వైద్యం అందని ద్రాక్షే (పశ్చిమగోదావరి) - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

వైద్యం అందని ద్రాక్షే (పశ్చిమగోదావరి)

తాడేపల్లిగూడెం, జనవరి 20  (way2newstv.com): 
భౌగోళికంగా జిల్లా నడిబొడ్డునున్న పట్టణంలో ఆధునిక 1వైద్యం అందని ద్రాక్షలా మారింది. అత్యవసర పరిస్థితుల్లో మెరుగైన వైద్యసేవలు అందక ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. ప్రాంతీయ ఆసుపత్రి ఉన్నా పూర్తిస్థాయిలో వైద్యులు లేరు. ఇలాంటి పరిస్థితుల్లో క్షతగాత్రులు సమయానికి మెరుగైన వైద్యసేవలందక మృత్యువాత పడుతున్నారు. ఏలూరు జిల్లా ఆసుపత్రికి వైద్య కళాశాల మంజూరు కావడంతో మరో ఆసుపత్రిని ఉన్నతీకరించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తాడేపల్లిగూడెం పట్టణంలోని ప్రాంతీయ ఆసుపత్రిని జిల్లా వైద్యశాలగా మార్చాలని గూడెం పట్టణ, సమీప ప్రాంతాల ప్రజలు కోరుతున్నారు. తాడేపల్లిగూడెం ప్రాంతీయ ఆసుపత్రిని 2001లో అయిదెకరాల విస్తీర్ణంలో ఏర్పాటుచేశారు. 
వైద్యం అందని ద్రాక్షే (పశ్చిమగోదావరి)

దాని పక్కనే నాలుగెకరాల ప్రభుత్వ స్థలం అందుబాటులో ఉంది. గతంలోనూ వైద్య కళాశాల కోసం పలువురు ఉద్యమంసాగించారు.ఎన్ని అంశాల్లో అభివృద్ధి సాధించినా మెరుగైన వైద్యం విషయంలో మాత్రం తాడేపల్లిగూడెం వెనుకబడి ఉంది. ఇక్కడ ప్రభుత్వ, ప్రైవేటు సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రులు లేవు. జిల్లా ప్రభుత్వాసుపత్రి ఏర్పాటుచేస్తే ఆధునిక వైద్యం అందరికీ అందుబాటులోకి వస్తుంది. గూడెం ప్రాంతీయ ఆసుపత్రికి రహదారి ప్రమాదాలు, ఆత్మహత్య కేసులు అధిక సంఖ్యలో వస్తుంటాయి. జిల్లాలో అత్యధిక డయాలసిస్‌ కేసులు ఇక్కడే నమోదవుతుంటాయి. గతేడాది జనవరి నుంచి నవంబరు వరకు 15,647 డయాలసిస్‌ సెషన్లు నమోదవడం గమనార్హం. జిల్లాలో ఎక్కడా లేనివిధంగా ఇక్కడ 23 డయాలసిస్‌ బెడ్‌లున్నాయి. పట్టణంలో ప్రస్తుతం సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి కొరత ఉంది. సివిల్‌ సర్జన్‌, జనరల్‌ సర్జన్‌, ఆర్థోపెడిక్‌ వైద్యుల కొరతతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కనీసం ఐసీయూ, బ్లడ్‌ బ్యాంకు వంటి సదుపాయాలు లేవు. ఈ ఆసుపత్రిని వైద్య కళాశాలగా అభివృద్ధి చేయాలని గత ప్రభుత్వ హయాంలో మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు ప్రయత్నం చేశారు. తాడేపల్లిగూడెం ప్రాంతీయ ఆసుపత్రికి నల్లజర్ల, ఉంగుటూరు, నిడమర్రు, గణపవరం, నిడదవోలు తదితర మండలాల నుంచి రోగులు వైద్యం నిమిత్తం వస్తుంటారు. ఆధునిక వైద్య సేవలు అందుబాటులో లేకపోవడంతో వారు ఇబ్బందులు పడుతున్నారు. జాతీయ రహదారి పట్టణం మీదుగా వెళ్తున్నందున రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారిని ప్రాంతీయ ఆసుపత్రికి తీసుకొస్తుంటారు. వైద్య నిపుణులు, అవసరమైన వైద్య పరికరాలు అందుబాటులో లేనందున విషమ పరిస్థితుల్లో ఉన్న వారికి వైద్యం అందించడం కష్టతరమవుతోంది. గత్యంతరం లేక వారిని ఏలూరు, రాజమహేంద్రవరం, విజయవాడ ప్రాంతాలకు రెఫర్‌ చేయాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో సకాలంలో సరైన వైద్యం అందక ఎంతోమంది మృత్యువాత పడుతున్నారు. పట్టణంలోని ప్రాంతీయ ఆసుపత్రిని జిల్లా ఆసుపత్రిగా అభివృద్ధి చేస్తే ఎంతో మంది ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుంది. ప్రాంతీయ ఆసుపత్రిలో మహిళలు, చిన్నపిల్లలు, జనరల్‌ సర్జన్‌, దంత, కంటి, మత్తు, క్షయ అనే ఏడు విభాగాల్లో సేవలు అందిస్తున్నారు. జిల్లా ఆసుపత్రిగా అభివృద్ధి చెందితే మొత్తం 15 విభాగాల్లో వైద్యసేవలందించే వీలుంది. ప్రస్తుత వైద్యులకు అదనంగా న్యూరో, ఎముకలు, ప్రసూతి, జనరల్‌ మెడిసిన్‌, మానసిక, ఈఎన్‌టీ వైద్య నిపుణులుంటారు. అంతేకాకుండా 350 పడకలతోపాటు ఐసీయూ, వెంటిలేటర్‌, సీటీ స్కాన్‌, ఎంఆర్‌ఐ, ట్రామాకేర్‌ వంటి సౌకర్యాలు సమకూరే అవకాశం ఉంటుంది.