అనంతపురం, జనవరి 23, (way2newstv.com)
కొందరు ఊహించినట్టుగానే ఎస్సీ వర్గానికి చెందిన మాజీ మంత్రి, డాక్టర్ శైలజానాథ్ ఏపీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పగ్గాలు చేపట్టారు. వాస్తవానికి ఈ రేసులో చాలా మంది సీనియర్లు ఉన్నా.. వారిని కూడా కాదని ఎస్సీ వర్గాన్ని, ముఖ్యంగా ఓటు బ్యాంకును మళ్లీ దరి చేర్చుకునేందుకు కాంగ్రెస్ అధిష్టానం ఈ పదవికి శైలజానా థ్‌ను ఎంపిక చేసింది. వివాద రహితుడు, అవినీతి మరకలు లేని విద్యావంతుడు కావడం శైలజానాథ్‌కు కలిసి వచ్చాయి. 2004కు ముందు వరకు ఆయన ఓ ప్రజాడాక్టర్. ప్రభుత్వ ఉద్యోగంలో క్షణం తీరిక లేకుండా గడిపారు. అయితే, వైఎస్ రాజశేఖరరెడ్డి పిలుపుతో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరి అదే ఏడాది ఎన్నికల్లో పోటీ చేశారు.అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం నుంచి 2004, 2009 ఎన్నికల్లో వరుస విజయాలు సాధించిన ఆయన కాంగ్రెస్ పార్టీలో మంచి పేరు తెచ్చుకున్నారు.
శైలజకు ముందుంది..గడ్డుకాలమే
వైఎస్ వర్గంగా పేరు తెచ్చుకున్నా అందరినీ కలుపుకొని పోయారు. వైఎస్ మరణానంతరం 2011లో ఆయనకు మంత్రి పదవి కూడా దక్కింది. ఎవరినీ తొందరపడి విమర్శించకపోవడం, మీడియాలో నిత్యం కనిపించాలనే ఆరాటం లేక పోవడం ప్రత్యేకంగా ఎవరినీ ఆయన టార్గెట్ చేసేలా రాజకీయాలు చేయకపోవడంతో ఆయనకు పీసీసీ పగ్గాలు అందడం పెద్ద శ్రమగా భావించలేదు. అయితే, అసలు శ్రమంతా ఇప్పుడే మొదలైందని అంటున్నారు ఆయన అనుచరులుఒకప్పుడు ఏపీలో కాంగ్రెస్‌కు హారతులు పట్టిన పరిస్థితి ఉంది. సంస్థాగత ఓటు బ్యాంకును సొంతం చేసుకున్న పార్టీ తరఫున ఎవరు పోటీ చేసినా వ్యక్తులతో సంబంధం లేకుండా గెలుపు గుర్రం ఎక్కిన పరిస్థితి ఉంది. అయితే, రాష్ట్ర విభజన ఎఫెక్ట్‌తో ఈ ఓటు బ్యాంకు పూర్తిగా వైసీపీ పరం అయింది. ఇప్పుడు రాష్ట్రంలో పెద్దగా కాంగ్రెస్ జాడలు కూడా కనిపించడం లేదు. ఒకప్పుడు వీధికి ఒక్కచోటైనా.. కాంగ్రెస్ జెండా ఎగిరిన పరిస్థితి నుంచి ఇప్పుడు కాంగ్రెస్ జెండాను చూద్దామన్నా కనిపించని పరిస్థితికి పార్టీ దిగజారి పోయింది. సీనియర్లు, మంత్రులు , తరతరాలుగా పార్టీ నీడన బతికిన వారు సైతం ఇప్పుడు పార్టీలో లేరు.2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌లో కొంతమంది కీలక నేతలు అయినా ఉన్నారు. గతేడాది ఎన్నికల్లో ఆ పార్టీపై ఆశలు వదులుకున్న వారంతా వైసీపీ, టీడీపీల్లోకి జంప్ చేసేశారు. ఇక ఆ పార్టీని గత ఎన్నికల వరకు మోసిన రఘువీరారెడ్డి కూడా కాడి కింద పడేయడంతో చివరకు కాంగ్రెస్ క్యాస్ట్ ఈక్వేషన్ల నేపథ్యంలో గతంలో తనకు కంచుకోటగా ఉన్న ఎస్సీ వర్గానికి చెందిన శైలజనాథ్‌కు ఈ పదవి కట్టబెట్టింది. మరి ఇలాంటి పరిస్థితి నుంచి మరో నాలుగేళ్లలో వచ్చే ఎన్నికల నాటికి పార్టీని రంగంలోకి దింపి ట్రాక్ ఎక్కించడం అనేది శైలజానాథ్‌కు అంత ఈజీ కాదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.పైగా రాజకీయంగా ఎలాంటి వ్యూహాలు లేకుండానే ఆయన రాజకీయ జీవితం గడిచిందనే అభిప్రాయం కూడా ఉంది. మరి ఇప్పుడు వ్యూహ, ప్రతివ్యూహాలు లేకుండా పార్టీని నడిపించడం అనేది అంత సులువైన విషయం కాదు. ప్రధానంగా జగన్ వంటి బలమైన ప్రజానేతను ఎదుర్కొని పోయిన ఓటుబ్యాంకును తిరిగి రాబట్టుకోవడంతోపాటు నాయకులను తిరిగి ఘర్ వాపసీ చేసుకోవడం వంటివి కూడా శైలజానాథ్‌కు అగ్ని పరీక్షే. నిజానికి రాష్ట్రంలో చాలా జిల్లాల్లో శైలజానాథ్ అంటే ఎవరో కూడా తెలియని పరిస్థితి ఉంది. మరి ఇవన్నీ దాటుకుని ఆయన ఎలా సక్సెస్ అవుతారో చూడాలిఅంటున్నారు కాంగ్రెస్ సానుభూతి పరులు.