కర్నూలు,జనవరి 24, (way2newstv.com)
షరీఫ్… ఇప్పుడు ఏపీ అంతటా మార్మోగుతున్న పేరు. ఆయన నిన్న మొన్నటి వరకు తెలుగుదేశం పార్టీలో ఉన్న కొద్దిమందికి మాత్రమే పరిచయం. షరీఫ్ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పని చేస్తున్నారు. సాధారణ కార్యకర్త స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగారు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన షరీఫ్ తెలుగుదేశం పార్టీకి అత్యంత వీరవిధేయుడిగా పేరు పొందారు. ఏ బాధ్యతలను అప్పగించినా ఆయన మూడు దశాబ్దాల కాలంలో ఎన్నడూ పార్టీ లైన్ దాటలేదు.2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే షరీఫ్ కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. అత్యంత నమ్మకస్థుడు కావడంతో షరీఫ్ కు చంద్రబాబు మంత్రి వర్గంలో చోటు దక్కుతుందని భావించారు. మైనారిటీ కోటాలో షరీఫ్ కు మంత్రి పదవి దక్కుతుందనుకున్నా వీలు కాలేదు. చంద్రబాబు అప్పట్లో పట్టించుకోలేదు.
ఒక్కసారి హీరో అయిపోయిన షరీఫ్
అయితే నంద్యాల ఉప ఎన్నికల సమయంలో ఎమ్మెల్సీగా ఉన్న ఫరూక్ ను మంత్రిగా చేయడంతో షరీఫ్ పేరు మరోసారి వెలుగులోకి వచ్చింది. ఫరూక్ శాసనమండలి ఛైర్మన్ గా చేశారు.నంద్యాల ఉప ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీ ఇచ్చిన మేరకు ఫరూక్ కు మంత్రి పదవి దక్కడంతో షరీఫ్ ను శాసనమండలి ఛైర్మన్ గా చేశారు. కేబినెట్ ర్యాంకు ఉన్న పదవి కావడంతో షరీఫ్ దాంతోనే సంతృప్తి పడ్డారు. మండలి ఛైర్మన్ అయిన తర్వాతనే షరీఫ్ ఎవరో ఏపీ ప్రజలకు పూర్తి స్థాయిలో తెలిసింది. పార్టీ కార్యక్రమాల్లో వేదికపై ఎప్పుడూ షరీఫ్ కన్పించరు. హడావిడి చేయరుఅయితే నిన్న శాసనమండలిలో జరిగిన పరిణామాలతో షరీఫ్ ఒక్కసారిగా రాజధాని ప్రాంతంలో హీరో అయ్యారు. ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. పార్టీ కూడా షరీఫ్ ను నిన్న మొన్నటి వరకూ పెద్దగా పట్టించుకోలేదన్నది వాస్తవం. అయితే ఇప్పుడు షరీఫ్ పార్టీకి పెద్ద అస్సెట్ గా మారారనడంలో సందేహం లేదు. డబ్బులకు, పదవులకు అమ్ముడుపోని షరీఫ్ పై ప్రశంసల వర్షం కురుస్తుంది.