ఎన్ హైచ్ పై స్పీడ్ బ్రేకర్ల తొలగింపు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఎన్ హైచ్ పై స్పీడ్ బ్రేకర్ల తొలగింపు

హైద్రాబాద్, జనవరి 8  (way2newstv.com)
జాతీయ రహదారులపై ప్రయాణం నిరాటంకంగా సాగే దిశగా కేంద్ర ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టింది. వాహనాల రాకపోకలు సాఫీగా సాగేందుకు వీలుగా నేషనల్ హైవేలపై అన్ని స్పీడ్‌ బ్రేకర్లను తొలగించేందుకు ప్రత్యేక డ్రైవ్‌ ప్రారంభించింది. ముఖ్యంగా టోల్‌ ప్లాజాల వద్ద ట్రాఫిక్‌ ఇబ్బంది తలెత్తకుండా చర్యలు చేపట్టాలని నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ)కు సూచించింది. ఈ మేరకు కేంద్ర రోడ్డు రవాణా, హైవే మంత్రిత్వ శాఖప్రకటన విడుదల చేసింది.టోల్‌ ప్లాజాల వద్ద ఉండే స్పీడ్‌ బ్రేకర్లు, రంబుల్ స్ట్రిప్స్ వల్ల వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతోందని రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీంతోపాటు అటు వాహనదారులు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపింది. 
ఎన్ హైచ్ పై స్పీడ్ బ్రేకర్ల తొలగింపు

హైవేలపై పదే పదే వేగాన్ని నియంత్రించడం వల్ల ఇంధన వినియోగం పెరగడం, వాహనాలు పాడవడం లాంటివి ఉత్పన్నం అవుతున్నాయని వివరించింది.తాజా చర్యలతో అటు వాహనదారులకు, ఇటు ప్రభుత్వానికి ఎంతో సమయం, డబ్బు ఆదా అవుతుందని ప్రకటనలో పేర్కొన్నారు. ఇంధన వినియోగం తగ్గితే కాలుష్యం కూడా తగ్గుతుందని తెలిపారు. కాలుష్యాన్ని నియంత్రించడం ద్వారా పర్యావరణానికి కూడా మేలు చేసినవారమవుతామని వెల్లడించారు. అంతేకాకుండా అంబులెన్స్‌ లాంటివి త్వరగా వెళ్లేందుకు వీలు కలుగుతుందని తెలిపారు.నిబంధనలకు లోబడే ఈ స్పీడ్‌ బ్రేకర్లను తొలగిస్తున్నట్లు పేర్కొన్నారు. గత ఏడాది డిసెంబరు 15 నుంచి టోల్‌ ప్లాజాల వద్ద తీసుకొచ్చిన ఫాస్టాగ్‌ పద్ధతి సత్ఫలితాలు ఇస్తున్నట్లు వెల్లడించారు. దేశంలో ఇప్పటికే 75 శాతం టోల్ ప్లాజాల వద్ద ఫాస్టాగ్ పద్ధతిలో టోల్ వసూలు చేస్తున్నట్లు తెలిపారు. తద్వారా వాహనదారులకు విలువైన సమయం ఆదా అవుతున్నట్లు వివరించారు.ఫాస్టాగ్ పద్ధతిలో వాహనదారులు టోల్‌ గేట్‌ వద్ద ఆగి డబ్బులు చెల్లించాల్సిన పని ఉండదు. ఫాస్టాగ్‌ కార్డుతో ఎలక్ట్రానిక్‌ రూపంలో డబ్బు చెల్లించవచ్చు. ప్లాజాల వద్ద ట్రాఫిక్‌ రద్దీని తగ్గించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా పండగల లాంటి సమయాల్లో టోల్ ప్లాజాల వద్ద గంటల తరబడి నిరీక్షిస్తూ.. ఇబ్బందులు పడే పరిస్థితికి ఈ విధానం చెక్ పెట్టింది. ఇదే స్ఫూర్తితో దేశంలోని అన్ని టోల్ ప్లాజాల వద్ద టోల్ వసూళ్లకు 100% ఇదే పద్ధతిని వాడటానికి చర్యలు చేపట్టారు.