విజయవాడ, జనవరి 11,(way2newstv.com)
ఆందోళనలు హోరెత్తాయి.. నినాదాలు మార్మోగాయి.. రాజధాని అమరావతిని కదిలించేందుకు వీల్లేదని పిడికిళ్లు బిగిశాయి. కానీ, వ్యూహాత్మకంగా జగన్ ప్రభుత్వం మూడు ప్రాంతాల అభివృద్ధి మంత్రాన్ని తెరమీదికి తెచ్చింది. దీంతో ఒక్క ప్రాంతంగా మారిపోయిన అమరావతిపై ప్రభుత్వ నిర్ణయం చెప్పకనే చెప్పేశారు. ఇక, మిగిలింది మూడు రాజధానులు. ఎవరికి ఇష్టం ఉన్నా? ఎవరికి ఇష్టం లేకున్నా? కూడా రాజధాని విషయం రాష్ట్ర పరిధిలోని కీలక అంశంగా ఉంది కాబట్టి ప్రభుత్వ నిర్ణయమే శిరోధార్యం. నాడు అమరావతి వద్దని, ఇక్కడ భూముల్లో పటుత్వం తక్కువని, భారీ ఎత్తున నిర్మాణ వ్యయం ఉంటుందని చెప్పినా.. నాడు చంద్రబాబు వినలేదు. నేడు జగన్ కూడా మూడు ప్రాంతాల అభివృద్ధి అంటూ .. విశాఖ, కర్నూలు, అమరావతి వైపు పయనం ప్రారంభించారు.ఈ మొత్తం వ్యవహారం.. గతంలో చంద్రబాబు చెప్పినా..నేడు జగన్ చెబుతున్నా.. రాష్ట్ర ప్రజల కోసమే అంటున్నారు.
లీడర్స్ పోరు అమరావతికి శాపం
అయితే, వాస్తవంగా రాజధానితో ఎవరికి పని ఉంటుంది? ఎవరైనా రాజదానిలో ఎంత కాలం ఉంటారు? రెండు రోజుల కిందట మంత్రి పెద్దిరెడ్డి వెలిబుచ్చిన కీలక ప్రశ్న కూడా వాస్తవంలోకి తీసుకోదగ్గదే. నిజమే.. ఏపీలో వెనుకబడిన ప్రాంతాల్లోని ప్రజలు హైదరాబాద్ వైపు, భువనేశ్వర్ దిశగా లేదంటే.. బెంగళూరు వైపు పొట్ట చేత పట్టుకుని పయనిస్తున్నారు. పనులు లభించక పొట్ట కూటి కోసం వివిధ ప్రాంతాలకు పోతున్నారు.వీరికి ఇప్పుడు తీసుకున్న నిర్ణయంతో రాబోయే ఐదేళ్ల తర్వాత ఏమైనా లబ్ధి చేకూరే అవకాశం ఉండి ఉండొచ్చు. అయితే, వాస్తవంగా చూస్తే.. ఇప్పటికిప్పుడు మాత్రం ఎవరికి లబ్ధి చేకూరుతుందనే ప్రశ్నకు సమాధానం లేదు. కేవలం అధికారంలో ఉన్నవారి ఆత్మ సంతృప్తి పొందే అవకాశం ఉందనే విమర్శలు వస్తున్నాయి. ఒక ప్రాంతాన్ని రాజధానిగా ఎంపిక చేసే ముందుగానే అఖిల పక్ష సమావేశంలో చర్చించి ఉంటే.. ఇది ప్రజారాజధాని కాబట్టిప్రజల ముంగిట ఈ నిర్ణయాన్ని చర్చకు పెట్టి ఉంటే.. నాడే తేలిపోయేది.కానీ, నాడు చంద్రబాబు ప్రభుత్వం పాటించిన అత్యంత గోప్యత, అలివిమాలిన ఆధిపత్యం.. నేడు రాజధాని అంశాన్ని బోనులో పెట్టింది. నేడు కూడా చిత్రంగా అలాంటి పరిస్థితే చోటు చేసుకుంటోందనే భావన కలుగుతుం డడం దురదృష్టకరం. వాస్తవంలో ఆలోచించాల్సిన నాయకులు ప్రత్యర్థులపై పైచేయి సాధించాలనే ఏకైక లక్ష్యంతోనే ముందుకు సాగుతున్నారు తప్ప.. ప్రజల కోణంలో మాత్రం ఆలోచన చేయలేకపోతున్నారనేది వాస్తవం. మరి ఏం జరుగుతుందో చూడాలి.