విజయవాడ, జనవరి 29 (way2newstv.com)
అత్యంత సంచలనం సృష్టిస్తూ.. తన తండ్రి, మాజీ సీఎం, దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి అనేక కష్టాలకు ఓర్చి తెచ్చిన శాసన మండలిని.. ప్రజా ప్రయోజన కోణంలో రద్దు చేస్తూ జగన్ ప్రభుత్వం తీసుకువచ్చిన తీర్మానం వరకు కథ బాగానే నడిచింది. ఇక, ఇప్పుడు ఈ విషయం కేంద్రంలోకి చేరిపోయింది. అసెంబ్లీ 133 ఓట్ల మెజారిటీతో ఆమోదించిన ఈ తీర్మానాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపింది. మరి ఇప్పటితో మండలి రద్దయినట్టు కాదు. దాని కార్యకలాపాలు ఇకపైనా కొనసాగుతాయి. అంటే కేంద్రం ఈ తీర్మానాన్ని ఆమోదించి, పార్లమెంటులో బిల్లు పెట్టి ఆమోదించి రాష్ట్రపతికి చేరి, ఆయన సంతకం చేసేవరకు కూడా కథ నడుస్తుంది.
కేంద్ర సహకారంపైనే మండలి భవితవ్యం
ఇప్పటి వరకు ఉన్న అంచనాల ప్రకారం ఎంత లేదన్నా మరో మూడు మాసాల వరకు ఈ క్రతువు సాగేందుకు అవకాశం ఉంది. ఈ క్రతువు ముగిసేందుకు మూడు మాసాలు లేదా ఆరు మాసాలు సంవత్సరం దాటినా ఆశ్చర్యపోనక్కర్లేదు. దీంతో అప్పటి వరకు కూడా ఏపీ శాసన మండలి లైవ్‌లోనే ఉంటుంది. మరి ఇప్పు డు జగన్ ఏం చేయనున్నారు? ప్రభుత్వం ఇంకా అనేక కీలక విషయాలలో బిల్లులు తీసుకురావాల్సిన మాట వాస్తవం. మరి ఆయా బిల్లులను కూడా మండలి తిరస్కరించే అవకాశం ఎక్కువగానే కనిపిస్తోంది.ఈ నేపథ్యంలో తాను చేపట్టిన కార్యక్రమాలను జగన్ వాయిదా వేసుకుంటారా? లేక, ఆర్డినెన్స్ రూపంలో తెచ్చుకుంటారా? అనే చర్చ జోరుగా సాగుతోంది. త్వరలోనే 2020-21 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే పార్లమెంటులోనూ బడ్జెట్ సెషన్ జరుగుతుంది. సో అప్పుడే పార్లమెంటులో బిల్లు పెట్టేలా జగన్ వ్యూహ రచన చేస్తున్నారని అంటున్నారు పరిశీలకులు. ఇప్పటి వరకు కేంద్రం ఏపీలోని జగన్ ప్రభుత్వానికి సహకరిస్తున్నదీ లేనిదీ పెద్దగా ఎవరికీ తెలియదు. జగన్ ఢిల్లీ వెళ్లి ప్రధాని మోడీని, అమిత్ షాను కలిసి రావడం వరకే పరిమితం అవుతోందికానీ, ఇప్పుడు జగన్‌కు అత్యంత ప్రధానమైన ఈ తీర్మానంపై కేంద్రం సహకారం ఎలా ఉండనుందనేది ఆసక్తిగా మారింది. ఈ విషయంలో కేంద్రాన్ని ఒప్పించేందుకు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తక్షణమే ఢిల్లీ వెళ్లారని సమాచారం. ఆయన రేపో, ఎల్లుండో అమిత్ షాను కలిసి పరిస్థితి విన్నవించి వచ్చే బడ్జెట్ సెషన్‌లోనే ఈ బిల్లుకు మోక్షం కలిగించే పరిస్థితి ఉందని, ఈ వ్యూహాన్ని పకడ్బందీగా అమలు చేయించాలని జగన్ భావిస్తున్నారని సమాచారం. మరి ఏం జరుగుతుందో చూడాలి.