విజయవాడ, జనవరి 29, (way2newstv.com)
జగన్ ని ప్రజలతో విడదీయడం సాధ్యం కాదు. పైగా ఆయన జన సమ్మోహన శక్త్రి అపారం. ఒక ఎన్టీఆర్ తరహాలో జగన్ రోడ్డు మీదకు వస్తే కదిలి వచ్చే జనం ఒక ప్రవాహంలా ఉంటుంది. గత ఏడాది జనవరి 9న జగన్ పాదయాత్ర ఇచ్చాపురంలో ముగించారు. ఆ తరువాత ఆయన ఎన్నికల ప్రచారం మాత్రమే చేశారు. ఫలితాల తరువాత ముఖ్యమంత్రి అయ్యారు. దాంతో అధికార బాధ్యతలతో బిజీ అయ్యారు. ఇప్పటికి ఎనిమిది నెలలు కావస్తోంది. జగన్ ప్రభుత్వ పనుల్లో పడి జనానికి దూరంగా ఉన్నారు. దాంతో పాటు పార్టీ బాధ్యతలు కూడా పెద్దగా పట్టించుకోవడంలేదు. ఈ క్రమంలో జగన్ పల్లె బాట పేరిట మళ్ళీ ప్రజల్లోకి వస్తున్నారు.జగన్ ముఖ్యమంత్రిగా ప్రతి ఒక్క హామీని పూర్తి చేస్తున్నారు.
మళ్లీ ప్రజల దగ్గరకు జగన్
ఇప్పటికైతే ప్రధాన హామీలన్నీ కూడా ఆయన నెరవేర్చారు. దాంతో వాటి ఫలితాలు ఎలా ఉన్నాయో చెక్ చేసుకునేందుకు ఈ పల్లె బాట మొదలుపెడుతున్నట్లుగా తెలుస్తోంది. పల్లెలలో వైసీపీకి గట్టి పట్టుంది. పైగా అనేక సంక్షేమ పధకాలు పల్లె జనం కోసమే ప్రవేశపెట్టినవి ఉన్నాయి. ప్రధాన భాగం రైతులు వీరిలో ఉన్నారు. ఇలా అందరికీ పధకాలు అందుతున్నాయా లేదా అన్నది చూసుకోవడమే కాకుండా వారి సలహా సూచనలు తీసుకోవడం ద్వారా మరింతగా పాలనలో రాణించందుకు జగన్ దీన్ని ఎంచుకున్నారని అంటున్నారు. ఓ విధంగా ఇది సరైన సమయం అని కూడా చెబుతున్నారు.అదే విధంగా చూసుకుంటే దగ్గరలోనే స్థానిక ఎన్నికలు కూడా ఉన్నాయి. పంచాయతీలు, జిల్లా పరిషత్తులు మొత్తానికి మొత్తం గెలుచుకోవాలని జగన్ ఆశిస్తున్నారు. పార్టీని రీచార్జి చేయడం ద్వారానే అది సాధ్యం. ఇలా పల్లె బాటకు వెళ్తూనే మరో వైపు పార్టీని కూడా పరుగులు తీయించాలన్నది జగన్ ఎత్తుగడగా ఉంది. జనంతో మాట్లాడుతూనే పార్టీ నాయకులను కూడా కదిలించాలని ఆలోచన ఉంది. దాని కోసం పల్లెలను చుట్టిరావాలని జగన్ మాస్టర్ ప్లాన్ వేశారని అంటున్నారు. ఇపుడున్న పరిస్థితుల్లో విపక్షం ఏపీలో బలహీనంగా ఉంది. వారు ఇసుక, ఇంగ్లీష్ వంటి వాటి మీద జనంలో ఉద్యమాలు చేసినా స్పందన పెద్దగా లేదు. మరోవైపు కొత్త సర్కార్ మీద కోటి ఆశలు ఉన్నాయి. అయితే సచివాలయంలో కూర్చుని చేసే సమీక్షలు బాగానే ఉంటాయి. క్షేత్ర స్థాయిలో వెళ్తేనె లోటు పాట్లు తెలుస్తాయి. అందుకే జగన్ జనంతోనే ముఖాముఖీ పెట్టుకున్నారు.నిజానికి ఇది వైఎస్సార్ రచ్చ బండకు మారు పేరు. రచ్చ బండ అంటే అచ్చిరాలేదనో, మరో కారణమో తెలియదు కానీ జగన్ పల్లెబాట అంటున్నారు. తాను ఏ పల్లెకు వస్తున్నదీ అధికారులకు సమాచారం ఇవ్వకుండా నేరుగా అక్కడికి చేరుకోవడం జనం ముందే అధికారులను పెట్టి వాస్తవాలను రాబట్టడం ఈ పల్లెబాట ముఖ్య ఉద్దేశ్యంగా చెబుతున్నారు. అదే సమయంలో ఎనిమిది నెలల్లోనే జగన్ కి జనంలో ఆదరణ తగ్గిందని, వ్యతిరేకత పెరిగిందని విపక్షలు చేస్తున్న ప్రచారానికి చేతల ద్వారానే చెక్ చెప్పాలని జగన్ ఈ మార్గం ఎంచుకున్నారని అంటున్నారు. మొత్తానికి చూసుకుంటే రాష్ట్రంలో ఈ మధ్య కాలంలో చంద్రబాబు తిరిగారు, పవన్ తిరిగారు, ఇపుడు జగన్ కార్యక్షేత్రంలోకి వస్తున్నారు. ఆయన రాకతో మొత్తం పొలిటికల్ సీన్ వైసీపీకి అనుకూలంగా మారుతుందని అంటున్నారు. అది రేపటి స్థానిక ఎన్నికల్లో పార్టీని విజయతీరాలకు చేర్చుతుందని కూడా ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. చూడాలి పల్లెబాట ఏపీ రాజకీయాన్ని ఏ వైపుగా మళ్ళిస్తుందో.