విజయవాడ, జనవరి 24, (way2newstv.com)
శాసనమండలిలో జరిగిన పరిణామాలను ముఖ్యమంత్రి జగన్ సీిరియస్ గా తీసుకున్నారు. శాసనమండలిని రద్దు చేయాలన్న నిర్ణయానికి జగన్ దాదాపుగా వచ్చినట్లే తెలుస్తోంది. శాసనమండలిలో బలం ఉన్న తెలుగుదేశం పార్టీ తాము చేపట్టబోయే ప్రతి పనికీ అడ్డుతగులుతున్నందున ఇక దానిని కొనసాగించడం వీలు లేదని జగన్ గట్టిగా భావిస్తున్నారు. ఈ మేరకు ఆయన న్యాయనిపుణులు, సీనియర్ నేతలు చర్చలు జరిపారు. ఇటు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నా జగన్ మాత్రం మండలిపైనే ప్రత్యేక దృష్టి పెట్టి అందరి సలహాలు తీసుకున్నారు.వైఎస్ జగన్ కు ఇంకా దాదాపు నాలుగున్నరేళ్ల అధికారం ఉంది. మరో రెండున్నరేళ్ల పాటు మండలిలో స్థానాలు ఖాళీ అయ్యే అవకాశాలు లేవు. ఈ పరిస్థితుల్లో ఇటీవల జరిగిన ఎన్నికలలో ఘోర ఓటమి పాలయిన తెలుగుదేశం పార్టీ శాసనమండలిలో పైచేయి సాధించడాన్ని జగన్ తట్టుకోలేకపోతున్నారు.
మండలికి ఇక రద్దే...
వైసీపీకి శాసనసభలో తొమ్మిది మంది మాత్రమే సభ్యులున్నారు. వారిలో ఇద్దరు మంత్రులుగా కూడా ఉన్నారు. అయినా జగన్ మండలిని రద్దు చేయడానికే మొగ్గు చూపుతున్నారు.చంద్రబాబు ఓడిపోయినా రాజకీయ దురుద్దేశ్యంతో తనను ఇకపైనా అడుగడుగునా అడ్డుకుంటారని జగన్ భావిస్తున్నారు. అందుకే శాసనమండలిని ఒక్కసారిగా రద్దు చేయడం సరికాదని భావించిన జగన్ గురువారం శాసనసభలో దీనిపై చర్చ పెట్టారు. సోమవారం కూడా ఇదే అంశంపై చర్చ జరపాలని నిర్ణయించారు. అంటే జగన్ అందరి సలహాలు, సూచనలతోనే శాసనమండలిని రద్దు చేయడానికి సిద్ధమయనట్లే కన్పిస్తుంది. అసెంబ్లీలో జగన్ పరోక్షంగా మండలి రద్దు అనే సంకేతాలు ఇచ్చారు. ఏడాదికి అరవై కోట్లు శాసనమండలికి ఖర్చు అవుతుందని ఆయన చెప్పడాన్ని బట్టి ప్రజలకు కూడా రద్దు చేస్తే తప్పులేదన్న సంకేతాలను పంపడానికేనని చెప్పారు. ఇక ఇంగ్లీష్ మీడియం, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ ఏర్పాటు బిల్లులను కూడా శాసనమండలి తిరస్కరించిందని జగన్ చెప్పడాన్ని బట్టి మండలిని రద్దు చేయడం కరెక్టేనని ప్రజలచేతే చెప్పించాలని భావిస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. శాసనమండలిలో నిన్న జరిగిన పరిణామాలు తనను కలచి వేశాయని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. ప్రజల చేత ప్రజల కోసం ఎన్నుకోబడిన ప్రభుత్వం ఆమోదించిన చట్టాన్ని బలంతో శాసనమండలిలో అణిచివేశారన్నారు. నిబంధనలను తుంగలో తొక్కి మరీ బిల్లులను సెలెక్ట్ కమిటీ పంపారని జగన్ అన్నారు. చట్టాలను ఉల్లంఘిస్తే ప్రజాస్వామ్యం ఖూనీ అవుతుందని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఏడు నెలలుగా తమ ప్రభుత్వం ప్రజల కోసమే పనిచేస్తుందన్నారు. అనేక విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చామన్నారు. అయినా శాసనమండలిని వాడుకుంటూ ప్రభుత్వాన్ని పనిచేయకుండా అడ్డుకుంటున్నారన్నారు శాసనమండలిలో చంద్రబాబు ఏ రకంగా వ్యవహరించారో అందరికీ తెలుసునన్నారు. మండలి చట్ట బద్దంగా వ్యవహరిస్తుందని తాను నమ్మానన్నారు. ఏదైనా శాసనసభలో ఆమోదించిన బిల్లులను ఆమోదించడమో, తిరస్కరించడమో చేయాలి కాని, సెలెక్ట్ కమిటీకి పంపడం వెనక దురుద్దేశం దాగుందని జగన్ అన్నారు. తమను 151 స్థానాల్లో ప్రజలు గెలిపించారని తెలిపారు. తాము పాలకులుగా కాకుండా సేవకులగానే వ్యవహరిస్తున్నామని చెప్పారు. సూచనలు, సలహాలు ఇవ్వాల్సిన మండలి ప్రజోపయోగమైన బిల్లులను అడ్డుకోవడం సరికాదన్నారు. శాసనసభలో నిన్న మండలిలో ఛైర్మన్ షరీఫ్ చేసిన 11 నిమిషాల ప్రసంగపు వీడియోను ప్రదర్శించారు. ఛైర్మన్ విచక్షణాధికారాన్ని చట్టాన్ని ఉల్లంఘించేందుకు వాడానని తానే అంగీకరించానని ఒప్పుకున్నారన్నారు. చట్టాన్ని బలోపేతం చేసేందుకే విచక్షణాధికారిని వినియోగించుకోవాలన్నారు. తనకు సంబంధంలేని సభలోని గ్యాలరీలో కూర్చుని చంద్రబాబు ఆదేశాలిచ్చారన్నారు. ఓడిన నాయకుడి ప్రయోజనాలు, ఇష్టాలను బట్టి శాసనమండలి నడుస్తుందన్నారు. లేని అధికారాన్ని ఉపయోగించి సెలెక్ట్ కమిటీకి పంపారన్నారు. తప్పులను ఉద్దేశ్యపూర్వకంగా చేస్తున్న ఈ మండలిని చూస్తుంటే ప్రజాస్వామ్యం బతికి బట్టకట్టలేదనిపిస్తోంది. ఆ తప్పులు చేయకుండా ఆపాలా? వద్దా? చెప్పాలన్నారు.కేవలం అసెంబ్లీలో చర్చ ఇక నామమాత్రమే. శాసనమండలి దాదాపు ఇక రద్దయిపోతున్నట్లే..