రాజమండ్రి, జనవరి 30, (way2newstv.com)
రాష్ట్ర రాజకీయ అంశం రైతులు ప్రభుత్వానికి మధ్య తీవ్రస్థాయిలో చిచ్చురేపింది. ఇక, ప్రతిపక్షాలకు, అధికార పక్షానికి కూడా రచ్చ రేపింది. ఇవన్నీ ఒకటైతే.. మరోపక్క, రాజధాని విషయంలో కలిసి ఉమ్మడిగా ఉండే కింజరాపు ఫ్యామిలీలో కూడా రచ్చ రేగిందనే వార్తలు వస్తున్నాయి. రాష్ట్రంలో మూడు రాజధానులను ప్రతిపాదిస్తూ జగన్ సర్కారు కమిటీలు వేయడం తెలిసిందే. అయితే, ఈ విధానాన్ని వ్యతిరేకిస్తూ ప్రతిపక్షాలు ముఖ్యంగా టీడీపీ రోడ్డెక్కింది. వివిద రూపాల్లో ఆందోళన వ్యక్తం చేసింది. పార్టీ అధినేత చంద్రబాబు రోజుకో రూపంలో నిరసన వ్యక్తం చేశారు.రాష్ట్రానికి మూడు రాజధానులు వద్దని, అమరావతినే కొనసాగించాలని చంద్రబాబు డిమాండ్ చేస్తున్నారు. ఇక, అధినేత ఎటు ఉంటే.. పార్టీ నాయకులు కూడా అటే ఉండాలనేది రాజకీయ సిద్దాంతం.
కింజరపు ఫ్యామలీలో రేగిన రచ్చ
ఈ విషయంలో ఆది నుంచి చంద్రబాబుకు, పార్టీకి అనుకూలంగా రాజకీయాలు చేసిన కింజరాపు ఫ్యామిలీలో కాస్త తేడా వచ్చిందనే అంటున్నారు. దివంగత కింజరాపు ఎర్రన్నాయుడు సోదరుడు అచ్చెన్నాయుడు, ఎర్రన్న కుమార్తె ఆదిరెడ్డి భవానీ, ఆయన కుమారుడు రామ్మోహన్‌నాయుడులు ప్రస్తుతం టీడీపీ ప్రజాప్రతినిధులుగా ఉన్నారు. వీరంతా కూడా వాస్తవానికి చంద్రబాబు వెంట నడవాలి.అయితే, రాజధానిని విశాఖలో ఏర్పాటు చేయడం అనే కాన్సెప్ట్‌ను ఉత్తరాంధ్ర ప్రజలు యాక్సెప్ట్ చేశారు. దీనివల్ల వెనుకబడిన శ్రీకాకుళం జిల్లాకు న్యాయం జరుగుతుందని పెద్ద ఎత్తున నమ్ముతున్నారు. ఈ క్రమంలో ఇదే జిల్లా నుంచి ఎంపీగా ఉన్న రామ్మోహన్ నాయుడు ప్రభుత్వ ప్రతిపాదనను వ్యతిరేకించే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో ఆయన చంద్రబాబు నిర్వహిస్తున్న ఆందోళనా కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఏ విషయంలో అయినా గల్లీ టు ఢిల్లీ వరకు టీడీపీ తరపున తన వాయిస్ వినిపించే రామ్మోహన్‌నాయుడు ఈ విషయంలో మాత్రం పెద్దగా నోరు మెదపడం లేదు. ఓ విధంగా చెప్పాలంటే ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారని కూడా వైసీపీ వాళ్లు విమర్శిస్తున్నారు.ఇక, తాను రాజమండ్రి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి తన తండ్రి ఎర్రన్నాయుడు ఆశయమైన ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందాలంటే విశాఖ రాజధాని కావాల్సి ఉందని ఆదిరెడ్డి భవానీ కూడా అనుకుంటున్నారట. ఈ నేపథ్యంలోనే ఆమె ఆదివారం జరిగిన టీడీఎల్పీ సమావేశానికి హాజరు కాలేక పోయారు. అయితే ఇది ఇష్యూ కాకుండా వ్యక్తిగత కారణాల వల్లే తాను సమావేశానికి రాలేదని కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారంటున్నారు. ఇలా అక్కా తమ్ముళ్లు ఇద్దరూ కూడా చంద్రబాబుకు అనుకూలంగా ముందుకురాలేని పరిస్థితి ఏర్పడింది. ఇక, ఇష్టం ఉన్నా లేకున్నా.. అచ్చెన్న మాత్రం చంద్రబాబుకు అనుకూలంగా మాట్లాడుతున్న పరిస్థితి నెలకొంది. ఇక, వైసీపీ నేతల ప్రచారం వేరేగా ఉంది. వైసీపీ నేతలు మాత్రం అచ్చెన్న బాబుకు కట్టు బానిస అని విమర్శలు చేస్తున్నారు. ఓ సారి అమరావతి వద్దు మూడు రాజధానులు ముద్దు అన్న ర్యాలీలో రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారని విమర్శిస్తున్నారు. ఆయనకు ఇష్టం ఉన్నా పార్టీ స్టాండ్‌కు యాంటీగా వెళ్లలేక ఇలా చేస్తున్నాడని చర్చలు సాగుతున్నాయి. మొత్తంగా చూస్తే.. రాజధాని అంశం ఎర్రన్న ఫ్యామిలీలో గందరగోళం సృష్టించిందని అంటున్నారు పరిశీలకులు.