న్యూఢిల్లీ, జనవరి 25 (way2newstv.com)
కువైట్‌లో చిక్కుకుపోయిన 200 మంది ఆంధ్రప్రదేశ్ యువతులను రక్షించాలంటూ వైసీపీ రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. బాధితులను ఆ చెర నుంచి రక్షించేందుకు దౌత్య సాయం అందించాలని కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్.జయశంకర్‌కు విజ్ఞప్తి చేశారు. అక్రమ రవాణాకు గురైన దాదాపు 200 మంది యువతులు కువైట్‌లోని ఇండియన్ ఎంబసీ వద్ద చిక్కుకుపోయారని, వారికి కాపాడాలని కోరారు. వారిని తిరిగి దేశానికి రప్పించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకు సంబంధించి బాధిత యువతుల వీడియోను తన ట్వీట్‌కు జోడించారు.
ఆ అమ్మాయిలను కాపాడండి
వీడియో బాధిత యువతులు చెప్పిన దాని ప్రకారం.. పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి మండలానికి చెందిన లక్ష్మణరావు అనే వ్యక్తి అక్కడి యువతులకు మాయమాటలు చెప్పి కువైట్ పంపిస్తున్నాడు. అక్కడ యువతులను రిసీవ్ చేసుకున్న సారా అనే మహిళ వారిని ఇతరులకు అమ్మేస్తోంది. అలాగే అక్కడ వారిని చిత్రహింసలకు గురిచేస్తున్నారు. దీంతో వారు ఎలాగోలా ఇండియన్ ఎంబసీకి చేరుకుని వేరే మహిళ దగ్గర నుంచి వీడియో రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్లు తెలుస్తోంది.తమను ఎలాగైనా రక్షించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి విజ్ఞప్తి చేస్తున్నారు. తమకు ఆరోగ్యం కూడా సరిగా లేదని, ఎలాగైనా ఆదుకోవాలని వేడుకుంటున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. దీంతో ఈ వీడియోను వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ట్వీట్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం సాయం చేయాలని కోరారు.