నిద్రపోతున్న రెవెన్యూ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

నిద్రపోతున్న రెవెన్యూ

1000 కోట్లు దాటినా నాలా బాకీలు
హైద్రాబాద్, జనవరి 30, (way2newstv.com)
ఐదేళ్ల నుంచి ఎగ్గొట్టిన నాలా  ఫీజును వసూలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 2014 నుంచి ఇప్పటివరకు రూ.1,000 కోట్ల మేర ప్రభుత్వానికి ఆదాయం రావాల్సి ఉండగా రెవెన్యూ శాఖ పట్టించుకోవట్లేదని ఇటీవల విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ నిగ్గు తేల్చింది. రాష్ట్రంలో సుమారు 12 లక్షల ఎకరాలకు పైగా సాగు భూమి ఇటీవల కాలంలో వ్యవసాయేతర భూములుగా మారిపోయింది. రెవెన్యూ శాఖ భూ రికార్డుల ప్రక్షాళన వివరాల ప్రకారం వ్యవసాయేతర రంగాలకు సాగు భూమిని మళ్లీంచినట్టుగా అధికారుల గణాంకాలు పేర్కొంటున్నాయి. సుమారు 12,98,990 వ్యవసాయ భూములు వ్యవసాయేతర అవసరాల కోసం మార్చినట్టుగా తాజాగా రెవెన్యూ రికార్డుల్లో పేర్కొన్నారుఅయితే చాలామంది నాలా ఫీజులను చెల్లించకుండా కిందిస్థాయి అధికారులతో కుమ్మక్కై ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి గండికొట్టినట్టుగా విజిలెన్స్ విభాగం గుర్తించింది. 
 నిద్రపోతున్న రెవెన్యూ

రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి కేసులు చాలావరకు పెండింగ్‌లో ఉన్నాయని విజిలెన్స్ అధికారులు గుర్తించారు. జిల్లాల వారీగా నివేదికను తయారు చేసిన విజిలెన్స్ ఈ రిపోర్టును ప్రభుత్వానికి అందజేసింది. వ్యవసాయ భూములను ఇతర అవసరాలకు మార్పిడి చేసుకోవాలంటే రిజిస్ట్రేషన్ విలువలో 3 శాతాన్ని ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఫీజును చెల్లించకుండా పలువురు రియల్టర్లు, బడాసంస్థలు తప్పించుకున్నట్టుగా విజిలెన్స్ తన నివేదికలో పేర్కొంది.కొందరు రియల్టర్లు, బడా బాబులు ఇవేమీ పట్టించుకోకుండా వ్యవసాయేతర అవసరాలకు భూములను మళ్లీంచినట్టుగా విజిలెన్సు తనిఖీలో వెల్లడయ్యింది. వ్యవసాయ భూముల్లో లే ఔట్లను అభివృద్ధి చేసుకోవడం, పరిశ్రమలు, ఇతరత్రా వ్యాపార సంస్థలను నెలకొల్పి, భూ వినియోగ మార్పిడి ఫీజు చెల్లించకుండా ప్రభుత్వ ఖజానాకు చాలామంది ఎగ్గొట్టారు. రెవెన్యూ శాఖ నిర్లక్ష్యంగా వహించడం వల్లే ఇలా జరిగిందని ఈ కేసులను గుర్తించిన విజిలెన్స్ విభాగం ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో ఈ విషయాన్ని స్పష్టం చేసింది.ఈ మేరకు ఇటీవల ఆదాయ వనరులను సమీక్షించిన ఆర్థిక మంత్రి హరీశ్‌రావు పెండింగ్‌లో ఉన్న నాలా ఫీజులను వసూలు చేయాలని రెవెన్యూ శాఖను ఆదేశించారు. దీంతో జిల్లాల వారీగా రావాల్సిన నిధులను తక్షణమే వసూలు చేయాలని ఆదేశిస్తూ రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు జిల్లా కలెక్టర్లకు లేఖ రాశారు. అయినా ఇప్పటివరకు ఎవరూ స్పందించడం లేదని, త్వరలో ఫీజు ఎగ్గొట్టిన వారికి నోటీసులు జారీ చేయడంతో పాటు, విధి నిర్వహణలో నిర్లక్షం వహించిన రెవెన్యూ అధికారులు, సిబ్బందికి మెమో జారీ చేయాలని రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు నిర్ణయించినట్టుగా సమాచారం.సాగు ప్రయోజనాలే లక్షంగా 1963లో ప్రభుత్వం వ్యవసాయేతర భూ వినియోగ చట్టం (నాలా)ను అమల్లోకి తెచ్చింది. అనేక సందర్భాల్లో ఈ చట్టానికి సవరణలు చేశారు. ఆహార భద్రత చట్టం, ఇతరుల సాగు ప్రయోజనాలకు ఆటంకం కలగకుండా, నీటి వనరులు, చెరువు శిఖం, నాలాలు తదితర అంశాలు లేని వాటికే నాలా చట్టం కింద అనుమతులు జారీ చేయాలని చట్టం లో పేర్కొన్నారు. అయితే నాలా చట్టం అమల్లో ఉండడం వలన చాలామంది రియల్ వైపు ఆకర్శితులవుతున్నారని, వ్యవసాయ భూ విస్తీర్ణం తగ్గుతుందని ఈ నేపథ్యంలో ఆహార కొరత ఏర్పడే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారతెలంగాణలో భూభాగం విస్తీర్ణం 112.08 లక్షల హెక్టా ర్లు కాగా ఇందులో 37.3 శాతం (2015, 16 అంచనాల ప్రకారం) సాగులో ఉందని ఇప్పటివరకు ప్రభు త్వం భావిస్తోంది. మరో 23శాతం భూమి అటవీ భూమి ఉండగా మిగతా భూమి వ్యవసాయేతర అవసరాలకు వినియోగిస్తున్నారని ప్రభుత్వం పేర్కొంటుంది. ప్రస్తుతం ఈ లెక్కలన్నీ పూర్తిగా మారిపోయాయి. 2015 మరియు 16లో రాష్ట్రంలో స్థూల నీటి పారుదల విస్తీర్ణం 2027 లక్షల హెక్టార్లకు పడిపోయింది. 2014, 15లో ఇది 25.29 లక్షల హెక్టార్లతో పోలిస్తే 19.85 శాతం తక్కువగా ఉంది. నికర నీటి పారుదల విస్తీర్ణం కూడా 2014, 15లో 17.26లక్షల హెక్టార్లు ఉంటే 2015, 16లో 14.86లక్షల హెక్టార్లకు పడిపోయింది. ఈ తగ్గుదల 13.90 శాతంగా ఉంది. దీంతో ప్రభుత్వం అనేక రకాల దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుట్టింది.