తిరుపతి, జనవరి 8, (way2newstv.com)
ఏపీ ప్రధాన ప్రతిపక్షం టీడీపీ అధినేత చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో ఆయన సొంత నియోజకవర్గం చంద్రగిరి. అయితే, అనివార్య కారణాలతో ఆయన తన నియోజకవర్గాన్ని కుప్పానికి మార్చుకున్నారు. కాగా, ఇప్పుడు చంద్రగిరిలో టీడీపీ పరిస్థితి ఏంటి ? ఆయన నియోజకవర్గం మార్చుకున్న మాత్రాన తన సొంత నియోజకవర్గం చంద్రగిరిలో టీడీపీ ఎలా ఉంది? ఇక్కడ టీడీపీ ఎదుగుదలకు చంద్రబాబు ఏం చేస్తున్నారు ? అనే ప్రశ్నలు తెరమీదికి వస్తున్నాయి. వాస్తవానికి ఇక్కడ గతంలో కాంగ్రెస్ బలంగా ఉంది. కాంగ్రెస్ తరపున మూడు సార్లు గల్లా అరుణ కుమారి విజయంసాధించారు. అయితే, రాష్ట్ర విభజనతో ఆమె పార్టీ మారిపోయారు.ఇక, టీడీపీ పరిస్థితి చూస్తే.. 1994లో ఒకే ఒక్కసారి ఇక్కడ నుంచి చంద్రబాబు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు విజయంసాధించారు.
ఎవ్వరికి పట్టని చంద్రగిరి...
ఇక, అప్పటి నుంచి 2014 వరకు కూడా కాంగ్రెస్ హవా స్పష్టంగా కనిపించింది. ఇక, 2014లో ఇక్కడ నుంచి వైసీపీ తరపున పోటీ చేసిన చెవిరెడ్డి భాస్కరరెడ్డి విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా అప్పటి వరకు కాంగ్రెస్ తరఫున గెలిచిన గల్లా అరుణ పోటీ చేశారు. అయితే, ఆమెను ప్రజలు తిప్పికొట్టారు. తర్వాత కూడా చంద్రబాబు ఆమెకే నియోజకవర్గం పగ్గాలు అప్పగించారు.అయితే, ఆమె దూకుడు చూపించలేక పోయారు. ముఖ్యంగా చెవిరెడ్డి వ్యూహాత్మకంగా వేసిన అడుగులు వ్యక్తిగతంగా ఆయన ఇమేజ్‌ను భారీగా పెంచాయి. దీంతో చంద్రగిరి అంటే చెవిరెడ్డి, చెవిరెడ్డి అంటే చంద్రగిరి అనే టాక్ వచ్చేసింది. క్షేత్రస్థాయిలో ప్రజలకు దగ్గరకావడం, వివాదాలకు కేంద్రంగానే ఉన్నా.. నియోజకవర్గం అభివృద్ధికి సొంత నిధులను కూడా వెచ్చించడం, ఉద్యోగులకు, పేదల్లోకి దూసుకుపోవడంలో చెవిరెడ్డి తిరుగులేని మాస్ లీడర్‌గా మారిపోయాడు. ఇక, ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో గల్లా అరుణ పోటీకి తప్పుకోవడంతో పులవర్తి నానిని చంద్రబాబు రంగంలోకి దింపారు.అయితే, ఈయన కూడా చెవిరెడ్డి ముందు నిలవలేక పోయారు. దీంతో ఇప్పుడు ఇక్కడ అటు గల్లా అరుణ కానీ, పులవర్తి నాని కానీ నియోజకవర్గం గురించి పట్టించుకోవడం మానేశారు. గల్లా అరుణకుమారితో పాటు గల్లా జయదేవ్ ఇద్దరూ పొలిట్‌బ్యూరోలో ఉండడంతో మళ్లీ గల్లా వర్గం తన పట్టు పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. దీంతో నియోజకవర్గ టీడీపీలో గల్లా వర్సెస్ పులివర్తి నాని వర్గాల మధ్య నివురు గప్పిన నిప్పులా అసంతృప్తి ఉంది.గల్లా వర్గం నుంచి తనకు సహకారం ఉండడం లేదని నాని ఆరోపిస్తున్నారు. గల్లా వర్గానికే బాబు ప్రయార్టీ ఇస్తోన్న నేపథ్యంలో తనకు పార్టీలో ప్రాధాన్యం లేకుండా పోయిందని నాని పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో ఇక్కడ పార్టీకి అండగా ఎవరు నిలుస్తారో ? కూడా చెప్పలేని పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. చంద్రబాబు సొంత ఇలాకాలోనే పరిస్థితి ఇలా ఉన్నా… బాబు పట్టించుకోకపోవడంతో పార్టీపై నియోజకవర్గ టీడీపీ కేడర్‌కే నమ్మకం లేకుండా పోతోంది.