విజయవాడ, జనవరి 25 (way2newstv.com)
వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం శాసనమండలిని రద్దు చేయడానికే నిర్ణయం తీసుకుంది. సోమవారం దీనిపై పూర్తి స్థాయిలో స్పష్టత వచ్చే అవకాశముంది. జగన్ శాసనమండలిని రద్దు చేయడానికే రెడీ అయ్యారు. సోమవారం మంత్రిమండలి సమావేశం కూడా జరగనుంది. ఈ నేపథ్యంలో శాసనమండలిలో ఆశలు పెట్టుకున్న వైసీపీ నేతలు బిక్కుబిక్కుమంటూ చూస్తున్నారు. శాసనమండలి రద్దయితే తమ పరిస్థితి ఏంటన్న ఆందోళన వారిలో బయలుదేరింది. హడావిడిగా అమరావతికి బయలుదేరారు.వైఎస్ జగన్ మొన్న జరిగిన ఎన్నికల్లో టిక్కెట్లు దక్కని వారికి ఎమ్మెల్సీ పదవులు ఇస్తామని ప్రామిస్ చేశారు. తన సుదీర్ఘ పాదయాత్రలోనూ మరికొందరికి హామీ ఇచ్చారు.
బిక్కబిక్కుమంటున్న వైసీపీ ఆశావాహులు
ఇప్పడు వీరంతా అయోమయంలో పడ్డారు. శాసనమండలి రద్దయితే తమ పరిస్థితి ఏంటన్న ఆవేదనలో ఉన్నారు. ఒక్కొక్కరి బీపీ హైలెవల్ కు చేరుకుందంటున్నారు. పాదయాత్ర సమయంలో జగన్ కుప్పం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన చంద్రమౌళికి బహిరంగంగానే ఎమ్మెల్సీ పదవి ఇస్తానని జగన్ హామీ ఇచ్చారు. మంత్రిని కూడా చేస్తానని చెప్పారు.ఇక ప్రకాశం జిల్లా పర్యటనలో గొట్టిపాటి భరత్ కు ఎమ్మెల్సీ పదవి ఇస్తానని బహిరంగ సభలోనే జగన్ చెప్పారు. ఇక గుంటూరు జిల్లాలో తొలి నుంచి పార్టీకి లాయల్ గా ఉన్న మర్రి రాజశేఖర్ కు కూడా ఎమ్మెల్సీ పదవి ఇస్తామని చెప్పారు. చిలకలూరి పేట టిక్కెట్ విడదల రజనీకి ఇవ్వడంతో రాజశేఖర్ కు కూడా జగన్ ఆ హామీనే ఇచ్చారు. ఇక అదే జిల్లాకు చెందిన లేళ్ల అప్పిరెడ్డి ఏళ్లుగా పార్టీని అంటిపెట్టుకుని ఉన్నా టిక్కెట్ ఇవ్వలేదు. ఈయనకు కూడా ఎమ్మెల్సీ హామీ లభించింది.ఉత్తరాంధ్ర ప్రాంతానికి వస్తే చాలా మందికి జగన్ ఎమ్మెల్సీ హామీ ఇచ్చారంటారు. దాడి వీరభద్రరావు లేదా ఆయన కుమారుడు దాడి రత్నాకర్, కుంభా రవిబాబు వంటి నేతలకు కూడా జగన్ ఎమ్మెల్సీ ప్రామిస్ చేశారు. అలాగే తూర్పు గోదావరికి చెందిన పండుల రవీంద్రబాబుకూడా ఎమ్మెల్సీ ప్రామిస్ చేశారంటారు. ఎంపీ టిక్కెట్ గాని, ఎమ్మెల్యే టిక్కెట్ గాని ఆయనకు ఇవ్వకపోవడంతో ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పారని అప్పట్లో ప్రచారం జరిగింది. ఇక శ్రీకాకుళం జిల్లాలో చాలా మంది నేతలు ఎమ్మెల్సీ పదవి కోసం కాచుక్కూర్చున్నారు. ఇప్పడు శాసనమండలి రద్దయితే వారికి ఆ యోగం ఇక లేనట్లే. మరో నాలుగున్నరేళ్లు అసెంబ్లీ టిక్కెట్ కోసమే వెయిట్ చేయాల్సి ఉంటుంది.