అప్పుడే మండుతున్న ఎండలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

అప్పుడే మండుతున్న ఎండలు

హైద్రాబాద్, జనవరి 23 (way2newstv.com)
సాధారణంగా ఏడాదిలో ప్రకృతి సిద్ధంగా నాలుగు నెలల చొప్పున ఎండ, వాన, శీత కాలాలు ఉంటాయి. కానీ, ప్రస్తుతం ఆయా కాలాల్లో ఉండే ఉష్ణోగ్రతలు సరిగ్గా నమోదు కావడం లేదు. అయితే, వివిధ కాలాల్లో ఉష్ణోగ్రతలు ఇలా గతి తప్పడం గ్లోబల్ వార్మింగ్ ప్రభావమేనని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఎండాకాలం ముగిసే సమయంలో నైరుతి రుతుపవనాలు కనీసం కొద్ది రోజులైనా ఆలస్యంగా వస్తుండడం ఏటా మనం చూస్తున్నదే! వానలు మొదలు కావడం, ఎండ కాయడం.. చలి కాలంలో ఉష్ణోగ్రతలు వంటివి గతంలోలా పద్ధతిగా ఉండడం లేదు.పగటిపూట ఎండలు మాత్రం ఏటికేడూ విపరీతంగా ఉంటున్నాయి. ఏటా ఉష్ణోగ్రతలో కొత్త రికార్డు నమోదవుతోంది. మరి చలికాలంలో ఉష్ణోగ్రతలు కనిష్ఠానికి పడిపోతాయా అంటే అదీ లేని పరిస్థితి! సీజన్ మొత్తంలో ఓ పక్షం రోజులు చలి బాగా ఉంటోంది. 
అప్పుడే మండుతున్న ఎండలు

ఈ చలి సీజన్‌లో ఇప్పటివరకు కేవలం రెండే రెండు బాగా చలిగా ఉన్న రోజులు నమోదైనట్లు వాతావరణ నిపుణులు తెలిపారు. గత నెల 28, 29 తేదీల్లో ఆదిలాబాద్‌లో అత్యల్పంగా 6.5 డిగ్రీలు నమోదైనట్లు వెల్లడించారు.నవంబరు నుంచి జనవరి ఆఖరు దాకా సాధారణంగా ఉత్తర దిశ నుంచి చలి గాలులు వీయాలి. అలా కాకుండా బంగాళాఖాతం తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి తేమ గాలులు ఎక్కువగా వస్తున్నట్లు వాతావరణ అధికారులు తెలిపారు. వీటి ప్రభావంతో తరుచుగా ఈ సీజన్‌లో మేఘాలు ఏర్పడుతున్నాయి. దీంతో పగటిపూట వాతావరణం వేడెక్కుతోంది. రాత్రిపూట ఈ వేడి భూ ఉపరితలంలోకి వెళ్లిపోయి చల్లబడిపోవాలి. మేఘాలు అడ్డంగా ఉండటంతో ఆ వేడి పూర్తిగా భూమిలోకి వెళ్లటంలేదు. వేడి పరావర్తనం చెంది వెనక్కివస్తోంది. దీంతో రాత్రిపూట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయి.పగటిపూట ఉష్ణోగ్రతలు కూడా 1 నుంచి 2 డిగ్రీలు ఎక్కువ నమోదవుతున్నాయి. గాలిలో కాలుష్యం పెరగటంతోనే ఈ పరిస్థితులు ఎదురవుతున్నట్లు చెబుతున్నారు. జనవరి చివరి నాటికి హైదరాబాద్‌లో 16 డిగ్రీలు ఉండాల్సిన కనిష్ఠ ఉష్ణోగ్రత 19 డిగ్రీలు ఉండటానికి కాలుష్యమే కారణమని నిపుణుల విశ్లేషణ.సాధారణంగా నవంబరు, డిసెంబరు, జనవరి మూడు నెలల్లో చలి ఎక్కువగా ఉంటుంది. ఫిబ్రవరిలో తొలి రెండు వారాలు కాస్త చలి వాతావరణం ఉన్నా.. అది అంత తీవ్రంగా ఉండదు. ఈ క్రమంలోనే వేసవి ఆనవాళ్లు మొదలవుతుంటాయి. కానీ, రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పగటిపూట వాతావరణ పరిస్థితులు చూస్తే పది రోజులు ముందే ఎండాకాలం మొదలైనట్లుగా కనిపిస్తోంది.సంక్రాంతి నుంచి ఎండల తీవ్రత పెరిగింది. ఆదిలాబాద్‌లోనూ కనిష్ఠంగా 20 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత ఉంటుండడం గమనార్హం. హైదరాబాద్‌, ఖమ్మం, భద్రాచలం, వరంగల్‌, మహబూబ్‌ నగర్‌, నిజామాబాద్‌, రామగుండం ప్రాంతాల్లోనూ 20 డిగ్రీల వరకు కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఉంటున్నాయి.హైదరాబాద్‌లో ఉండాల్సిన కనిష్ఠ ఉష్ణోగ్రత 16 డిగ్రీలుగా ఉంటే గురువారం 19.3 డిగ్రీలుగా నమోదైంది. ఆగ్నేయ, తూర్పు దిశల నుంచి వీస్తున్న గాలులు వస్తున్నంత కాలం ఉష్ణోగ్రతల పరిస్థితి ఇలాగే ఉంటుందని నిపుణులు తెలిపారు. ఇక ఫిబ్రవరి మధ్య నుంచి క్రమంగా పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతుంటాయని వెల్లడించారు.