టీపీసీసీ కోసం పోటీ.. - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

టీపీసీసీ కోసం పోటీ..

హైద్రాబాద్, జనవరి 1, (way2newstv.com)
తెలంగాణ కాంగ్రెస్‌ సారథి రాబోతున్నాడనే విషయంలో ప్రస్తుత ఛీఫ్‌ క్లారిటీ ఇచ్చారు. మున్సిపాల్టీ ఎన్నికల తర్వాత పీసీసీ నుంచి తప్పుకోనున్నట్టు స్పష్టం చేశారు. హుజూర్‌నగర్‌కు పూర్తి స్థాయిలో సమయం కేటాయిస్తానని నియోజకవర్గ కార్యకర్తలకు హామీ ఇచ్చారు. దీంతో కొత్త సారథి ఎవరనే దానిపై పార్టీలో జోరుగా ఊహాగానాలు మరోసారి తెరమీదికి వచ్చాయి. గత కొంత కాలంగా టీపీసీసీ అధ్యక్షుడి నియామకం విషయంలో రేపు, మాపు అంటూ ప్రచారమే తప్ప ఇప్పటి వరకు ఆ పార్టీ అధిష్టానం నుంచి ఎలాంటి సంకేతాలు లేవు. దీంతో అసలు టీపీసీసీ చీఫ్‌ మార్పు ఉంటుందా ఉండదా అన్న చర్చ కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. 
టీపీసీసీ కోసం పోటీ..

అసెంబ్లీ, పార్లమెంటు, స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు తన సొంత నియోజకవర్గం హుజూర్‌నగర్‌లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఘోరంగా పరాభవాన్ని మూటగట్టుకుంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్టీలో ఉత్తమ్‌ నాయకత్వంపై వ్యతిరేకత పెరిగినా పీసీసీ మార్పు విషయంలో అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కొందరు సీనియర్‌ నేతలు ఉత్తమ్‌పై నేరుగా అధిష్టానానికి ఫిర్యాదు చేసినా పార్లమెంటు ఎన్నికలకు కూడా ఉత్తమ్‌ నే కొనసాగించింది. అయితే ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు హుజూర్‌నగర్‌ లో ఓటమితో తప్పుకోవాలనే ఒత్తిడి ఎక్కువ కావడంతో పాటు ఉత్తమ్‌ కూడా ఉప ఎన్నికల్లో నియోజకవర్గానికి ఎక్కువ సమయం కేటాయించకపోవడం వల్ల ఓటమి చవిచూడాల్సి వచ్చిందనే భావనలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన అధిష్టానానికి ఇప్పటికే తప్పుకుంటానంటూ కోరినట్టు తెలిసింది. ఈ మేరకు హైకమాండ్‌ కూడా అంగీకరించినట్టుగా సంకేతాలు పంపడంతో ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్టు చర్చ జరుగుతున్నది. అయితే ఉత్తమ్‌ తప్పుకుంటే తదుపరి స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారనేది హాట్‌టాపిక్‌గా మారింది.టీపీసీసీ రేసులో వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి పేరే ముందు వరుసలో ఉన్నా.. పార్టీలో సీనియర్లే ఆయనకు అడ్డుపడుతున్న విషయం అందరికీ తెలిసిందే. సాక్షాత్తు పార్టీ జాతీయ నాయకులు ఆజాద్‌ నగరానికి వచ్చిన సమయంలో రేవంత్‌కు పగ్గాలు అప్పగించే విషయంలో సీనియర్లు బాహాటంగానే అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే ఇందులో కొంతమంది సీనియర్లు రేవంత్‌ కు మద్దతు తెలపడం విశేషం. ఇదే సమయంలో రేవంత్‌కు టీపీసీసీ పదవి దక్కకుండా అప్పుడే పార్టీ హైకమాండ్‌కు రేవంత్‌ సొంత జిల్లాకు చెందిన ఇద్దరు నాయకులు విశ్వప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. వారిలో ఒక నేత ఢిల్లీలో మకాం వేసి హైకమాండ్‌ నేతలతో మంతనాలు చేస్తున్నట్టు సమాచారం. ఇదే సమయంలో పీసీసీ కోసం ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, సీనియర్‌ నేతలు జానారెడ్డి, షబ్బీర్‌ అలీ,వీహెచ్‌, జగ్గారెడ్డి తదితరులు కూడా ప్రయత్నిస్తున్నారు. అయితే హైకమాండ్‌ రేవంత్‌తో పాటు ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పేరును పరిశీలిస్తున్నట్టు కాంగ్రెస్‌లోనే చర్చ జరుగుతుంది