అప్పన్న సెంటిమెంట్... - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

అప్పన్న సెంటిమెంట్...

విశాఖపట్టణం, జనవరి 8, (way2newstv.com)
ఉత్తరాంధ్ర జిల్లాల్లో అతి పెద్ద నారసింహ క్షేత్రంగా సింహాచలం దేవస్థానం ఉంది. ఈ ఆలయానికి వేలాది ఎకరాలా భూమి ఉంది. ఇక ఈ భూముల విషయంలో కోర్టులలో కూడా కేసులు ఉన్నాయి. చాలా భూములు అన్యాక్రాంతం కావడంతో పాటు, మరి కొన్ని చోట్ల నివాసం ఉంటున్న పేదలకు వాటిని పంచాలన్న డిమాండ్ ఉంది. ఇక అదే సమయంలో సింహాచలంలో పంచ గ్రామాల సమస్య ఉంది. ఇక్కడ మధ్యతరగతి వర్గాలు అప్పన్న భూములలో దశాబ్దాల తరబడి ఇళ్ళు కట్టుకుని ఉంటున్నారు. వారందరికీ న్యాయం చేయాలని చాలా కాలంగా ఉంది. అయితే ఈ విషయంలో ప్రభుత్వాలు మారుతున్నా కూడా న్యాయం మాత్రం జరగడంలేదు. ఇప్పటికి పది మంది ముఖ్యమంత్రులు మారారు. ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి. 
అప్పన్న సెంటిమెంట్...

వెళ్లాయి. కానీ సింహాచలం పంచ గ్రామాల సమస్యకు మాత్రం అతీ గతీ లేదు.దీని మీద విశాఖ జిల్లా మంత్రి అవంతి శ్రీనివాసరావు తాజాగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. పంచ గ్రామాల సమస్య విషయంలో తలదూర్చాలంటేనే ముఖ్యమంత్రులు భయపడుతున్నారని ఆయన అనడం విశేషం. ఎందుకంటే ఇది అప్పన్న స్వామి భూమి, ఆయన ఆశీస్సులు లేకుండా ముఖ్యమంత్రులు, ప్రధానులు కూడా ఏమీ చేయలేరని వేదాంత ధోరణిలో మంత్రి అనడం గమనార్హం. దేవుడి భూములు అంటేనే అతి పెద్ద సెంటిమెంట్ గా మారాయని మంత్రి అన్నారు. ఈ సమస్య ఒక తేనె తుట్టెగా మారిందని, ఎక్కడ కదిపితే ఏం ముప్పు వస్తుందోనని, తమ పదవులకు ఎసరు వస్తుందోనని ముఖ్యమంత్రులతో పాటు ప్రజా ప్రతినిధులు కూడా భయపడుతున్నారని అవంతి అంటున్నారు.నిజానికి పంచ గ్రామాల సమస్య ఈనాటిది కాదు, మూడు దశాబ్దాలుగా నలుగుతోంది. ఈ సమస్య విషయంలో సరైన పరిష్కారం చూపించాలని నాటి ముఖ్యమంత్రుల నుంచి ఈనాటి వరకూ అందరూ అనుకుంటున్నా కూడా ఎక్కడా అడుగు ముందుకు పడడంలేదు, పైగా కోర్టులో కూడా కేసులు పడ్డాయి. దాంతో ఇది అలా కొనసాగుతూనే ఉంది. ఈ నేపధ్యంలో మంత్రి అవంతి అంటున్న మాటలు కూడా అందరిలోనూ అనేక రకాలుగా ఆలోచనలు కలిగేలా చేస్తున్నాయి. దేవుడి భూములు కొన్ని దశాబ్దాల క్రితం దాతలు ఇచ్చినవి. వాటిని తమ కోసం ఉపయోగించుకుందామనుకుంటే ఆ దేవుడి దీవెనలు కావాలి. ఇందులో రాజకీయ ప్రమేయం, అధికార బలం ఎంత ఉన్నా సమస్యకు పరిష్కారం రావడం లేదంటే మాత్రం కచ్చితంగా ఇది అప్పన్న సెంటిమెంట్ గానే భావిస్తున్నారు.స్వయంగా మంత్రి అవంతి ఈ రకమైన వ్యాఖ్యలు చేయడంతో పంచ గ్రామాల ప్రజలు పూర్తిగా నిరాశ‌లో పడిపోతున్నారు. ఈసారి మంచి మెజారిటీతో వైసీపీని ఈ ప్రజలు గెలిపించారు. వీరు విశాఖలో నాలుగు నియోజకవర్గాలను ప్రభావితం చేస్తున్నారు. అందులో రెండు వైసీపీకి ఈసారి దక్కాయి. ప్రధానంగా సమస్య ఉన్న గ్రామాల్లో వైసీపీ గెలిచింది. ఎన్నో ఆశలు కొత్త సర్కార్ మీద పెట్టుకుంటే మంత్రి ఇలా అనడంతో అక్కడ నివాసం ఉంటున్న వారు నివ్వెరపోతున్నారు. అయితే అపన్న దయ తమపైన ఉందని, అందువల్ల తప్పనిసరిగా న్యాయం జరుగుతుందని ఇక్కడ ప్రజలు ధైర్యం చెప్పుకుంటున్నారు. మొత్తానికి ఆస్తికుడైన మంత్రి అవంతి కూడా దేవుడే తప్ప ఈ సమస్యను ఎవరూ సెటిల్ చేయలేరు అని చెప్పేశాక అందరి చూపూ అప్పన్న వైపుగానే ఉంది. మరి దేవుడే దిగి వచ్చి దీవించాలేమో.