లైసెన్స్ ఉంటేనే ఎగుమతులు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

లైసెన్స్ ఉంటేనే ఎగుమతులు

ఒంగోలు, జనవరి 20, (way2newstv.com)
పొగాకు సాగు నుంచి విక్రయం వరకు అంతా ఆన్‌లైన్ విధానమే. ఆధునికత సంతరించుకున్న మోతుబరీ వాణిజ్య పంటగా పేరున్న ఈ సాగులో ఆన్‌లైన్ విధానంలో నిక్షిప్తమవుతోంది.ఎంత మంది రైతులు ఎన్ని ఎకరాల్లో సాగు చేసిందీ, ఆయా సాగుపై వచ్చిన దిగుబడి, వేలం కేంద్రంలో పొగాకు వేలం వేసిన తర్వాత కంపెనీలు రైతులకు చెల్లించే ధరలు తదితరాలన్నీ ఆన్‌లైన్‌లో నిక్షిప్తమై ఉంటాయి. ఇంత పారదర్శకంగా కార్యకలాపాలు తేటతెల్లంగా తెలుస్తున్నప్పటికీ అవకతవకలు జరుగుతున్నట్టు పొగాకు బోర్డు గుర్తించి ఈ ఏడాది తాజాగా కఠిన చర్యలు చేపట్టింది. పొగాకు సాగుకు లైసెన్స్ పొందిన రైతుల పేరిట లైసెన్స్ పొందని రైతులు సాగు చేసిన పొగాకును అమ్ముకుంటున్నట్టు పొగాకు బోర్డు గుర్తించింది.
లైసెన్స్ ఉంటేనే ఎగుమతులు

పొగాకు బోర్డు చట్ట ప్రకారం రిజిస్ట్రేషన్ పొందిన రైతులు మాత్రమే పొగాకు సాగు చేయాల్సి ఉంది. ఏదైనా కారణం చేత రైతులు పొగాకు సాగు చేయని విషయాన్ని పొగాకు బోర్డుకు ముందుగా తెలియ జేయాల్సి ఉంది. ఈ మేరకు పొగాకు పండించం లేదని రిటర్న్స్ దాఖలు చేయాల్సిందిగా పొగాకు బోర్డు రీజినల్ మేనేజర్ కె చంద్రశేఖర్  తెలియజేశారు.పొగాకు సాగు చేసేందుకు పొగాకు బోర్డు నుంచి లైసెన్స్ తీసుకున్న రైతులు తాను పండించడం లేదని నిబంధనల ప్రకారం ముందుగానే తెలియజేస్తే ఆ మరుసటి ఏడాది సాగుకు అనుమతి లభిస్తుంది, లేదంటే ఆ మరుసటి ఏడాది కూడా సాగుకు అనుమతి దక్కదు.రిజిస్ట్రేషన్ పొందిన కొంతమంది రైతులు పొగాకు రైతులు పొగాకు పండించకుండా పొగాకు పండించినట్టు ఫారం 2, 3 రిటర్న్‌లు దాఖలు చేసి అనధికారికంగా కౌలుకు ఇవ్వడం జరుగుతోందని పొగాకు బోర్డు గుర్తించింది. అంతేకాకుండా కొంత మంది ఇతర రైతులు పండించిన పొగాకును తనపేరు మీద వేలం కేంద్రంలో అమ్మకం, లేదంటే ఒక రైతు కోటాలో మరో రైతు అమ్మడం, అనధికారికంగా పొగాకు పండించిన రైతుల పొగాకును అక్రమంగా కొనుగోలు చేసి వేలం కేంద్రంలో అమ్మేందుకు ప్రయత్నిస్తున్నట్టు బోర్డు గుర్తించింది. అంతేకాకుండా లైసెన్స్‌లను అడ్డుపెట్టుకుని కమిషన్ వ్యాపారం నిర్వహిస్తున్నారని తదితర ఉదంతాలు పొగాకు బోర్డు దృష్టికి రావడంతో ఈ ఏడాది ముందుగానే కఠినమైన నిర్ణయాలతో సాగును పర్యవేక్షిస్తున్నారు.పొగాకు బోర్డు వేలం నిబంధనల ప్రకారం రైతు తాను పండించని పొగాకును అంటే ఇతర రైతులు పండించిన పొగాకును తన పేరు మీద వేలం కేంద్రంలో అమ్మేందుకు ప్రయత్నించడం నేరం. ఇటువంటి వారి పొగాకు అమ్మకాలను నిలిపి వేయడంతోపాటు లైసెన్స్‌లు రద్దు చేసి చట్టరీత్యా తగిన చర్యలు తీసుకుంటామని రీజనల్ మేనేజర్ చంద్రశేఖర్ ఒక ప్రకటనలో తెలియజేశారు. పొగాకు బోర్డు అంతిమ లక్ష్యం నిజమైన రైతుల సంక్షేమమేనని, కాబట్టి రిజిస్ట్రేషన్ పొంది పొగాకు పండించని రైతులు నిల్ రిటర్న్‌లు దాఖలు చేయాల్సిందిగా ఆయన సూచించారు.ఇదిలా ఉండగా పొగాకు బ్యారన్లను క్యూరింగ్‌కు ఉపయోగించని రైతులను కూడా పొగాకు పండించని రైతులుగా పరిగణిస్తారు. ఏదైనా కారణం చేత బ్యానర్లను క్యూరింగ్‌కు ఉపయోగించకపోతే ముందే ఆ సంగతి బోర్డు వారికి తెలియజేయాల్సి ఉంది. రైతులు తమ ఉత్పత్తులను నిర్ధేశిత వేలం కేంద్రంలో కాకుండా బయట విక్రయాలు సాగించే ప్రయత్నాల పట్ల కూడా పొగాకు బోర్డు తీవ్రంగా పరిగణిస్తుంది. ఇటువంటి ప్రయత్నాల పట్ల పొగాకు బోర్డు అత్యంత కఠినంగా వ్యవహరిస్తుందని, రైతు సంక్షేమం దృష్ట్యా బోర్డు ఈ విధంగా వ్యవహరించకపోతే పొగాకు రైతు మనుగడే కష్టతరమయ్యే పరిస్థితి ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. పొగాకు బోర్డు లైసెన్స్ కలిగి, అనధికార కార్యకలాపాల్లో పాల్గొనే రైతులను బోర్డు ఎల్లప్పుడూ పర్యవేక్షిస్తుందని, పొగాకు బోర్డు ఉన్నతాధికారులు, విజిలెన్స్ అధికారులచే తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని రీజినల్ మేనేజర్ చంద్రశేఖర్ తెలియజేశారు. పొగాకు బోర్డు ఇచ్చిన లైసెన్స్‌ను అక్రమంగా వినియోగించిన రైతులపై చట్టరీత్యా తగిన చర్యలు తీసుకుంటారని, కాబట్టి పొగాకు రైతులందరూ కష్టపడి పండించిన రైతులకు న్యాయం చేయడానికి సహకరించాల్సిందిగా రీజనల్ మేనేజర్ చంద్రశేఖర్ విజ్ఞప్తి చేశారు.