ఎత్తిపోతల పథకాలపై విధివిధానాలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఎత్తిపోతల పథకాలపై విధివిధానాలు

హైద్రాబాద్,జనవరి 1, (way2newstv.com)
తెలంగాణ రాష్ట్రం అవతరించిన తర్వాత పెద్ద ఎత్తున చేపట్టిన ఎత్తిపోతల పథకాల పంపులను శాశ్వత ప్రాతిపదికన మెయింటనెన్స్ నిర్వహించేందుకు విధి విధానాలను త్వరలో రాష్ట్రప్రభుత్వం ఖరారు చేయనుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 80 వరకు ఎత్తిపోతల ప్రాజెక్టులపై పంపులు ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టుపై అద్భుతమైన రీతిలో ఎత్తిపోతల పంపులను అమర్చారు. వీటి ద్వారా పెద్ద పరిమాణంలో నీటిని ఎత్తిపోస్తున్నారు. వీటి నిర్వహణలో సాంకేతిక పరంగా ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు సాంకేతిక విధానాలపై ప్రోటోకాల్‌ను ఖరారు చేస్తారు. త్వరలో సాగునీటి ఇంజనీర్ల నిపుణులతో ఒక వర్క్‌షాపును ప్రభుత్వం నిర్వహించనుందని సాగునీటి ఇంజనీర్లు చెప్పారు. రాష్ట్రంలో 1.15 కోట్ల ఎకరాలకు సాగునీటిని అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో 75 లక్షల ఎకరాలకు సాగునీటిని ఎత్తిపోతల పథకాల ద్వారానే అందించేందుకు వీలుంది. 
ఎత్తిపోతల పథకాలపై విధివిధానాలు

పంపుల నిర్వహణను చక్కగా నిర్వహించేందుకు ప్రోటోకాల్ అవసరమనే అభిప్రాయంతో ప్రభుత్వం ఉంది. ఈ విషయమై స్పష్టమైన అవగాహన ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ సాగునీటి రంగంపై సమీక్ష జరిగినప్పుడల్లా, ఎత్తిపోతల పథకాల నిర్వహణ గురించి అధికారులను ప్రశ్నించేవారని అధికార వర్గాలు తెలిపాయి. కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభించి ఆరు నెలలైంది. పంపులు అద్భుతంగా పనిచేస్తున్నాయి. ఎస్‌ఆర్‌ఎస్‌పీ రెండవ దశ ఆయకట్టు కింద ఉన్న 600 చెరువులను కూడా అధికారులు నింపారు. గత 15 ఏళ్లలో మిడ్ మానేరు నుంచి చెరువులకు పూర్తి స్థాయిలో నీటిని సరఫరా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో లింక్ ఒన్‌లో మేడిగడ్డ నుంచి శ్రీపాద యల్లంపల్లి వరకు, లింక్ 2లో యల్లంపల్లి నుంచి మిడ్‌మానేరు వరకు 30 పంపులు పనిచేస్తున్నాయి. ఈ పంపులు 30 టీఎంసీ నీటిని తోడుతున్నాయి. ప్యాకేజీల వారీగా పని అనుకున్న సమయంలో పూర్తయితే పంపులు 50 వరకు చేరుకుంటాయి. ఈ ఏడాది జూన్ 21వ తేదీన కాళేశ్వరం ప్రాజెక్టును జాతికి అంకితం ఇచ్చిన తర్వాత ఉత్తర తెలంగాణ ప్రాంతంలో భూగర్భ జల మట్టం పెరిగింది. ఇది రైతులకు శుభవార్త అని ఇంజనీర్లు చెప్పారు. మిషన్ కాకతీయ కింద కూడా చెరువుల మరమ్మత్తు పనులను వేగవంతం చేశారు. సాగునీటిని ఇవ్వడమే కాకుండా భూగర్భ జల మట్టం పెరగడం వల్ల వేసవి కాలంలో నీటి ఎద్దడి తలెత్తదని సాగునీటి ఇంజనీర్లు పేర్కొన్నారు.