కనిపించకుండా పెరిగిపోయిన గ్యాస్ బండల ధరలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

కనిపించకుండా పెరిగిపోయిన గ్యాస్ బండల ధరలు

ముంబై, జనవరి 2  (way2newstv.com)
నాన్‌-సబ్సిడీ వంటగ్యాస్‌ ధర మళ్లీ పెరిగింది. సిలిండర్‌పై రూ.19 పెంచుతూ ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్‌ సంస్థలు  నిర్ణయం తీసుకున్నాయి. ఇలా పెరుగడం వరుసగా ఇది ఐదో నెల కావడం గమనార్హం. పెరిగిన ధరలు అమల్లోకి వచ్చేశాయి. గతేడాది సెప్టెంబర్‌ నుంచి రాయితీ లేని ఎల్‌పీజీ సిలిండర్‌ ధర క్రమేణా పెరుగుతుండగా, వినియోగదారులపై ఇప్పటిదాకా రూ. 139.5 భారం పడింది. ఆగస్టు 1న రూ.574.5గా ఉన్న సిలిండర్‌ ధర సెప్టెంబర్‌ 1న రూ.590కి పెరిగింది. ఆ తర్వాతి నుంచి ప్రతి నెలా ఒకటిన పెరుగుతూనే వస్తున్నది. తాజా పెంపు నేపథ్యంలో 14.2 కిలోల సిలిండర్‌ ధర ఢిల్లీలో రూ.714కు చేరింది. ఇంతకుముందు ధర రూ.695గా ఉన్నది. ఎల్‌పీజీ వినియోగదారులకు ఏటా 12 సిలిండర్లు రాయితీ ధరలకు అందుతున్నాయి. ఆపై సిలిండర్లు మార్కెట్‌ ధరకు లేదా నాన్‌-సబ్సిడీ ధరలకు కొనుక్కోవాల్సి వస్తున్నది. 
కనిపించకుండా పెరిగిపోయిన గ్యాస్ బండల ధరలు

ప్రస్తుతం ఢిల్లీలో సబ్సిడీ వంట గ్యాస్‌ ధర రూ.495.86గా ఉన్నది. కస్టమర్ల ఖాతాల్లోకే నేరుగా సబ్సిడీ సొమ్ము జమవుతున్న సంగతి విదితమే. మరోవైపు ముంబైలో ప్రభుత్వ పంపిణీ వ్యవస్థ ల ద్వారా విక్రయించే కిరోసిన్‌ లీటర్‌ ధర 26 పైసలు పెరిగి రూ.35.58కి చేరింది. కిరోసిన్‌పై సబ్సిడీ పోయేంత వరకు ప్రతి నెలా లీటర్‌కు 25 పైసల చొప్పున ధరలను పెంచాలని 2016లో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఢిల్లీ కిరోసిన్‌ రహిత ప్రాంతంగా ఉన్నది. ఇక్కడ పీడీఎస్‌ కిరోసిన్‌ అమ్మకాలు లేవు. దీంతో ముంబై ప్రామాణికంగా ఉన్నది.విమానయాన ఇంధనం ధర నూ 2.6 శాతం పెంచుతూ చమురు మార్కెటింగ్‌ సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. ఢిల్లీలో రూ.1,637.25 పెరిగి కిలో లీటర్‌  రూ. 64,323.76కు చేరింది. గత నెల కూడా ఏటీఎఫ్‌ ధరను పెంచిన విషయం తెలిసిందే. అయితే డిసెంబర్‌ 1న కేవలం రూ.13.88 పెరిగింది. ఇక తాజా వడ్డింపుల నేపథ్యంలో నిరుడు జూన్‌లోని గరిష్ఠ స్థాయికి ధరలు చేరాయి. విదేశీ మార్కెట్‌లో పెరిగిన ధరలే ఈ వడ్డింపులకు కారణమని ఆయిల్‌ కంపెనీలు పేర్కొన్నాయి.పెరిగిన ఏటీఎఫ్‌ ధరలు ఎయిర్‌లైన్స్‌పై ప్రభావం చూపనున్నాయి. అసలే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న విమానయాన సంస్థలకు ఈ ధరల పెరుగుదల మరింత భారం కానున్నది. దీంతో చార్జీల పెంపునకు అవకాశాల్లేకపోలేదని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. దేశీయ ఇంధన అవసరాల్లో 84 శాతం విదేశాల నుంచి దిగుమతుల ద్వారానే తీరుతున్నాయి. దీంతో అంతర్జాతీయ మార్కెట్‌ సగటు ధరలు, ముందటి నెల విదేశీ మారకపు రేటు ప్రామాణికంగా ప్రతి నెల ఒకటో తారీఖున ఎల్‌పీజీ, ఏటీఎఫ్‌ ధరలను చమురు విక్రయ కంపెనీలు సవరిస్తూపోతున్నాయి. ఇక పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ప్రతి రోజూ మారుతున్న సంగతి విదితమే. అయితే పెట్రోల్‌, డీజిల్‌ ధరల కంటే ఏటీఎఫ్‌ ధరే చౌకగా ఉండటం గమనార్హం. ఢిల్లీలో  లీటర్‌ పెట్రోల్‌ రూ.75.14, డీజిల్‌ రూ.67.96 పలుకగా, ఏటీఎఫ్‌ రూ. 64.32గానే ఉన్నది.