ఒంగోలు, జనవరి 21, (way2newstv.com)
సీనియర్ నేత దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకున్నట్లే కన్పిస్తుంది. గత కొద్ది నెలలుగా దగ్గుబాటి వెంకటేశ్వరరావు నియోజకవర్గానికి కూడా దూరంగా ఉంటున్నారు. దీనికి ప్రధాన కారణం పార్టీలో రావి రామనాధం బాబుకు ప్రయారిటీ లభించడమే. మరోవైపు అధికార వైసీపీ కూడా దగ్గుబాటి వెంకటేశ్వరరావును పార్టీకి దూరంగా ఉండాలని నిర్ణయించడంతో ఆయన ప్రస్తుతానికి మౌనంగానే ఉండటం బెటరని భావిస్తున్నారు.దగ్గుబాటి వెంకటేశ్వరరావు గత ఎన్నికల్లో పర్చూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. రాష్ట్రమంతటా జగన్ గాలి వీచినా పర్చూరులో ఓటమికి దగ్గుబాటి వెంకటేశ్వరరావు స్వయంకృతాపరాధమే కారణమని వైసీపీ అధిష్టానం భావిస్తుంది. దగ్గుబాటి మితిమీరిన విశ్వాసానికి పోవడం వల్లనే ఓటమి పాలయ్యారని విశ్లేషణలో తేల్చింది.
రాజకీయాలకు దూరంగా దగ్గుబాటి
దీనికి తోడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు సతీమణి పురంద్రీశ్వరి వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేయడాన్ని కూడా వైసీపీ తప్పుపడుతుంది. అందుకే దగ్గుబాటి దంపతులు ఒకే పార్టీలో ఉండాలని అల్టిమేటం జారీ చేసింది.దీనికి తోడు రావిరామనాధం బాబును తిరిగి పార్టీలోకి చేర్చుకోవడం, కీలక బాధ్యతలను అప్పగించడంతో దగ్గుబాటి వెంకటేశ్వరరావు పార్టీకి దూరమయ్యారు. తాను రాజకీయాలకు దూరంగా ఉండదలచుకున్నానని దగ్గుబాటి రాజ్యసభ సభ్యుడు విజయసాయరెడ్డితో చెప్పారు. తన స్థానంలో తన కుమారుడు హితేశ్ కు స్థానం కల్పించాలని దగ్గుబాటి వెంకటేశ్వరరావు కోరారు. ఇందుకు వైసీపీ అధిష్టానం సుముఖత వ్యక్తం చేయలేదు.తాజాగా పర్చూరు శాసనసభ్యుడు ఏలూరు సాంబశివరావును కూడా పార్టీలోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. కొందరు వైసీపీ నేతలు సాంబశివరావుతో మంతనాలు సాగించారు. ఏలూరిని పార్టీలోకి తీసుకుంటే ఇక పర్చూరు రాజకీయాల్లో తమ పాత్ర ఉండదని గ్రహించిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు పూర్తిగా పార్టీకి, నియోజకవర్గానికి దూరమయ్యారని తెలిసింది. హైదరాబాద్ లో ఉన్న ఆయనను కలసిన అనుచరులకు కూడా దగ్గుబాటి కొంత సమయం వేచి చూడాలని చెప్పినట్లు సమాచారం. మొత్తం మీద దగ్గుబాటి వెంకటేశ్వరరావు గత నెలలుగా పార్టీకి, నియోజకవర్గానికి దూరంగా ఉండటం చర్చనీయాంశమైంది. దగ్గుబాటి పూర్తిగా రాజకీయాలకు దూరమయినట్లేనన్న కామెంట్స్ విన్పిస్తున్నాయి.