న్యూఢిల్లీ, జనవరి 21, (way2newstv.com)
వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై త్వరలోనే జనసేన పార్టీతో కలిసి పోరాటాలకు దిగుతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వ మూడు రాజధానుల నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. వైసీపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలో ఎంపీ జీవీఎల్ నరసింహారావుతో కలిసి కన్నా మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం చేస్తున్న ప్రతి పిచ్చి పనికి కేంద్రం సహకారం ఉందని చేస్తున్న ప్రచారాన్ని ఖండిస్తున్నట్లు చెప్పారు. ఎన్నికలకు ముందు మూడు రాజధానులు చేస్తామని వైసీపీ చెప్పలేదని, దీనిపై ఆ పార్టీ చేస్తున్న ప్రచారాన్ని ప్రజలెవరూ నమ్మట్లేదని పేర్కొన్నారు.
వైసీపీ అనవసర రాద్ధాంతం : కన్నా
వైసీపీ ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై ప్రజల తరఫున జనసేనతో కలిసి పోరాటం చేస్తామని చెప్పారు.ఎంపీ జీవీఎల్ నర్సింహారావు మాట్లాడుతూ.. మూడు రాజధానులు అనేది ఓ మిథ్య మాత్రమేనని తెలిపారు. ప్రాంతీయ పార్టీలైన వైసీపీ, టీడీపీలు తమ స్వార్థప్రయోజనాలకే ఎక్కువ ప్రాధన్యమిస్తున్నాయని చెప్పారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం పెద్దన్న పాత్ర పోషించాలని టీడీపీ అంటోందని, అయితే ఇదేమీ కుటుంబ వ్యవహారం కాదన్నారు. రాజధాని అంశం పూర్తిగా రాష్ట్ర పరిధిలోని అంశమన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రమేయం ఇందులో ఉండదన్నారు. అయినా కేంద్రం పెద్దన్న పాత్ర పోషిస్తే .. తెలుగుదేశం పార్టీ దద్దమ్మ పాత్ర పోషిస్తుందా? అని ఎద్దేవా చేశారు.రాజధానిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందని వైసీపీ ఆధారాలతో చెబుతోందని, అయితే చర్యలెందుకు తీసుకోవట్లేదో చెప్పాలన్నారు. జనసేనతో చర్చించి త్వరలో అమరావతిపై ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని జీవీఎల్ వెల్లడించారు.