హైద్రాబాద్, జనవరి 7 (way2newstv.com)
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ-ఇస్రో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టబోయే మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్‌యాన్ కోసం హైదరాబాద్ నుంచి కొన్ని కీలక పరికరాలు ఇస్రోకు వెళ్తున్నాయి. నగరంలోని కంచన్ బాగ్‌లో రక్షణశాఖకు చెందిన మిశ్రధాతు నిగమ్ లిమిటెడ్ (మిధానీ)లో తయారైన పరికరాలను ఇస్రోకు తరలిస్తున్నారు. అంతరిక్ష వాహక నౌకలో ఉపయోగించే ఇగ్నిటర్ బాక్స్ కోసం అవసరమైన పరికరాలను మిధానీలో తయారు చేశారు.ఇగ్నిటర్ బాక్స్‌లో వాడే త్రోట్ సెట్టింగ్ రింగ్స్, అల్ట్రా హై స్ట్రెంత్‌ను మొదటిసారిగా తయారుచేసి సోమవారం ఇస్రోకు పంపించారు. పరికరాలతో కూడిన వాహనాలను హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ డైరెక్టర్లు డాక్టర్ ఎస్.ఉన్నికృష్ణన్ నాయర్, డాక్టర్ సంజయ్ కుమార్ జెండా ఊపి ప్రారంభించారు.
గగన్ యాన్ లో హైద్రాబాద్....
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇగ్నిటర్ బాక్స్‌లో వాడే పరికరాలతోపాటు రాకెట్ ఇంజిన్ కోసం నాజిల్, గ్యాస్ బాటిల్స్, క్రయోజెనిక్ ఎగువదశ భాగాల కోసం టైటానియం పదార్థాలనూ ఇస్రోకు సరఫరా చేస్తున్నామని చెప్పారు. మిధానీ, ఇస్రో నాలుగేళ్ల నుంచి కలిసి పనిచేస్తున్నాయని తెలిపారు. కార్యక్రమంలో మిధానీ సిబ్బంది పాల్గొన్నారు.తొలిసారిగా మానవులను అంతరిక్షంలోకి పంపేందుకు ఇస్రో రూపొందించిన ప్రాజెక్టు పేరే గగన్‌యాన్. కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతూనే 2020లో నిర్ధేశించుకున్న లక్ష్యాలను ఇటీవల ఇస్రో ఛైర్మన్ శివన్ వెల్లడించారు. 2020లో గగన్‌యాన్ ప్రాజెక్టుతో పాటు, చంద్రయాన్-3 ప్రాజెక్టు పనులు కూడా సక్రమంగా సాగుతున్నాయని కొద్ది రోజుల క్రితమే తెలిపారు. గగన్‌యాన్‌లో రోదసిలోకి వెళ్లేందుకు నలుగురు వ్యోమగాములను ఇస్రో ఎంపికచేసిన సంగతి తెలిసిందే. జనవరి మూడో వారం నుంచి వారికి రష్యాలో శిక్షణ మొదలు కానుందని శివన్ ప్రకటించారు.