సిద్ధప్ప.. జోస్యాలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

సిద్ధప్ప.. జోస్యాలు

బెంగళూర్, జనవరి 25 (way2newstv.com)
మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కు ఎన్నో ఆశలున్నాయి. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలయినా ఆయనలో ఆశలు చావలేదు. ప్రస్తుత భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కుప్పకూలిపోతుందని ఆయన జోస్యాలపై జోస్యాలు చెబుతున్నారు. సిద్ధరామయ్య ఆశలన్నీ మంత్రి వర్గ విస్తరణపైనే ఉన్నట్లు కనపడుతుంది. మంత్రివర్గ విస్తరణ జరిగితే కమలం పార్టీలో అసంతృప్తి చెలరేగుతుందని ఆయన కలలు కంటున్నారు.ఇప్పటికే ఒకసారి చేయి కాల్చుకున్న భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం మంత్రి వర్గ విస్తరణపై ఆచితూచి అడుగులు వేస్తోంది. బీజేపీలో ఎలాంటి అసంతృప్తులు లేకుండా మంత్రి వర్గ విస్తరణ జరపాలని నిర్ణయించింది. 
సిద్ధప్ప.. జోస్యాలు

ఈ మేరకు బీజేపీ సీనియర్ నేతలతో అగ్రనాయకత్వం తరచూ టచ్ లో ఉంది. ఇప్పటికే యడ్యూరప్ప తమ ప్రభుత్వం ఏర్పడటానికి కారణమయిన వారికి మంత్రి పదవులు ఇవ్వాలని ఆయన పట్టుబడుతున్నారు.దీంతో అధిష్టానం గత నెలన్నర రోజులుగా కేంద్ర నాయకత్వం మంత్రి వర్గ విస్తరణను తరచూ వాయిదా వేస్తూ వస్తుంది. బీజేపీ సీనియర్ నేతలు ఖచ్చితంగా అసంతృప్తికి గురవుతారని సిద్ధరామయ్య అంచనా వేస్తున్నారు. అందుకే ఆయన మంత్రి వర్గ విస్తరణ తర్వాత ప్రభుత్వం కూలిపోతుందని పెద్ద ఆశలు పెట్టుకున్నారు. విస్తరణ తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద సంచలనాలు చోటు చేసుకుంటాయని కూడా సిద్ధరామయ్య చెబుతున్నారు. రాష్ట్ర రాజకీయాలు పరిశీలిస్తే బీజేపీ ప్రభుత్వం ప్రస్తుతం పూర్తిగా బలంతో ఉంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా డీలా పడింది. నాయకత్వ సమస్యను ఎదుర్కొంటోంది. మరోవైపు ప్రాంతీయ పార్టీ జేడీఎస్ కూడా పూర్తిగా బలహీనంగా ఉంది. దీంతో బీజేపీలో అసంతృప్తులు ఉన్నప్పటికీ వారు ఏం చేయగలరన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. అంటే సిద్ధరామయ్య కేవలం మైండ్ గేమ్ ఆడేందుకే ఈ వ్యాఖ్యలు చేస్తున్నారనది వాస్తవమేనని చెప్పాలి. బలమైన, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని వదిలి బలహీన పార్టీల వైపు ఎందుకు మొగ్గు చూపుతారని బీజేపీ నేతలు ఎదురు ప్రశ్నిస్తున్నారు.