హైద్రాబాద్, జనవరి 7, (way2newstv.com)
ఏపీ సీఎం జగన్‌కు అన్ని విధాలా అండగా ఉంటాం.. ఆయనకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా.. అడగక్కుండానే మేం సాయం చేస్తాం- ఇదీ.. పక్కరాష్ట్రం తెలంగాణ సీఎం కేసీఆర్ ఏడు మాసాల కిందట సీఎంగా జగన్ ప్రమాణం చేసిన రోజు విజయవాడలో జరిగిన సభలో ఎవరూ కోరకుండానే ఇచ్చిన అభయం. ఈక్రమంలోనే ఆయన తరచుగా మీడియా సమావేశాలు పెట్టి జగన్‌ను ఆకాశానికి ఎత్తేశారు. అదే సమయంలో తాను కూడా స్వయంగా రెండు సార్లు ఏపీకి వచ్చి జగన్ ఇచ్చిన ఆతిథ్యాన్ని స్వీకరించారు. తాను కూడా సీఎం జగన్‌ను హైదరాబాద్‌కు ఆహ్వానించి సన్మానించారు.ఇప్పుడు గడిచిన 15 రోజులుగా ఏపీలో పెద్ద ఎత్తున రాజధానుల విషయంపై తీవ్ర ఆందోళన, గంద రగోళం జరుగుతోంది. ముఖ్యంగా ప్రధాన రాజకీయ పక్షాలన్నీ కూడా ఒకే తాటిపైకి వచ్చి జగన్‌ను ఏకాకి చేసే ప్రయత్నం చేస్తున్నాయి.
దూరమవుతున్న కేసీఆర్
నిజానికి మూడు రాజధానులపై జగన్ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తెలియజేయడానికి ముందుగానే యాగీ చేస్తున్నాయి. ఆందోళనలకు ఊపు తెచ్చేలా వ్యవహరిస్తున్నాయి. మరి ఈ సమయంలో జగన్‌కు అండగా నిలుస్తానని చెప్పిన కేసీఆర్ ఇప్పటి వరకు మాట మాత్రంగానైనా స్పందించకపోవడం గమనార్హం. మరోపక్క, జగన్ మాత్రం కేసీఆర్‌ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు.అవకాశం వచ్చినప్పుడల్లా కేసీఆర్‌కు హ్యాట్సాఫ్ చెబుతున్నారు. హైదరాబాద్‌లో జరిగిన దిశ ఘటనలో నిందితులను ఎన్‌కౌంటర్ చేయడంపైఅసెంబ్లీ సాక్షిగా రెండు సార్లు.. జగన్ సీఎం కేసీఆర్ పై ప్రశంసలు కురిపించారు. ఆయన చేసింది సబబేనని చెప్పారు. మరి జగన్ ఇలా చేస్తుంటే.. కేసీఆర్ మాట మాత్రంగా నైనా జగన్‌ను సమర్థించే ప్రయత్నం కానీ, లేదు. మూడు రాజధానులు ఎందుకు.. అని సూచనలు, సలహాలు ఇచ్చే ప్రయత్నం కానీ చేయక పోవడంపై ఇరు రాష్ట్రాల్లోనూ చర్చ నడుస్తోంది. దీని వెనుక గోదావరి నదిపై నిర్మించే ప్రాజెక్టుల విషయంలో జగన్ వెనక్కి తగ్గడం, ఆర్టీసీని విలీనం చేయడం వంటి కీలక ప్రతిపాదనలేమైనా ఉన్నాయా? ఇవి కేసీఆర్‌కు నచ్చకపోవడం వల్లే ఇప్పుడు జగన్‌కు దూరంగా ఉండాలని భావిస్తున్నారా? అనే సందేహాలు కూడా తెరమీదికి వస్తున్నాయి. అయితే కేసీఆర్ ఈ సమయంలో జోక్యం చేయడం సరికాదన్న వాదన కూడా లేకపోలేదు. కేసీఆర్ మూడు రాజధానుల ప్రతిపాదనను సమర్థిస్తే అది జగన్ పట్ల వ్యతిరేకత వ్యక్తమవుతుందనే కేసీఆర్ సైలెంట్ గా ఉన్నారని కూడా పార్టీ వర్గాలు చెబుతున్నాయి.