ఇక కార్గోసేవలు (ఆదిలాబాద్) - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఇక కార్గోసేవలు (ఆదిలాబాద్)

ఆదిలాబాద్, జనవరి 10 (way2newstv.com): 
ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తున్న ఆర్టీసీ సేవలను విస్తరిస్తోంది. సంస్థను లాభాల బాటలో నడిపించేందుకు బస్సుల ద్వారా కార్గో పేరిట సరకు రవాణా చేసేందుకు సన్నద్ధమైంది. డిపోల వారీగా వివరాలు సేకరణ పూర్తయ్యింది. ఆదిలాబాద్‌ రీజియన్‌ పరిధిలో ప్రస్తుతం 625 బస్సులు ఉండగా అందులో ఆర్టీసీవి 391, అద్దెబస్సులు 234 ఉన్నాయి. రీజియన్‌ పరిధిలో ఆరు డిపోల నుంచి నెలకు రూ. 80 లక్షల ఆదాయం వస్తుండగా సరకు రవాణా సేవల ద్వారా రూ. 5 లక్షల వరకు ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. తక్షణ సేవల నిమిత్తం డిపోకు రెండు బస్సుల చొప్పున కేటాయించి ఎరుపు రంగు బస్సులతో సేవలు అందించనున్నారు. 
ఇక కార్గోసేవలు (ఆదిలాబాద్)

ప్యాసింజర్‌ విభాగాన్ని ప్రస్తుతం ఉన్న డిపో మేనేజర్లు పర్యవేక్షిస్తుండగా కార్గో విభాగాన్ని పర్యవేక్షించేందుకు డిపోల వారీగా ప్రత్యేక అధికారులను నియమిస్తున్నారు. ఇప్పటికే ఇందుకోసం డిపో, రీజియన్‌ పరిధిలో సేల్స్‌ మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్‌లను ఎంపిక చేసే ప్రక్రియ కొనసాగుతోంది. ప్రభుత్వం ఆర్టీసీ కార్గో సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆయా ప్రభుత్వ సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. సరకు రవాణా డిమాండ్‌ను బట్టి అవసరాలకు అనుగుణంగా సేవలను విస్తరించేందుకు బస్సులను పెంచనున్నట్లు ఆర్టీసీ అధికారులు పేర్కొంటున్నారు. ఆదిలాబాద్‌ రీజియన్‌ పరిధిలో ఆదిలాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, భైంసా, ఆసిఫాబాద్‌, ఉట్నూరు ఆరు డిపోల ఉన్నాయి. కార్గో సేవలకు డిపోకు ఇద్దరు చొప్పున 12 మంది, రీజియన్‌ పరిధిలో మరో ఇద్దరిని ఇలా మొత్తం 14 మందిని ఎంపిక చేసి హైదరాబాద్‌ ముఖ్య కార్యాలయానికి ముఖాముఖి నిమిత్తం పంపించారు. ఇటీవల హైదరాబాద్‌కు వెళ్లిన వీరికి త్వరలో శిక్షణ అందించనున్నారు. కార్గో సేవల్లో భాగంగా కార్యకలాపాలు నిర్వహించేందుకు రీజియన్‌ స్థాయిలో సేల్స్‌ మార్కెట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఒకరు, సహాయ ట్రాఫిక్‌ మేనేజర్‌ ఒక్కరి చొప్పున ఏర్పాటు చేయనున్నారు. వీరు రీజియన్‌ పరిధిలో సరకు రవాణాకు సంబంధించిన మార్కెట్‌ వ్యవహారాలు చూడనున్నారు. డిపోల పరిధిలో సేల్స్‌ మార్కెటింగ్‌ సేల్స్‌ ఎగ్జిక్యూటివ్‌లుగా ఆరుగురిని ఎంపిక చేయనున్నారు. వీరు ఆయా డిపోల పరిధిలో మార్కెట్‌లోకి వెళ్లి బడా వ్యాపారులను సంప్రదించి ఆర్టీసీ సంస్థ ద్వారా సరకు రవాణా ఛార్జీల తీరును వివరించి ఆర్డర్లు బుక్‌ చేస్తారు. సిస్టమ్‌ ఆపరేటర్లుగా డిపోకు ఒక్కరి చొప్పున మొత్తం ఆరుగురు ఆయా డిపోల పరిధిలో బాధ్యతలు నిర్వహించనున్నారు. వీరు బస్సుల ద్వారా సరకు రవాణా వచ్చిన ఆదాయం, డీజిల్‌ ఖర్చు వంటి వివరాలు ఎప్పటికప్పుడు కంప్యూటర్లలో నమోదు చేస్తారు.