నల్లగొండ, జనవరి 1, (way2newstv.com)
పత్తి రైతు ఈ ఏడాది ప్రతికూల ప్రకృతికి తోడు మార్కెట్ ధరల ఎగుడుదిగుడులతో మద్దతు ధర అందుకోలేక చిత్తవుతూ ఆర్థింగా చితికిపోతున్న వైనం కలవరపెడుతోంది. ముఖ్యంగా సీజన్ ఆరంభంలో అంతర్జాతీయ మార్కెట్‌లో పత్తికి పెరిగిన డిమాండ్‌తో తెలంగాణలో సైతం ప్రభుత్వ మద్దతు ధర క్వింటాల్ 5450 రూపాయల కంటే అధికంగా 5600 నుండి 6వేల వరకు ధర పలుకడంతో పత్తి రైతులు సంబర పడ్డారు. వ్యాపారుల సిండికేట్‌తో ప్రస్తుతం అంతటా క్వింటాల్ మద్దతు ధర ఆకస్మికంగా 5200లకు తగ్గడంతో మరోసారి పత్తి రైతులు సీసీఐ కేంద్రాలవైపు పరుగులు పెడుతున్నారు. ఎకరాకు 10నుండి 12క్వింటాళ్ల దిగుబడులు రావాల్సివుండగా ఈ ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితులు, గులాబీ పురుగు బెడదతో కేవలం 4నుండి 5క్వింటాళ్లకే పరిమితమై పత్తి రైతులు తీవ్రంగా నష్టపోయారు.
పత్తి రైతుల పరేషాన్
ఇప్పుడు సీజన్ ఆరంభంలో ఊరించి మురిపించి తీరా దిగుబడుల అమ్మకాల దశలో క్వింటాల్ మద్దతు ధర తగ్గిపోవడం పత్తి రైతులను పరేషాన్ చేస్తుంది. సాధారణంగా 45లక్షల క్వింటాళ్ల మేరకు పత్తి కొనుగోలు జరుగాల్సివుండగా ఈ ఏడాది ఇప్పటిదాకా ప్రైవేటులో 7లక్షల 20వేల క్వింటాళ్ల పత్తి కొనుగోలు జరుగగా, ఆక్టోబర్ నుండి సాగుతున్న సీసీఐ కేంద్రాల్లో కేవలం 50వేల క్వింటాళ్ల కొనుగోలు సాగింది. మొన్నటిదాకా 6వేలకు క్వింటాల్ పత్తి కొనుగోలు చేసిన ప్రైవేటు వ్యాపారులు ఇప్పుడు గరిష్టంగా 5200లకే పత్తి కొనుగోలు చేస్తుండటంతో పత్తి రైతులు మద్దతు ధర 5450రూపాయల కోసం సీసీఐ కేంద్రాలకు పత్తి తరలిస్తున్నారు. దీంతో గత వారం రోజుల్లో సీసీఐ కేంద్రాలకు పత్తి రాక రెండింతలు పెరిగిపోయింది. దీంతో జిల్లాలో నల్లగొండ, చిట్యాల, నకిరేకల్, చండూర్, మిర్యాలగూడ, దేవరకొండ, మాల్ సీసీఐ కేంద్రాలు పత్తి రాకతో మళ్లీ సందడిగా కనిపిస్తున్నాయి. అటు వరంగల్ సీసీఐ జోన్‌లో గత ఏడాది ప్రైవేటుగా 55లక్షల క్వింటాళ్ల పత్తి కొనుగోలు జరుగగా ఈ దఫా 39.50లక్షల క్వింటాళ్లు, ప్రభుత్వ పరంగా 14లక్షల క్వింటాళ్లకు ఈ దఫా 5లక్షల క్వింటాళ్ల కొనుగోలు జరిగింది.ఈ ఏడాది ఆక్టోబర్, నవంబర్ నెలల్లో పత్తి అమ్ముకున్న రైతులకు 5600నుండి 6వేల వరకు ధర లభించగా ఇప్పటిదాకా పత్తి అమ్ముకోకుండా ఉన్న రైతులకు ప్రస్తుతం సీసీఐ మద్దతు ధర లభించనుండటంతో పత్తి రైతులను ప్రైవేటు వ్యాపారులు దగా చేస్తున్నా సీసీఐ కేంద్రాలు దిక్కుగా ఉండటం కొంత ఊరటనిస్తుంది. ప్రస్తుతం నల్లగొండ జిల్లాకు సంబంధించి పెద్ద ఎత్తున చివరి దశ దిగుబడులు ఉండటం, సంక్రాంతి వరకు పత్తి దిగుబడి వచ్చే అవకాశముండటంతో ఇక మీదట పత్తి అమ్ముకునే రైతులకు సీసీఐ కేంద్రాలు మద్దతు ధర అందించనున్నాయి. అయితే సీసీఐ పెరిగిన పత్తి దిగుబడుల రాకకు అనుగుణంగా కొనుగోలు ఏర్పాట్లు చేసి ఆదుకోవాలని పత్తి రైతులు డిమాండ్ చేస్తున్నారు.