పురసేవ యాప్ తో సమస్యల పరిష్కారం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

పురసేవ యాప్ తో సమస్యల పరిష్కారం

విజయవాడ, జనవరి 21, (way2newstv.com)
ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు రూపొందించిన ‘పురసేవ’ యాప్ ద్వారా పట్టణ ప్రాంతాల్లో పౌర సమస్యలను నిర్దిష్ట గడువులోగా పరిష్కరించేలా ప్రభుత్వం మార్గదర్శకాలను జారీచేసింది. ప్రజల నుంచి స్వీకరిస్తున్న ఫిర్యాదులు సంబంధిత విభాగం అధికారులకు చేరడానికి చాల సమయం పడుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఫిర్యాదులపై అధికారులు ఏ నిర్ణయం తీసుకున్నారో తెలుసుకోవడం కోసం ఫిర్యాదుదారులు పనులు మానుకుని పదే పదే కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోంది. నగర పాలక, పురపాలక సంస్థల్లో పనిచేసే సిబ్బంది అత్యధిక సమయం కార్యాలయాలకు దూరంగానే విధులు నిర్వహిస్తుంటారు. దీంతో వారిని సంప్రదించడం కూడా ఫిర్యాదుదారులకు ఇబ్బందిగా మారింది. 
పురసేవ యాప్ తో సమస్యల పరిష్కారం

దీనిని అధిగమించేందుకు పట్టణ ప్రాంతాలు, నగరాల్లో త్వరితగతిన పౌర సమస్యల పరిష్కారానికి ‘పురసేవ’ యాప్‌ను రూపొందించారు. ఈ యాప్ ద్వారా రహదారులు, పారిశుద్ధ్యం, తాగునీరు, వీధిలైట్లు, భవన నిర్మాణాలు తదితర వాటికి సంబంధించిన 91 రకాల సమస్యలను నేరుగా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువచ్చే విధంగా ఏర్పాట్లు చేశారు. సమస్యను ఈ యాప్‌లో నమోదు చేయగానే అది నేరుగా సంబంధిత క్షేత్రస్థాయి సిబ్బంది మొబైల్‌కు క్షణాల్లో చేరిపోతుంది. ఆ సమస్యను పరిష్కరించి ఫిర్యాదుదారుడికి తిరిగి సమాచారం ఇవ్వాలి.ఒకవేళ ఆ సమస్యను సంబంధిత ఉద్యోగి పరిష్కరించకుండా నిర్లక్ష్యం వహిస్తే నిర్దేశించిన గడువు ముగిసిన తర్వాత ఆ ఫిర్యాదు సంబంధిత ఉద్యోగి ప్రమేయం లేకుండానే పై అధికారి మొబైల్‌కు వెళ్తుంది. ఈ విధంగానే ఉన్నతాధికారులు డాష్ బోర్డ్‌కు వస్తుంది. ఈ డాష్ బోర్డును ఉన్నతాధికారులు ప్రతిరోజూ పర్యవేక్షిస్తుండటంతో క్షేత్రస్థాయిలో ఏమి జరుగుతుందో తెలిసిపోతుంది. పౌర సమస్యల పరిష్కారం విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సిబ్బందిపై తగు చర్యలు తీసుకునే అవకాశం ఏర్పడుతుంది.మంచినీటి పైపులైన్ల లీకేజ్, కలుషిత జలాలు సరఫరా, సక్రమంగా తాగునీరు సరఫరా కాకపోవడం, రహదారుల మీద గోతులు, నాసిరకం పనులు, మురుగునీటి కాలువలు శుభ్రం చేయకపోవడం, చెత్తను తొలగించకపోవడం, అక్రమ కట్టడాలు, ప్రభుత్వ స్థలాలు, ఫుట్‌పాత్‌ల ఆక్రమణ, నిబంధనలకు విరుద్ధంగా ప్రకటన బోర్డులు, వీధిలైట్లు వెలగకపోవడం, కుక్కల బెడద, పార్కులు, క్రీడా మైదానాలు నిర్వహణ తదితర సమస్యలను ఈ యాప్‌ద్వారా ఫిర్యాదు చేయవచ్చు.నగర పాలక సంస్థ, పురపాలక సంస్థల పరిధిలో స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ గూగుల్ ప్లేస్టోర్ నుంచి ‘పురసేవ’ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఈ యాప్‌లోని గ్రీవెన్స్ విభాగంలోకి వెళ్లి సమస్యలను నేరుగా టైప్ చేసి పంపించవచ్చు. లేదా ఫోటో తీసి ఆ ప్రాంతం వివరాలు రాసి పంపిస్తే సంబంధిత ఉద్యోగి మొబైల్‌కి చేరుతుంది. ఫిర్యాదుపై సంబంధిత ఉద్యోగి తీసుకున్న చర్యలను తిరిగి మళ్లీ ఫోటోద్వారా తెలియజేయడం ఈ యాప్ ప్రత్యేకత.బహుళ ప్రయోజనాలు ఇమిడి ఉన్న ఈ యాప్‌ను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పురపాలక శాఖ ఉన్నతాధికారులు నిర్ణయించారు. 14 కార్పొరేషన్లు, 96 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలలో పౌరులు ఈ యాప్‌ను వినియోగించుకునే వీలుంది. రెవెన్యూ, ఆరోగ్యం, ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ విభాగాల్లో ఏ సమస్య ఉన్నా ఇట్టే పరిష్కరించుకునే అవకాశం అరచేతిలోనే ఉంటుంది.