రంజు రంజుగా మారిన చీరాల రాజకీయాలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

రంజు రంజుగా మారిన చీరాల రాజకీయాలు

ఒంగోలు, జనవరి 31, (way2newstv.com)
చీరాల రాజకీయాలు రంజుగా మారాయి. టీడీపీలో ఉన్న నేతలందరూ వరసగా వైసీపీ లో చేరిపోవడంతో అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. కరణం బలరాం దగ్గరుండి టీడీపీ ముఖ్యనేతలను వైసీపీలోకి పంపుతున్నారన్న ప్రచారం కూడా లేకపోలేదు. ఇందుకు తరచిచూస్తే అనేక ఉదాహరణలు కన్పిస్తున్నాయి. పోతుల సునీత టీడీపీని వీడి వైసీపీలో చేరడం వెనక కరణం బలరాం ప్రోద్బలం ఉందనే టాక్ నియోజకవర్గంలో బలంగా విన్పిస్తుంది.నిజానికి చీరాల అంటే ఆమంచి కృష్ణమోహన్ అడ్డాగా చెప్పుకోవచ్చు. 2014 ఎన్నికల్లో పోతుల సునీతను ఇతర ప్రాంతాల నుంచి తీసుకు వచ్చి ఇక్కడ పోటీకి తెలుగుదేశం పార్టీ దించింది. 
రంజు రంజుగా మారిన చీరాల రాజకీయాలు

అయినా గెలవలేకపోవడంతో సునీతకు టీడీపీ ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది. పోతుల సునీత టీడీపీ ఇన్ ఛార్జిగా ఉన్నారు. అయితే 2019 ఎన్నికల్లో పోతుల సునీతకు టిక్కెట్ ఇవ్వకుండా అదే జిల్లాకు చెందిన కరణం బలరాంను పోటీకి దించారు. పోతుల సునీత సహకారంతో కరణం బలరాం గెలిచారు. ఆమంచి కృష్ణమోహన్ ఓటమి పాలయ్యారు.అయితే కరణం బలరాం గత కొంతకాలంగా పార్టీలో అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది. వైసీపీలో చేరేందుకు ఆయన సిద్ధమవుతున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో పోతుల సునీతను కరణం బలరాం దగ్గరుండి వైసీపీలోకి పంపారన్న ప్రచారం ఉంది. పోతుల సునీతతో పాటు ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి టీడీపీలో చేరిన యడం బాలాజీ కూడా త్వరలో వైసీపీలో చేరే అవకాశాలు కన్పిస్తున్నాయి. యడం బాలాజీతో పాటు అవ్వారు ముసలయ్య, అమృత పాణి వంటి నేతలు కూడా వైసీపీలో చేరుతున్నారు. వీరంతా ఆమంచికి వ్యతిరేకంగా పనిచేసిన వారే. కరణం బలరాంకు నమ్మకమైన మిత్రులుగా కొనసాగిన వారే.గత కొంతకాలంగా వైసీపీ నాయకులతో కరణం బలరాం సఖ్యతతో మెలుగుతున్నారు. ఒక్క ఆమంచి కృష్ణమోహన్ ను తప్పించి జిల్లాలోని వైసీపీ నేతలతో ఆయన టచ్ లో ఉన్నారు. దీంతో చీరాలలోని టీడీపీ ముఖ్యనేతలందరినీ కరణం బలరాం దగ్గరుండి వైసీపీలోకి పంపుతున్నారన్నది పార్టీలోనే విన్పిస్తున్న టాక్. వైసీపీలో ఆమంచి కృష్ణమోహన్ ను ఒంటరి చేయాలన్నది కరణం బలరాం వ్యూహం కావచ్చు. కానీ ఆమంచి కృష్ణమోహన్ చీరాల వైసీపీ ఇన్ ఛార్జిగా కొనసాగుతారని మంత్రి బాలినేని శ్రీనివాసులురెడ్డి ప్రకటించారు. ఈ నేపథ్యంలో చీరాలలో వైసీపీలోకి మరెంత మందిని కరణం బలరాం పంపుతారో? అన్న అనుమానం పసుపు పార్టీలో నెలకొని ఉంది.