మనసులోని మాటను బయటపెట్టిన మంత్రి ఈటెల
కరీంనగర్ జనవరి 10, (way2newstv.com
అసెంబ్లీ ఎన్నికల్లో తాము నమ్ముకున్న వారే చివరి నిమిషంలో వెన్నుపోటు పొడిచారనీ, అయినా సరే ప్రజల అధర్మం వైపు వెళ్లలేదనీ, తమను గెలిపించారని మంత్రులు తరచూ చెబుతున్నారు. వెన్ను పోట్ల పై తీవ్ర అసంతృప్తిగా ఉన్న మంత్రి ఈటెల రాజేందర్, తనని వెన్నుపోటు పొడిచినవారి పై ఇప్పుడు రివేంజ్ తీర్చుకుంటున్నారట! మున్సిపల్ ఎన్నికలు వచ్చాయి కదా… ఇప్పుడు నా సత్తా చూడండి అన్నట్టుగా వ్యవహరిస్తున్నారట!ఇదే మాటను తన నియోజక వర్గం హుజూరాబాద్ లో కార్యకర్తలూ నాయకులతో జరిగిన సమావేశంలో ఓపెన్ గా చెప్పేశారు. ఇంత ఓపెన్ గా మిమ్మల్నే నమ్మి, మీ కోసమే అన్నీ చేసి, ఇంత చేసినా కూడా తిన్నింటి వాసాలు లెక్కపెట్టే తీరులో ఉన్నారనుకొండి, అప్పుడు మనసుకు బాగా గాయమైతది అన్నారు. ధర్మంగా ఉండటం, న్యాయంగా ఉండటం, సత్తా కలిగి ఉండటం ఇలాంటివి బయటకి కనిపించకపోవచ్చన్నారు.
ఇప్పుడు నా సత్తా చూడండి..
చివరికి వాటికే విజయం దక్కుతుందన్నారు.మసిపూసి మారేడు చేసే పద్ధతిలో ఉన్నవారు తాత్కాలికంగా విజయం సాధిస్తారు తప్ప, అది శాశ్వతం కాదని కొంతమంది గుర్తుంచుకోవాలన్నారు. ఇకపై ఎవ్వర్నీ గుడ్డిగా నమ్మలేనని మంత్రి ఈటెల అన్నారు. పదవుల కోసం తన చుట్టూ తిరగడం, వచ్చాక తనకే తలనొప్పిగా కొంతమంది తయారయ్యారని ఆయన తన వర్గంతో అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. ఏడాది కాలంగా దాచుకుంటూ వస్తున్న అసంతృప్తిని మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బయటపెట్టేస్తున్నారు ఈటెల. సీట్లు కావాలంటూ తన దగ్గరకి వస్తున్నవారిలో కొందరికి నిర్మొహమాటంగా ఇవ్వను అని చెప్పేస్తున్నారట.ఈయన తో పాటు కరీంనగర్ జిల్లాకు చెందిన మరో ఇద్దరు నాయకులు ఇదే తరహాలో తమకి వెన్నుపోటు పొడిచారనుకునే నాయకులకు చెక్ పెట్టేస్తున్నారని సమాచారం. తనకు వెన్నుపోటు పొడిచినా భరించాననీ, కానీ పార్టీకి వెన్నుపోటు పొడిచేవారిని క్షమించలేనంటూ కార్యకర్తల సమావేశంలో గంగుల కమలాకర్ చెప్పేవారు. కొప్పుల ఈశ్వర్ కూడా ఇదే తరహాలో వ్యవహరిస్తున్నట్టు సమాచారం.గత ఎన్నికల్లో ఈజీగా గెలుస్తారూ అనుకుంటే, చివరి నిమిషంలో కొంతమంది దెబ్బ తీశారనీ, దీంతో అతి కష్టమ్మీద గట్టెక్కాల్సి వచ్చిందన్నది ఆయన ఆవేదన. మొత్తానికి, మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సొంతవారిపైనే ప్రతీకారం తీర్చుకునే పనిలోపడ్డారు తెరాస కీలక నేతలు. ఈ ప్రతీకార చర్యల్ని సీఎం కేసీఆర్ ఎలా తీసుకుంటారో చూడాలి? ఎన్ని అసంతృప్తులున్నా అందరూ కలిసి పనిచేయాలంటూ ఆయన ఆదేశించిన సంగతి తెలిసిందే