అమరావతి ఆందోళనలపై కేంద్రం ఆరా! - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

అమరావతి ఆందోళనలపై కేంద్రం ఆరా!

అమరావతి జనవరి 11  (way2newstv.com)
అమరావతిలో రాజధాని రైతుల నిరసనలు కొనసాగుతున్నాయి. రోజు రోజుకూ ఆందోళనలను ఉద్ధృతం చేస్తున్నారు స్థానికులు. అమరావతి నుంచి రాజధానిని తరలించవద్దని రోడ్డెక్కి నినదిస్తున్నారు. రాజధాని ప్రాంతంలోని గ్రామాల్లో పోలీసుల మోహరింపు జేఏసీ నేతల ర్యాలీలు ఆందోళనకారుల అరెస్ట్ లతో పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏపీ డీజీపీ గౌతం సవాంగ్కు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి ఫోన్ చేశారు. అమరావతిలో రైతులు ఆందోళనలు ఉద్రిక్త పరిస్థితులపై అడిగి తెలుసుకున్నారు. శాంతి భద్రతలు అదుపు తప్పకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. నిన్న (శుక్రవారం) రాజధాని లో ఆందోళనలు చేస్తున్న మహిళలపై పోలీసులు దాడి చేశారని రాజధాని ప్రాంత ప్రజలు పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 
అమరావతి  ఆందోళనలపై కేంద్రం ఆరా!

ఇక ఈ వ్యవహారం జాతీయ మహిళా కమీషన్ దృష్టికి కేంద్రం దృష్టికి చేరడంతో మహిళలపై పోలీసుల దాడిని సీరియస్ గా తీసుకున్న జాతీయ మహిళా కమిషన్ ఈ కేసును సుమోటోగా స్వీకరించి విచారణకు కమిటీని పంపిస్తోంది. ఇక ఇదే క్రమంలో కేంద్ర ప్రభుత్వం కూడా రాజధానిలో జరుగుతున్న ఆందోళనలపై మహిళలపై పోలీసులు వ్యవహరించిన తీరుపై దృష్టి సారించింది.అయితే ఏపీ రాజధానిగా అమరావతినే ఉండాలని రాజధాని ప్రాంత ప్రజలు ఆందోళన చేస్తుంటే ఏపీ ప్రభుత్వం మాత్రం మూడు రాజధానుల ఏర్పాటు వైపే మొగ్గు చూపుతున్నట్లుగా తాజా పరిణామాల ద్వారా స్పష్టమవుతుంది. అయితే ఇప్పటి వరకు అధికారిక ప్రకటన చేయని ఏపీ సర్కార్ మౌఖిక ఆదేశాలతో రాజధాని తరలింపు ప్రక్రియ ప్రారంభించింది. ఇక ఈ నేపథ్యం లో ఏపీలో రోజు రోజుకు ఆందోళనల తీవ్రత ఎక్కువవుతోంది. మరోవైపు రాజధాని ప్రాంతంలోని గ్రామాల్లో ఆందోళనలు అణచి వేయడానికి పోలీసులను మోహరించారు. తుళ్ళూరులో టెంట్లు వెయ్యకుండా ఆందోళనకారులను పోలీసులు అడ్డుకుంటున్నారు. మందడం వెలగపూడి తో పాటు రాజధాని గ్రామాల్లో పోలీసులు నిరసనలు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఏపీ మూడు రాజధానుల అంశం కేంద్రం దృష్టికి రాలేదని గురువారం కిషన్ రెడ్డి వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ విషయంలో కేంద్రానికి ఏపీ ప్రభుత్వం ఎలాంటి ప్రతిపాదనలు ఇవ్వలేదని ఆయన తెలిపారు. ఐనా రాజధాని వ్యవహారం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.