తెలంగాణో బడ్జెట్ కసరత్తు షురూ... - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

తెలంగాణో బడ్జెట్ కసరత్తు షురూ...

హైద్రాబాద్, జనవరి 29, (way2newstv.com)
పుర పోరు ముగిసింది. అధికార టీఆర్‌ఎస్‌పార్టీ విజయగర్వంతో ఉంది. మెజారిటీ మున్సిపాల్టీలు, నగర పాలక సంస్థల్ని కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఇదే ఊపులో అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్ని నిర్వహించేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతున్నది. గతంలో మాదిరే అసెంబ్లీలో వార్‌ను వన్‌సైడే నిర్వహించేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తున్నది. ఇప్పటికే ఆయా శాఖాధిపతులు బడ్జెట్‌ ప్రతిపాదనలకు తుది రూపు ఇస్తున్నారు. ఆర్థికమాంద్యం అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్న ప్రభుత్వం ప్రస్తుత ఏడాదికంటే వచ్చే (2020-21) ఆర్ధిక సంవత్సర బడ్జెట్‌ సైజును తగ్గించే అవకాశాలు కనిపిస్తున్నాయి.2019 ఫిబ్రవరిలో రూ.1,82,017 కోట్ల ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ప్రభుత్వం అదే ఏడాది సెప్టెంబర్‌లో దాన్ని రూ.1,46,492 కోట్లకు తగ్గించింది. ఆ సమావేశాల్లోనే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆర్థికమాంద్యం అంటూ అసెంబ్లీలో బీద పలుకులు పలికారు. 
తెలంగాణో బడ్జెట్ కసరత్తు షురూ...

అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వ ఆదాయాలు ఆశించిన స్థాయిలో లేవు. కేంద్రం నుంచి రావల్సిన నిధులు కూడా గణనీయంగా తగ్గాయి. దీనితో వచ్చే ఏడాది బడ్జెట్‌ పరిమాణం మరో రూ.20 వేల కోట్ల వరకు తగ్గే అవకాశాలున్నాయి. ఫిబ్రవరి రెండోవారం నాటికి పార్లమెంట్‌ సమావేశాల్లో బడ్జెట్‌ ప్రతిపాదనలు పూర్తవుతాయి. కేంద్రం నుంచి రాష్ట్రానికి ఏయే పథకాల కింద ఎన్ని నిధులు వస్తాయనే స్పష్టత వస్తుంది.దీన్నిబట్టే రాష్ట్ర బడ్జెట్‌ రూపొందించనున్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు వచ్చే ఆర్ధిక సంవత్సరం కూడా అమల్లోకి వచ్చేలా లేవు. నిరుద్యోగ భృతి, ఆసరా పెన్షన్ల వయో పరిమితి 60 ఏండ్ల నుంచి 57 ఏండ్లకు కుదింపు, దళితులకు మూడెకరాల భూమి, డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లలాంటి పలు ప్రభుత్వ హామీలకు నిధుల కేటాయింపులు ఉండకపోవచ్చని ఆర్ధికరంగ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం అమల్లో ఉన్న సంక్షేమ పథకాలను యథావిధిగా కొనసాగించే అవకాశాలు ఉన్నాయని వారు చెప్తున్నారు. కొత్త రెవెన్యూ చట్టాన్ని ఈ సమావేశాల్లోనే ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టే అవకాశాలు కనిపి స్తున్నాయి. అలాగే పౌరసత్వ సవరణ చట్టం బిల్లు (సీఏఏ) అమలును వ్యతిరేకిస్తూ శాసనసభలో తీర్మానం చేసే ప్రతి పాదనను కూడా ఈ సమావేశాల్లోనే ప్రవేశపెట్టనున్నారు. తద్వారా ప్రభుత్వ సానుకూల ప్రచారం ప్రజల్లోకి వెళ్లేలా అసెంబ్లీ సమావేశాల్ని నిర్వహించేందుకు సీఎం కేసీఆర్‌ వ్యూహరచన చేస్తున్నట్టు సమాచారం.