కేంద్రం కోర్టులోకి మండలి బంతి - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

కేంద్రం కోర్టులోకి మండలి బంతి

గుంటూరు, జనవరి 28, (way2newstv.com)
రాష్ట్ర శాసన మండలిని రద్దు చేయాలన్న అధికార పార్టీ నిర్ణయంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాలదే తుది నిర్ణయం అవుతుందని రాజకీయ నిపుణులు వెల్లడిస్తున్నారు. వారు రద్దుకు అనుకూలంగా ఉంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు లోక్‌సభ ముందుకు ఆంధ్రప్రదేశ్ శాసనమండలి రద్దు బిల్లును ప్రవేశపెట్టి ఆమోదింపజేశారు. మండలి రద్దుకు వారు వ్యతిరేకమైతే శాసనసభ తీర్మానం చేసి బిల్లు పంపినా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా ఉంటుందని వారు స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం దేశంలో 6 రాష్ట్రాల్లో మాత్రమే శాసనమండలి కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌తో పాటు పొరుగున ఉన్న కర్నాటక, తెలంగాణ, మహారాష్ట్ర, బిహార్, ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రాల్లో మాత్రమే శాసనమండలి (విధాన పరిషత్) కార్యకలాపాలు నిర్వహిస్తోంది. 
కేంద్రం కోర్టులోకి మండలి బంతి

పశ్చిమబెంగాల్‌లో 1969లో రద్దు కాగా మళ్లీ పునరిద్ధరించుకోవడానికి ఆ రాష్ట్రం ప్రయత్నిస్తున్నా వీలుకాని పరిస్థితి ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ఎగువ సభగా పిలుచుకునే శాసన మండలిని రద్దు చేయాలని 1984లో ఎన్టీ రామారావు ప్రభుత్వం శాసనసభలో తీర్మానించింది. ఆ తరువాత పునరుద్ధరణ చేయాలని 2004లో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం శాసనసభలో తీర్మానం చేసింది. తాజాగామరోమారు ముఖ్యమంత్రి వైఎహ్ జగన్మోహన్‌రెడ్డి మళ్లీ రద్దు కోసం శాసనసభలో తీర్మానం చేశారు. మరోవైపు రాష్ట్ర శాసనసభలో తీర్మానం చేసినంత సులభంగా మండలి రద్దు కాదని ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నాయకులు ధీమాతో ఉన్నారు. తండ్రి పునరుద్ధరిస్తే తనయుడు మళ్లీ రద్దు చేయాలన్న ఆలోచన ఏంటని పలు రాజకీయ పార్టీల నాయకులు ప్రశ్నించారు. శాసన మండలి అనవసరం అనే రాజకీయ పార్టీల సంఖ్య ఎక్కువగానే ఉన్నప్పటికీ తాజా పరిస్థితుల నేపథ్యంలో సీఎం నిర్ణయం తొందరపాటని వైసీపీ సహా అన్ని పార్టీల సీనియర్ నాయకులు అభిప్రాయపడుతున్నారు. తన మాట చెల్లుబాటు కాలేదన్న ఆలోచనతో రద్దు ప్రతిపాదన చేశారన్న అభిప్రాయం జనంలో ఉంటుందని వారు గుర్తుచేస్తున్నారు. శాసస మండలి రద్దుకు సరైన కారణం చెప్పకుండా కేవలం ఖర్చులు వృథా అన్న అభిప్రాయంతో తీర్మానం చేస్తే ప్రజలకు సమాధానం చెప్పడం కష్టమని వారంటున్నారు. అంతేగాక మండలి సభ్యత్వమైనా దక్కుతుందని వైసీపీకి మద్దతు ఇస్తున్న అనేక మంది నాయకులు ఆ పార్టీకి దూరమయ్యే అవకాశం ఉందని వారు భావిస్తున్నారు.. జగన్ తన నిర్ణయాన్ని అమలు చేయాలన్న పట్టుదలతో ముందుకు వెళ్తే కేంద్రంలో మోకాలొడ్డే అవకాశం ఉంటుందని దాంతో మరిన్ని చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తుందని వారు హెచ్చరిస్తున్నారు.