అందని రాయితీ సొమ్ము.. - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

అందని రాయితీ సొమ్ము..

సంక్షోభంలోకి చేనేత రంగం
కడప, జనవరి 30, (way2newstv.com)
రంగుల కళ చేనేత రంగం నానాటికి సంక్షోభంలో నెట్టబడుతూండడంతో రెక్కాడినా డొక్కాడని నేతన్న బతుకులు చితికిపోతున్నాయి. పెరిగిన ముడి సరుకు ధరలకు తోడు, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 5శాతం జిఎస్టీ భారం నిత్య సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న చేనేత రంగంపై తీవ్ర ప్రభావం పడుతోంది. దీంతో రోజంతా ఇంటిల్లిపాదీ కష్టపడినా వారి కష్టానికి తగిన కూలీ లభించక ఆకలికేకలు తప్పడం లేదు.జిల్లాలో వ్యవసాయ రంగం తరువాత చేనేత రంగంపై ఆధారపడి సుమారు 40వేల కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా 190 సహకార సంఘాల్లో సుమారు 19500 మంది కార్మికులు ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి. 
అందని రాయితీ సొమ్ము..

అలాగే సహకారేత రంగంలో 20వేల మందికి పైగా చేనేత రంగంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. పాలకుల ఉదాశీనత, పర్యవేక్షించాల్సిన అధికారగణం నిర్లక్ష్యం కారణంగా నేతన్న సంక్షేమం కోరి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఎన్నో సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో అర్హులైన లబ్దిదారులకు చేరడం లేదన్నది జగమెరిగిన సత్యం. చేనేత సమస్యలపై నెలకోసారి నిర్వహించాల్సిన టాస్క్ఫోర్స్ కమిటి సమావేశం  9మాసాలుగా నిర్వహించకపోవడం తీవ్ర నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనంగా చెప్పవచ్చు.చేనేత రంగంలో ఇప్పటికే పెరిగిన ముడి సరుకు ధరలతో తీవ్ర ఇబ్బందులను నేతన్నలు ఎదుర్కొంటున్నారు. దీనికి తోడు కేంద్ర ప్రభుత్వం విధించిన 5శాతం జియస్టీ చేనేత రంగాన్ని మరింత సంక్షోభంలోకి నెట్టివేస్తోంది. పెరిగిన ముడిసరుకు ధరలు, జియస్టీ పన్ను రెండింటిని మాస్టర్ వీవర్స్ నేతన్నలకు ఇచ్చే కూలీల్లో కోత విధిస్తూండడంతో ఇంటిల్లిపాదీ రోజంతా కష్టపడినా అంతంతమాత్రంగా కూలీ పడుతోందని నేతకార్మికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.చేనేత రంగంలో నెలకొన్న సంక్షోభానికి తోడు నేత కార్మికులకు ఆసరాగా ఉన్న పట్టు రాయితీ పథకం సొమ్ము కూడా గత కొన్ని నెలలుగా నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనికి తోడు నేతన్నలకు బ్యాంకర్ల సహకారం అంతంతమాత్రంగా కొనసాగుతోంది. ఒక్కో చేనేత కార్మికుడికి రూ.లక్ష రూపాయలు ఖర్చుచేసి అన్ని రకాలుగా ఆదుకోవాలన్న ఆలోచనతో ప్రభుత్వం చేపట్టిన చేనేత క్లస్టర్లు నేతన్నల అభివృద్దికి పాటుపడే విషయం ప్రశ్నార్థకంగా కనిపిస్తోంది. జిల్లాలో ఉన్న చేనేత, పట్టు కార్మికుల అభివృద్దికి ప్రభుత్వం పలు ప్రాజెక్టులను జిల్లాలో చేపట్టింది. 2009లో  వైయస్ రాజశేఖరరెడ్డి సుమారు రూ.7.80 కోట్లతో మైలవరంలో చేపట్టిన టెక్స్‌టైల్ పార్కు, ప్రొద్దుటూరులో రూ.5.68కోట్లతో చేపట్టిన అపారెల్ పార్కు ఇప్పటికీ పూర్తిస్థాయి కార్యరూపం దాల్చకపోవడం, ప్రస్తుతం జిల్లాలో కార్మికుల అభివృద్దికి పదుల సంఖ్యలో మంజూరయిన, మంజూరవనున్న చేనేత క్లస్టర్లు ఆశయ సాధనలో వాటి కృషి అనుమానంగా కనిపిస్తోంది