కడప, జనవరి 30, (way2newstv.com)
ఆకేపాటి అమర్ నాధ్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే. రాజంపేట నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆకేపాటి అమర్ నాధ్ రెడ్డి వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు. 2009లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆకేపాటికి రాజంపేట సీటు ఇచ్చారు. గెలిపించుకున్నారు. దీంతో వైఎస్ కుటుంబం అంటే ఆకేపాటి అమర్ నాధ్ రెడ్డికి తిరుగులేని ప్రేమ. అందుకే వైఎస్ మరణం తర్వాత ఆయన వైసీపీలో చేరారు. జగన్ కు మద్దతుగా రాజీనామా చేసి 2012లో ఉప ఎన్నికల్లో ఆకేపాటి అమర్ నాధ్ రెడ్డి రాజంపేట నుంచి విజయం సాధించారు.ఉప ఎన్నికల్లో గెలిచిన ఆకేపాటి అమర్ నాధ్ రెడ్డికి తిరిగి 2014లో జగన్ వైసీపీ టిక్కెట్ ఇచ్చారు. అయితే ఆ ఎన్నికల్లో కడప జిల్లా మొత్తం మీద ఓటమి పాలయింది ఆకేపాటి అమర్ నాధ్ రెడ్డి మాత్రమే.
ఆకేపాటికి ఆశల గల్లంతే
2019 ఎన్నికల్లో ఆయన తన టిక్కెట్ ను త్యాగం చేయాల్సి వచ్చింది. తన మీద 2014 ఎన్నికల్లో గెలిచిన మేడా మల్లికార్జునరెడ్డి వైసీపీలో చేరడంతో ఆకేపాటి అమర్ నాధ్ రెడ్డి తన టిక్కెట్ ను వదులుకోవాల్సి వచ్చింది. అయితే వైసీపీ అధికారంలోకి వస్తే మంచి పదవి ఇస్తానని జగన్ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.కానీ వైసీపీ అధికారంలోకి వచ్చినా ఇప్పటి వరకూ ఆకేపాటి అమర్ నాధ్ రెడ్డిని పార్టీ అధిష్టానం పట్టించుకోవడం లేదు. ఆకేపాటి వెంకటేశ్వరస్వామి భక్తుడు కావడంతో ఆయనకు టీటీడీ ఛైర్మన్ పదవి ఇస్తారనుకున్నారు. కానీ అది వైవీ సుబ్బారెడ్డికి దక్కింది. టీటీడీ సభ్యుడిగా కూడా ఆకేపాటిని నియమించలేదు. ఇక ఎమ్మెల్సీ వస్తుందనుకున్నా ఇటీవల రెండు ఎమ్మెల్సీలను రాయలసీమ నుంచి ఇక్బాల్, చల్లా రామకృష్ణారెడ్డిలకు ఇచ్చారు. దీంతో ఇప్పుడప్పుడే ఎమ్మెల్సీ పదవులను రాయలసీమ నుంచి భర్తీ చేయకపోవచ్చన్న వాదన పార్టీలో బలంగా ఉంది. కడప జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవి ఆకేపాటి అమర్ నాధ్ రెడ్డికి వస్తుందన్న ప్రచారం నిన్న మొన్నటి వరకూ జరిగింది. కడప జిల్లా పరిషత్ ఓసీ జనరల్ కు రిజర్వ్ కావడంతో ఆకేపాటి కూడా దానిపై ఆశలు పెట్టుకున్నారు. అయితే కడప జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవి కోసం వైఎస్ కుటుంబీకులు పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. వైఎస్ వివేకా బావమరిది శివప్రకాష్ రెడ్డితో పాటు జగన్ చిన్నాన్న మల్లికార్జున రెడ్డి కూడా జడ్పీ ఛైర్నన్ పదవి కోసం పోటీ పడుతున్నారు. జగన్ పై వారు వత్తిడి కూడా తెస్తున్నట్లు తెలుస్తోంది. జగన్ వత్తిడికి తలొగ్గితే ఆకేపాటికి ఆ పదవి కూడా ఇక రానట్లే.