ఎవ్వరికి అందని అమాత్యులు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఎవ్వరికి అందని అమాత్యులు

విశాఖపట్టణం, జనవరి 9, (way2newstv.com)
విశాఖ అంటేనే ప్రశాంత నగరం. సిటీ ఆఫ్ డెస్టనీ అంటారు. ఇక్కడ ఉండాలని ప్రతీవారూ ముచ్చట పడతారు. కనీసం ఒక్కసారి అయినా జీవితంలో రావాలని, ఇక్కడ ఉరకలెత్తే కడలితరంగాలను చూస్తూ అన్నీ మరచిపోవాలని ఉబలాట పడతారు. అటువంటి విశాఖకు వైసీపీ సర్కార్ అనుకోని వరాన్ని ఇచ్చింది. విశాఖను రాజధాని చేస్తామంటోంది. ఆ రాజసం ఈ నగరానికి తప్ప దేనికీ లేదని గట్టిగానే చెబుతోంది. అలా ఉత్తరాంధ్ర జిల్లాల అభివృధ్ధి విషయంలోనూ వైసీపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖను పరిపాలనా రాజధాని చేయాలని ముఖ్యమంత్రి జగన్ స్వయంగా అసెంబ్లీలో ప్రతిపాదించారు. అయితే దాని మీద జనాభిప్రాయాన్ని సానుకూలంగా మలచడంలో మాత్రం వైసీపీ నేతలు, మంత్రులు దారుణంగా విఫలం అయ్యారనే చెప్పాలి.
ఎవ్వరికి అందని అమాత్యులు

ఈ మధ్యన ముఖ్యమంత్రి జగన్ విశాఖ టూర్ వచ్చిన సందర్భంగా నిర్వహించిన మానవహారం డిజైన్ కూడా ఎక్కడ నుంచో వచ్చిన రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చేయాల్సి వచ్చిం దంటే లోకల్ టాలెంట్ ఎంత నిస్సత్తువగా ఉందో అర్ధమవుతోందిగా. కొందరు నాయకులు మీడియా బేబీల మాదిరిగా ఎంతసేపూ మైకుల మునుకు వచ్చి టీడీపీని విమర్శించమంటే జోరు చేస్తారు కానీ జనంలోకి మాత్రం అసలు పోరు. నిజానికి విశాఖ రాజధాని విషయం అన్నది ఈనాటి మాట కాదు, అది చాలా మంది కల. ఈ విషయంలో ప్రజా సంఘాలు ముందున్నాయి. అవి స్వాగతిస్తున్నాయి. అలాగే మేధావులు కూడా ఇది మంచి పరిణామం అంటున్నారు. అటువంటి వారిని ఒక చోట చేర్చి రౌండ్ టేబిల్ మీటింగులు వంటివి ఏర్పాటు చేయడం ద్వారా ఈ ప్రాంతం ఆకాంక్షలను విశాఖ రాజధానిని వ్యతిరేకిస్తున్న వారికి చెప్పాలన్న సోయి అధికార పార్టీ నేతలకు లేకుండా పోవడమే చిత్రం.దీన్ని ఆసరాగా తీసుకునే పొరుగు జిల్లా తూర్పు గోదావరిలో ఉంటున్న మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు విశాఖ రాజధాని ఎవరు అడిగారంటూ దీర్ఘాలు తీస్తున్నారు. నిజానికి ఒక అభిప్రాయానికి అనుకూలంగానైనా వ్యతిరేకంగానైనా జనాలను సమీకరించే పని పార్టీల నేతలదే. కానీ వైసీపీ నేతలు అధికారం మాత్రమే అనుభవిస్తూ వీటిని పట్టించుకోకపోవడం వల్లనే విశాఖ రాజధాని అంటే ఈ ప్రాంతానికి ఇష్టంలేదన్న మాట బయటకు వినిపిస్తోంది. ఇవన్నీ పక్కన పెడితే ఉత్తరాంధ్రాకు మొత్తం నలుగురు మంత్రులు ఉన్నారు. వీరిలో ధర్మాన క్రిష్ణ దాస్, ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి రాజధాని విషయంలో పలుకే బంగారమా అన్నట్లుగా ఉంటున్నారు. మిగిలిన ఇద్దరిలో బొత్స సత్యనారాయణ ధాటిగానే మాట్లాడుతున్నారు. అవంతి శ్రీనివాసరావు సైతం గట్టిగానే తగులుకుంటున్నారు.అయితే మంత్రులు చేయాల్సింది ఇంకా చాలా ఉందంటున్నారు. ఇప్పటికీ విశాఖ రాజధాని అవుతుందని తెలియని ప్రాంతాలు మూడు జిల్లాల్లో చాలానే ఉన్నాయి. అందరికీ అవగాహన కల్పించి ఎందుకు రాజధాని ఇక్కడ పెడుతున్నామో చెప్పి వారి నుంచి సానుకూల స్పందనను తీసుకురావాల్సిన బాధ్యత అమాత్యులదే. అయితె ఎంతసేపూ జగన్ ఏదో ఊరకే పొద్దు పుచ్చక రాజధాని విశాఖ తెస్తున్నట్లుగా ఉంది కానీ అభివృధ్ధి చేయడం కోసం, వెనకబడిన ప్రాంతాలను ఉద్ధరించడం కోసం రాజధాని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నామని ఘంటాపధంగా ఒక్క మంత్రి మాట్లాడలేకపోతున్నారేందుకో. ఇది వైసీపీ రాజకీయ నిస్సత్తువ అంటున్నారు. ఇలాగే ఉంటే రాజధాని వచ్చినా కూడా ఆ క్రెడిట్ మాత్రం వైసీపీ ఖాతాలో పడడం కష్టమేనని చెప్పేస్తున్నారు. మరి ఆ పని చేస్తారా. ఇప్పటికే వైసీపీ నేతలు ఎక్కవలసిన రైలు జీవిత కాలం లేటు అన్నట్లుగా ఉత్తరాంధ్ర పొలిటికల్ సీన్ ఉంది.