తిరుపతిలో గెలిచినా...గూడురుపైనే ప్రేమ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

తిరుపతిలో గెలిచినా...గూడురుపైనే ప్రేమ

నెల్లూరు, జనవరి 29, (way2newstv.com)
ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీగా గెలిచారు. కానీ తన నియోజకవర్గాన్ని మాత్రం మరిచిపోయారు. మనసంతా అసెంబ్లీ స్థానం మీదనే ఉండటంతో పార్లమెంటు సభ్యుడి బాధ్యతను మరిచారు. ఆయనే బల్లి దుర్గాప్రసాదరావు. బల్లి దుర్గాప్రసాదరావు నిజానికి తెలుగుదేశం పార్టీ నేత. టీడీపీ హయాంలో ఆయన మంత్రిగా కూడా పనిచేశారు. గూడురు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన బల్లి దుర్గా ప్రసాదరావు గత ఎన్నికలకు ముందు వైసీపీలో అనూహ్యంగా చేరారు.ఎన్నికలకు ముందు వరకూ బల్లి దుర్గాప్రసాద్ టీడీపీలోనే ఉన్నారు. అయితే గూడూరు టిక్కెట్ తనకు రాదని తెలియడంతో ఆయన వైసీపీ వైపు చూశారు. వైసీపీలో గూడూరు అసెంబ్లీ టిక్కెట్ కావాలని అధిష్టానాన్ని కోరారు. 
తిరుపతిలో గెలిచినా...గూడురుపైనే ప్రేమ

అయితే అప్పటికే తిరుపతి ఎంపీగా పనిచేసిన వరప్రసాద్ కు మాట ఇవ్వడంతో ఆయనకే ఖరారు చేసింది. బల్లి దుర్గాప్రసాద్ కు తిరుపతి ఎంపీ టిక్కెట్ ను ఇచ్చింది. అయిష్టంగానే బల్లి దుర్గాప్రసాద్ ఎన్నికల బరిలోకి దిగారు.ఎంపీ అభ్యర్థిగా బల్లి దుర్గాప్రసాద్ కనీసం తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ప్రచారం నిర్వహించలేదు. ముఖ్యమైన తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు నియోజకవర్గాల్లో కనీసం కాలు మోపలేదు. అయితే వైసీపీ గాలిలో బల్లి దుర్గాప్రసాద్ గెలిచారు. తిరుపతి టీడీపీ ఎంపీ అభ్యర్థి పనబాక లక్ష్మిపై భారీ మెజారిటీతో విజయం సాధించారు. తిరుపతి పార్లమెంటు పరిధిలోని అన్ని శాసనసభ నియోజకవర్గాలను వైసీపీ గెలుచుకోవడం విశేషం. ఇంత భారీ మెజారిటీతో గెలిపించిన ప్రజలకు మాత్రం బల్లి దుర్గాప్రసాద్ అందుబాటులో లేకుండా పోయారు.ఇక ఎంపీీ అయిన తర్వాత బల్లి దుర్గాప్రసాద్ తిరుపతికి పూర్తిగా దూరమయ్యారంటున్నారు. ఆయన ఎక్కువగా గూడూరు నియోజకవర్గానికే సమయం వెచ్చిస్తున్నారన్నారు. తిరుపతి పార్లమెంటు నియోజకవర్గానికి అడపా దడపా తిరుపతికి వచ్చి వెళ్లిపోతున్నారు. కార్యకర్తలకు కూడా అందుబాటులో ఉండటం లేదు. దీనిపై కొందరు వైసీపీ కార్యకర్తలు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేదు. ఇలా బల్లి దుర్గప్రసాద్ గెలిచిన నియోజకవర్గాన్ని పూర్తిగా వదిలేసి తన సొంత నియోజకవర్గమైన గూడూరుపైనే ఎక్కువ దృష్టిపెట్టారు. కనీసం ఇక్కడ ఎంపీ కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేసుకోలేదు.