న్యూఢిల్లీ, జనవరి 28 (way2newstv.com)
అమిత్ షా దేశంలోనే అత్యంత శక్తివంతమైన నాయకుడు. ఈ మాటలు అన్నది ఎవరో కాదు, ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి తొలిసారి ఢిల్లీ వెళ్ళి మీడియాతో జగన్ పంచుకున్న ముచ్చట్లు. అమిత్ షాకు కనబడకుండా వినిపించే శక్తి ఉంది. కనీ వినీ ఎరుగని ఎత్తులు వేసే చతురతా ఉంది. ఆయన తెర ముందుకు వచ్చినా తెర వెనక ఉన్నా కూడా అమిత శక్తిసంపన్నుడే. ఆయన్ని కరెక్ట్ హోం మినిస్టర్ అంటూ ఈ మధ్యనే జనసేనాని పవన్ కూడా పొగిడారు. ఇక దేశంలో ఒక్క వామపక్షాలు తప్ప అమిత్ షాని కీర్తించని వారెవరు. అంతటి బలసంపన్నుడు అమిత్ షా తో ఎటువంటి సంప్రదింపులూ చేయకుండానే జగన్ దూకుడుగా శాసనమండలిని రద్దు చేస్తారా అన్నది ఒక చర్చ.ఈ సంగతి కనుగొన్నది మాత్రం సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. జగన్ మండలికి మంగళం పాడడం వెనక అమిత్ షా ఉన్నారని నారాయణ కొత్త సీక్రెట్ చెబుతున్నారు.
మండలి రద్దు సీక్రెట్ ఏంటీ
అమిత్ షాతోనే కాదు, బీజేపీ పెద్దల అనుమతితోనే జగన్ రాజకీయ దూకుడు చేస్తున్నాడని ఈ కమ్యూనిస్ట్ నాయకుడు కన్నెర్ర చేస్తున్నాడు. కౌన్సిల్ ని రద్దు చేయాలనుకోవడం వెనక ఎన్నో స్వార్ధ రాజకీయాలు, అర్ధాలు, పరమార్ధాలు ఉన్నాయని అంటున్న నారాయణ అందుకే రద్దు తమ పాలసీ అయినప్పటికీ జగన్ చేసిన ఈ రద్దుకు మద్దతు ఇవ్వలేమని తేల్చేశారు.నారాయణ మద్దతు సంగతి పక్కన పెడితే నిజంగానే అమిత్ షా చెవిన వేసే జగన్ ఈ మండలి కధను ముగించారా అన్న సందేహాలు వైసీపీలోనే కాదు, టీడీపీలోనూ ఉన్నాయి. దీని వల్ల బీజేపీకి ఏమిటి ప్రయోజనం అన్న ప్రశ్న కూడా వెంటనే వస్తుంది. అయితే ఇది రాజకీయ ప్రయోజనంతొ పాటుగా కేంద్ర సర్కార్ ఆలోచనా విధానంగా చూడాలని అంటున్నారు. నాలుగేళ్ళ క్రితమే మండలి వద్దు అనుకున్న వారు ముందుకు వస్తే మంగళం పాడించేందుకు మేము రెడీ అంటూ కేంద్ర పెద్దలు అన్ని రాష్ట్రాలకు సమాచారం ఇచ్చారు. అయితే రాజకీయ ప్రయోజనాలతో నాడు బాబు వద్దన్నారు. ఇపుడు జగన్ సరేనన్నారు. దాంతో బీజేపీ ఈ తీర్మానాన్ని వెంటనే ఆమోదించి అమల్లో పెడుతుందని కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి.ఏపీలో టీడీపీ కూసాలు మొత్తం కదిలిపోవాలి. ఇది వైసీపీ కోరిక మాత్రమే కాదు, బీజేపీ లక్ష్యం కూడా. పైగా బాబు వారసుడు లోకేష్ కధ కూడా కంచికి చేరాలి. ఎమ్మెల్యేల బలం పోయినా అంతకు మించి ఎమ్మెల్సీలతో బాబు ఏపీలో రాజకీయ వీరంగం వేస్తున్నారు. అందుకే ఆయన్ని అడ్డుకోవడానికి జగన్ మండలి రద్దు అంటే ఆయన వెనకాల బీజేపీ ఆశీర్వాదం ఉందని కూడా గట్టిగా ప్రచారం సాగుతోంది. బాబు, ఆయన రాజకీయ వారసుడు ఎదగకుండా ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా మండలి రద్దుతో క్లైమాక్స్ కి కధ సాగిందంటే బీజేపీ బలం కూడా ఇక్కడ ఉందని అంటున్నారు. బీజేపీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ మాటలను ఒకసారి పరికిస్తే మండలి రద్దు విషయంలో కేంద్రం జోక్యం ఉండదని చెప్పుకొచ్చారు. అంటే మండలి రద్దుకు బీజేపీ సుముఖమేనని తెలుస్తోంది. మొత్తానికి ఎంత తొందరగా రద్దు అమల్లోకి వస్తే అంత తొందరగా బీజేపీ, వైసీపీ తెర వెనక బంధం కూడా జనాలకు తెలుస్తుంది మరి.