విజయనగరంలో బొత్స ఫ్యామిలీకే.. జెడ్పీ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

విజయనగరంలో బొత్స ఫ్యామిలీకే.. జెడ్పీ

విజయనగరం, జనవరి 7, (way2newstv.com)
అదేంటి వైసీపీలో సీనియర్ మంత్రి, ఓ విధంగా పార్టీలో, ప్రభుత్వంలో చక్రం తిప్పుతున్నారని అంతా భావిస్తున్న బొత్స సత్యనారాయణకు సొంత పార్టీలోనే షాక్ ఏంటన్నది పెద్ద డౌటే. కానీ జగన్ మాత్రం షాక్ ఇచ్చేశారు. ఎన్నికల ముందు ఫ్యామిలీ పాక్ ఇచ్చి మూడేసి టికెట్లు ఇచ్చిన జగనే ఇపుడు ఫ్యామిలీ షాక్ ఇచ్చారని అంటున్నారు. బొత్స సత్యనారాయణకు ఆయువు పట్టు మీదనే ఇది పెద్ద దెబ్బేసిందని కూడా చెబుతున్నారు. ఇంతకీ ఎందుకిలా జరిగింది, బొత్స ఫ్యామిలీకి వచ్చిన రాజకీయ ప్రమాదమేంటన్నది ఆలోచిస్తే జెడ్పీ పీఠం ఇపుడు ఆ కుటుంబానికి దూరంగా జరిగిపోయిందన్న సమాధానం వస్తుందిఈ మధ్యన ప్రకటించిన ఏపీలోని పదమూడు జిల్లా పరిషత్తుల రిజర్వేషన్లలో విజయనగరానికి ఎస్సీ మహిళగా రిజర్వ్ అయింది. దీంతో బొత్స ఫ్యామిలీ జెడ్పీ పీఠం మీద పెట్టుకున్న ఆశలన్నీ ఒక్కసారిగా నీరు కారిపోయాయి. 
విజయనగరంలో బొత్స ఫ్యామిలీకే.. జెడ్పీ

నిజానికి విజయనగరం జిల్లా రాజకీయాలకు గుండె కాయ లాంటి జెడ్పీ పీఠం విషయంలో బొత్స ఫ్యామిలీ ఏనాడో గురి పెట్టింది. దానికి అనుగుణంగా పావులు కదుపుతూ వస్తోంది. వేరెవ్వరూ ఆ వైపు కనీసం  కన్నెత్తి చూడకుండా రాజకీయ మంత్రాంగంతో బొత్స అంతా సర్దుకుని కూర్చుకున్నారు. ఇపుడు ఒక్కసారిగా రిజర్వేషన్ పిడుగు పడింది. సీటు చేజారింది.బొత్స ఝాన్సీ సత్తిబాబు సతీమణి. ఆమె వైఎస్సార్ హయాంలో విజయనగరం జెడ్పీ చైర్ పర్సన్ గా పనిచేసారు. ఆ పదవిలో ఉండగానే ఆమె బొబ్బిలి ఎంపీ సీటుకు జరిగిన ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఎంపీ అయ్యారు. ఇక ఆ తరువాత విజయనగరం ఎంపీ గా కూడా ఆమె సేవలు అందించారు. 2014 తరువాత రాజకీయంగా ఖాళీ అయిన ఝాన్సీకి 2019 ఎన్నికల్లో మళ్ళీ ఎంపీ సీటు ఇవ్వమని సత్తిబాబు ఎంత వత్తిడి తెచ్చినా జగన్ ససేమిరా అనేశారు. అప్పటికే ఫ్యామిలీ పాక్ కింద అరడజన్ సీట్లు పొందిన బొత్సకు నో చెప్పేశారు. దాంతో మళ్ళీ జెడ్పీ పీఠం మీద తన భార్యను కూర్చోబెట్టాలని బొత్స వ్యూహ రచన చేసారు. ఇపుడు అది ఎస్సీ మహిళకు రిజర్వ్ కావడంతో బొత్సకు గట్టి షాక్ తగిలిందని అంటున్నారు.ఇక ఇదే సమయంలో బొత్స మేనల్లుడు మజ్జి శ్రీనివాస‌రావు ఉరఫ్ చిన్న శ్రీను కూడా జెడ్పీ పీఠం మీద ఆశలు పెంచుకున్నారు. తమ మామ ఆశీస్సులతో చైర్మన్ అయి చక్రం తిప్పుదామనుకున్నారు. నిజానికి చిన్న శ్రీను కూడా రాజకీయ బాధితుడే. ఆయన కూడా ఎమ్మెల్యే టికెట్ కోసం 2019లో ప్రయత్నం చేసినా జగన్ ఇవ్వలేదు బొత్స ఫ్యామిలీ కోటా అప్పటికే  పూర్తి అయిపోవడతో చిన్న శ్రీనుకు కూడా  చెక్ పెట్టాల్సివచ్చింది. నాటి నుంచి జెడ్పీ పీఠమైనా దక్కకపోతుందా అని చిన్న శ్రీను ఆశపడ్డారు. ఇపుడు రిజర్వేషన్ పుణ్యమాని అది కూడా పోయింది.నిజానికి ఎస్సీ మహిళకు ఇక్కడ రిజర్వ్ చేసినా బొత్స కనుసన్నల్లోనే అంతా జరుగుతుందని అంటున్నారు. బొత్స ఎంపిక చేసిన వారే జెడ్పీ చైర్ పర్సన్ అవుతారని, వైస్ చైర్మన్  పదవి ఎటూ తన కుటుంబానికి దక్కించుకుని జెడ్పీ పైన బొత్స పరోక్ష పెత్తనం చేస్తారని ప్రత్యర్ధులు విమర్శిస్తున్నారు. జరిగేది కూడా అదేనని సొంత పార్టీలోనూ వినిపిస్తోంది. బొత్స చేతిలో నుంచి జిల్లా రాజకీయాలను పక్కకు జరపడం కూడా  కష్టమేనని కూడా అంటున్నారు. మొత్తానికి తమ వాళ్ళు పీఠం ఎక్కలేదన్న చింత తప్ప జెడ్పీ పీఠం బొత్స ఇంటి గుమ్మం దాటి ఎటూ పోలేదని కూడా వైసీపీలో టాక్ నడుస్తోంది, చూడాలి మరి.