కమ్మ సామాజిక వర్గాన్ని ఆకట్టుకొనే పనిలో జగన్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

కమ్మ సామాజిక వర్గాన్ని ఆకట్టుకొనే పనిలో జగన్

విజయవాడ, జనవరి 24, (way2newstv.com)
ఎంత కాదనుకున్నా ఏపీ రాజకీయాల్లో కులాలు కీలకమైన పాత్రని పోషిస్తున్నాయి. ఇక బీసీలు, ఎస్సీలు, బడుగులు, కాపులు వంటి ఇతర కులాలు ఎన్ని ఉన్నా కూడా రాజకీయాలను శాసించేవి రెండే కులాలుగా ఉన్నాయి. అవి కమ్మ, రెడ్లు. వారికి సొంత పార్టీలు కూడా ఉన్నాయని రాజకీయం తెలిసిన వారికి అర్ధమయ్యే విషయమే. టీడీపీ అధికారంలోకి వస్తే కమ్మలకు, వైసీపీ వస్తే రెడ్లకు ఆటోమెటిక్ గా ప్రాధాన్యత పెరుగుతుంది. అయితే ఇపుడు జగన్ కొత్త వ్యూహాన్ని అనుసరిస్తున్నారు. కమ్మలకు తాము వ్యతిరేకం కాదని ఆయన గట్టిగా చాటాలనుకుంటున్నారు. ఎటూ నాయకత్వ లేమితో సతమతమవుతున్న టీడీపీని అంటిపెట్టుకుని ఉండే కమ్మ సామాజిక వర్గాన్ని ఆయన తన వైపు తిప్పుకునేందుకు ఎత్తులు వేస్తున్నారు.
కమ్మ సామాజిక వర్గాన్ని ఆకట్టుకొనే పనిలో జగన్

కమ్మవారికి తాను వ్యతిరేకం కాదని నిండు అసెంబ్లీలో జగన్ ప్రకటించారు. మూడు రాజధానుల తీర్మానంపై ప్రకటన చేసిన సందర్భంగా ఆయన మాట్లాడిన మాటలను చూస్తే కమ్మ సామాజికవర్గం సైతం షాక్ తినేలాగా ఉంది. తనకు కులం, మతం, ప్రాంతం లేవని జగన్ చెప్పుకున్నారు. విజయవాడ తనకు ఎంతో అనుబంధం ఉన్న ప్రాంతమని అన్నారు. అమరావతి కట్టాలని తనకూ ఉందని, కేవలం నిధుల లేమి వల్లనే విశాఖలో, కర్నూలు రాజధానులను ప్రకటిస్తున్నానని జగన్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇక కమ్మ సామాజికవర్గంలో అభద్రతాభావం పెంచేందుకు టీడీపీ చేస్తున్న ప్రయత్నాలు తప్పు అని కూడా జగన్ స్పష్టం చేసారు.ఇక కమ్మ సామాజికవ‌ర్గానికి బాసటగా జగన్ కీలకమైన నిర్ణయాలే తీసుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అగ్ర కులాల్లో పేదల కోసం బ్రాహ్మణ, వైశ్య కార్పోరేషన్లు ఏర్పాటు చేసిన తరహాలోనే కమ్మలకు ఒక కార్పోరేషన్ ప్రకటించాలని జగన్ భావిస్తున్నారుట. రాజకీయంగా చైతన్యవంతులైన కమ్మలు ఇంతకాలం టీడీపీనే తమ పార్టీ అనుకుని వచ్చారు. అయితే అక్కడ పరిస్థితులు తారు మారు కావడంతో వారు అండ కోసం చూస్తున్నారు. వారిని తమ వైపునకు తిప్పుకోవాలని బీజేపీ వ్యూహ రచన చేస్తోంది. అయితే ఏపీలో ఆ పార్టీకి అంత సీన్ లేదన్నది తెలిసిందే. దాంతో కమ్మలను బాబు నుంచి విడదీసి తమ వైపునకు తిప్పుకుంటే ఏపీలో ఎదురులేని పరిస్థితి ఉంటుందని జగన్ మాస్టర్ ప్లాన్ వేశారని అంటున్నారు.ఇక్కడితో ఆగకుండా రానున్న రోజుల్లో మంత్రి పదవులతో పాటు, రాజకీయంగా కూడా వారికి పెద్ద పీట వేయాలని జగన్ ఆలోచిస్తున్నారని అంటున్నారు. ఇప్పటికే వైసీపీలో యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్, లక్ష్మీ పార్వతి వంటి వారికి కీలకమైన నామినేటెడ్ పదవులు దక్కాయి. ఇక కరడు కట్టిన టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వంటి వారు వైసీపీ వైపు వచ్చారు. మరింతమందిని తిప్పుకోవడమే కాకుండా కృష్ణా, గుంటూర్లో కమ్మలను పూర్తిగా వైసీపీ నీడకు చేర్చడం ద్వారా వచ్చే ఎన్నీకల్లోనూ స్వీప్ చేయాలన్నది జగన్ ఎత్తుగడగా కనిపిస్తోంది. గతంలో వైఎస్సార్ టైంలో కూడా కమ్మలకు మంచి ఆదరణ కాంగ్రెస్ లో ఉండేది, ఇదే ఫార్ములాతో జగన్ ముందుకు సాగాలనుకుంటున్నారు. అదే కనుక జరిగితే టీడీపీలో కమ్మ సామాజికవర్గం నేతలు జారిపోయి రాజకీయంగా బాబు, ఆయన కుటుంబం మాత్రమే మిగులుతారని వైసీపీ నేతలు అంటున్నారు. కమ్మ సామాజికవర్గం మీద పేటెంట్ హక్కులు కేవలం టీడీపీకే ఉన్నాయనుకోవడం బాబు భ్రమ మాత్రమేనని వైసీపీ ఎమ్మెల్యే అబ్బయ్యచౌదరి అనడం ఈ సందర్భంగా గమనార్హం.