విజయవాడ, జనవరి 24, (way2newstv.com)
ఖర్చులు పెరిగిపోయాయి. కార్యకర్తలు రోడ్డు ఎక్కాలంటే బండికి పెట్రోల్, బ్రాందీ బాటిల్, బిర్యానీ తో పాటు జేబులో ఎంతోకొంత కొట్టాలి. ఇన్ని ఇచ్చినా నాయకులు చెప్పింది చేయడానికి కొద్ది గంటలే కేటాయిస్తారు. ఇది నేడు ఏ పార్టీ అయినా ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య. అధికార పక్షం వారికైతే ఎంతోకొంత వెసులుబాటు ఉంటుంది. స్థానిక ఎమ్యెల్యే, ఎంపి లతో ఏదో ఒక పని మీద వెళతాం కనుక వారు కొన్ని సౌకర్యాలు కల్పిస్తే చెప్పింది చేయడానికి ముందుకు వచ్చే పరిస్థితి వుంది. అదే విపక్షంలో ఉన్నవారు ఇచ్చే ఉద్యమాలకు పోరాటాలకు బయల్దేరాలంటే మాత్రం ఖచ్చితంగా పై సౌకర్యాలన్నీ కార్యకర్తలకు నేతలు ఏర్పాటు చేయక తప్పని సంప్రదాయం తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో నిత్యం కనిపించేదే.
మూడు నెలల టెన్షన్
శాసనమండలిలో బిల్లు ను సెలెక్ట్ కమిటీకి పంపి తాత్కాలిక కాలయాపనను ప్రధాన విపక్షం చేయగలదేమో కానీ శాశ్వతంగా దీన్ని నిరోధించలేదు. మరో మూడు నెలల సమయం మూడు రాజధానుల నిర్ణయానికి బ్రేక్ వేయగలిగినా తమ్ముళ్లలో మాత్రం ఇప్పుడు దడ మొదలైంది. ముఖ్యంగా అమరావతి మినహా రాష్ట్రంలోని ఇతర అన్ని జిల్లా లలో మూడు రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేయాలని పార్టీ ఇంఛార్జ్ లకు టిడిపి ఆదేశాలు జారీ అయ్యాయి. అయితే దీనికి ఆ పిలుపు అందుకుని కార్యకర్తలను వేసుకుని రోడ్డెక్కి ఉద్యమించాలంటే ఆస్తులు అమ్ముకుని రాజకీయాల్లో కొనసాగాలనే పరిస్థితి ఉందని తమ్ముళ్ళు వాపోతున్నారు.అమరావతి ప్రాంతం లో అయితే చంద్రబాబు చందాల రూపంలో పోగేసిన కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతారని తమకెవరిస్తారన్నది బహిరంగంగా చెప్పుకోలేక మధనపడుతున్నారు సైకిల్ టీం. మరి చంద్రబాబు జిల్లాల వారీగా అమరావతి ఉద్యమానికి నిధులు కేటాయిస్తే మాత్రం ఈ మూడు నెలలు అధికారపక్షానికి నిద్ర లేకుండా చేస్తామని లేకపోతే ప్రెస్ మీట్లతో సరిపెట్టేస్తామని కొందరు ఆఫ్ ది రికార్డ్ లో చేస్తున్న వ్యాఖ్యలు గమనిస్తే పాలిటిక్స్ అంటే అంత ఈజీ కాదనేది స్పష్టం చేస్తున్నాయి.