గుంటూరు, జనవరి 7, (way2newstv.com)
రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ 29 గ్రామాల్లోని రైతులు, ప్రజలు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, వ్యూహాత్మకంగా సాగుతున్న ఈ పోరులో ఏపీ ప్రధాన ప్రతిపక్షం టీడీపీ చెబు తున్నట్టు సీఎం జగన్‌పై వ్యతిరేకత కనిపించడం లేదు. పైగా ఇక్కడి ప్రజలు జగన్ పాలనను ఎక్కడా తిప్పి కొట్టడం లేదు కూడా. ఆయనకు సూచనలు మాత్రమే చేస్తున్నారు. మీ పాలన బాగుంది. మీ పాలన ముందుకు కొనసాగించండి. అయితే, మాబాధ వినండి. మేం చెప్పేది ఆలకించండి. కేవలం కమిటీ రిపోర్టులతోనే మార్పు చేయడం కాదు- అని మాత్రమే ఇక్కడి ప్రజల ప్రధాన సూచనగా కనిపిస్తోంది.గడిచిన రెండు వారాలుగా రాజధాని అమరావతిలో ఆందోళనలు తీవ్ర స్థాయిలోనే జరుగుతున్నాయి.
సంక్షేమ పథకాలకే జనాలు ఓటు
అయితే, దీనికి రాజకీయ నాయకుల ప్రోద్బలం.. వారి ఉత్సాహం కలబోతగా ఉండడంతో ఈ ఆందోళనలు ఊపందుకు న్నాయి. ఈ క్రమంలోనే నాయకులు చేస్తున్న ప్రసంగాల్లో జగన్‌పై ఆరోపణలు చేస్తున్నారు. ఆయనకు పాలించడం రాదని, రిజైన్ చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్లాలని అంటున్నారు. కానీ, క్షేత్రస్థాయిలో మహిళలు కానీ, రైతులు కానీ జగన్ పాలనపై ఎక్కడా కూడా మరీ అంత వ్యతిరేకత వెలిబుచ్చడం లేదు.ఏ నాయకుడి విషయంలో అయినా చిన్నా చితకా ఆరోపణలు, అసంతృప్తులు సహజమే. మేం ఓట్లేసి గెలిపించాం. ఆయన బాగానే పాలిస్తున్నారు. కానీ, రాజధాని విషయంలో మాత్రం మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. అని మాత్రమే వారు అంటుండడం గమనార్హం. అయితే ఈ ఆరోపణలు కూడా కొన్ని వర్గాల్లోనే ఉన్న మాట నిజం. ఈ విషయంలో అసంతృప్తి వ్యక్తం చేసేవారిలో వైసీపీ వాళ్లు కూడా ఉన్నారు. అయితే టీడీపీ వాళ్లు హైలెట్ చేస్తున్నట్టు ఇక్కడ జగన్‌పై వ్యతిరేకత లేదు కాని చిన్నా చితకా అసంతృప్తులే ఉన్నాయి.ప్రస్తుతం జగన్ ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాలు సహా ఆరోగ్య శ్రీని క్షేత్రస్థాయిలో అమలు చేసేందుకు ప్రయత్నం చేస్తోంది. ముఖ్యంగా అమ్మ ఒడి వంటి కీలక పథకాలను పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ అందించే ప్రయత్నం చేస్తోంది. అదే సమయంలో మరో పది రోజుల్లో రైతులకు రైతు భరోసా కింద రెండో విడత నిధులు విడుదల చేసేందుకు కూడా సిద్ధమవుతోంది. ఇక, అవినీతిపై జగన్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపేందుకు కూడా వెనుకాడడం లేదు. ఎక్కడా అవినీతి అనే మాటలేకుండా ముందుకు సాగుతోంది. దీంతో ప్రజల్లో నే కాకుండా వివిధ అంశాలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నవారిలోనూ జగన్‌పై ఎక్కడా వ్యతిరేకత లేక పోవడం అమరాతిలోనూ స్పష్టంగా కనిపిస్తుండడం విశేషం.