యార్ధులకు ఫీజులు చెల్లించలేదు..? ఆదాయం పడిపోయింది కాబట్టే చెల్లించలేదు.. పరిశ్రమలు తెస్తే, అభివృద్ది చేస్తే, వ్యాపారాలు పెంచితే ఆదాయం వస్తుంది..అవన్నీ పోగొట్టి ఆదాయానికి గండికొట్టి, ఆర్ధిక సంక్షోభంలోకి నెట్టారు.మాటలు చెప్పడం కాదు, మోసాలు చేయడం కాదు..ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వకుండా నవరత్నాల పేరుతో నయవంచన చేస్తున్నారు. ప్రాంతాల మధ్య విద్వేషాలు పెంచడం మంచిదికాదు. కుల ప్రస్తావన తెచ్చి ఎందుకు చీలిక తెస్తున్నారు సమాజంలో అని అయన అన్నారు.దక్షిణాదిలో ఏ రాష్ట్రానికి లేని వనరు గోదావరి జలాలు మనకున్నాయి. వాటి సక్రమ వినియోగంపై దృష్టి పెట్టకుండా ప్రాంతీయ విద్వేషాలు పెంచడం రెచ్చగొడతారా..? ముంపు ప్రమాదం అని, ఫౌండేషన్ ఖర్చు ఎక్కువ అని, ఒకే సామాజిక వర్గమని, ఇన్ సైడ్ ట్రేడింగ్ అని రకరకాల దుష్ప్రచారం అమరావతిపై చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇల్లు కూడా ఇన్ సైడ్ ట్రేడింగ్ కాదా..?బినామీలని జగన్మోహన్ రెడ్డి విమర్శించడం హాస్యాస్పదం. ఆయన ఇల్లు ఎవరి పేరుమీద ఉంది..? బినామీల పేరుతో ఉన్న ఇంట్లో ఉంటూ ఇతరులపై గడ్డలేస్తే అవి మీకే తగుల్తాయి. ఈ రోజు ఒక సమస్య వస్తే ఇది నాది కాదని గమ్మున ఉంటే, రేపు మీకా సమస్య వస్తుందని గుర్తుంచుకోండి. పోరాడకపోతే అంధకారమే మిగులుతుంది. పోరాడితేనే న్యాయం జరుగుతుంది. అందరికీ అర్ధం అయ్యేలా చెప్పండి, ప్రజల్లో చైతన్యం తీసుకురండి. విద్యార్ధి యువజన సంఘాల జెఏసికి తెలుగుదేశం పార్టీ సహకారం తప్పకుండా ఉంటుందని’’ చంద్రబాబు పేర్కొన్నారు.