పిల్లి, మోపిదేవి ఔట్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

పిల్లి, మోపిదేవి ఔట్

విజయవాడ, జనవరి 30, (way2newstv.com)
శాసనమండలినే వద్దు అనుకుని రద్దు చేసిన జగన్ మానసికంగా అదొక చట్ట సభ ఉందన్న దాన్ని గుర్తించేందుకు కూడా ఇష్టపడడంలేదంటున్నారు. ఇక మండలి లేనపుడు అందులో సభ్యులుగా కూడా ఎవరూ ఉండదు, మిగలరు, దాంతో వైసీపీ మంత్రివర్గంలో ఉన్న ఇద్దరు మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణల భవిష్యత్తు డోలాయమానంలో పడింది. జగన్ ఏ క్షణానైనా వారిద్దరి నుంచి రాజీనామాలు కోరుతారని అధికార వర్గాలలో జోరుగా వినిపిస్తున్న మాట.మండలి విషయంలో తన సీరియస్ నెస్ ని, కమిట్ మెంట్ ని గట్టిగా తెలియచేయాలన్న ఉద్దేశ్యంలో జగన్ ఉన్నారట. మండలి రద్దు అయ్యేంతవరకూ చూడకుండా నైతిక విలువలు పాటించి తన ఇద్దరు మంత్రుల నుంచి రాజీనామాలు తీసుకోవాలనుకుంటున్నారుట. 
పిల్లి, మోపిదేవి ఔట్

అసెంబ్లీలో తీర్మానం చేసిన నాడే మండలి రద్దు అయినట్లుగా జగన్ భావించడమే ఇందుకు కారణం. మండలి రద్దు విషయంలో టీడీపీ చేస్తున్న నానా యాగీకి ఈ విధంగా జగన్ గట్టి రిటార్ట్ ఇవ్వదలచుకున్నారట.తాను నైతిక విలువలకు ప్రాధాన్యత ఇస్తానని, సాంకేతికతను చూడనని జగన్ చెబుతున్నట్లుగా తెలుస్తోంది. నిజానికి మండలి రద్దు తీర్మానం మాత్రమే అసెంబ్లీ చేసింది. మండలి రద్దు కావాలంటే చాలా పెద్ద ప్రొసెస్ ఉంది. పార్లమెంట్ ఆమోదించి రాష్ట్రపతి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసేంతవరకూ కూడా మండలి సజీవంగా ఉంటుంది. అంతవరకూ సభ్యుల పదవికి ఢోకా లేదు. కానీ జగన్ ఈ సాంకేతిక అంశాలను పట్టించుకోదలచులేదుట. మండలి వద్దు, రద్దు అనుకున్నాం, అటువంటి కౌన్సిల్లో మన సభ్యులు ఉన్నా లేనట్లే, అందువల్ల ఇపుడు వారు ఏ సభకూ చెందని సభ్యులుగా ఉంటారు, దాంతో రాజీనామాలు తీసుకోవడమే ఉత్తమమ‌ని జగన్ అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది.ఈ రకమైన యాక్షన్ ద్వారా జగన్ అటు టీడీపీకి, ఇటు కేంద్రానికి కూడా తన తరఫున బలమైన సందేశం పంపాలనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. మండలి రద్దు విషయంలో తమ ప్రభుత్వం ఎంత పట్టుదలగా ఉందో కేంద్రానికి కూడా తెలిసేలా ఇద్దరు మంత్రుల చేత రాజీనామాలు చేయించాలని జగన్ భావిస్తున్నారుట. ఇక తమ మంత్రులే రాజీనామా చేస్తే టీడీపీ మీద కూదా వత్తిడి ఉంటుందని, నారా లోకేష్, యనమల రామకృష్ణుడు వంటి వారు ఇంకా పదవులు పట్టుకుని వేళ్ళాడుతున్నారన్న తప్పుడు సంకేతం జనంలోకి వెళ్తుందని కూడా జగన్ అంచనా కడుతున్నారుట. మొత్తానికి ఒక్క దెబ్బకు మూడు పిట్టలు అన్నట్లుగా తమ పార్టీ నైతికతను నిరూపించుకుంటూనే, అటు, కేంద్రం, ఇటు టీడీపీలలో వత్తిడి పెంచడానికి జగన్ డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది.